Twitter: ట్విటర్‌ అల్గారిథమ్‌పై మస్క్‌ ట్వీట్, డోర్సే ఆసక్తికర రిప్లై!

ట్విటర్‌ అల్గారిథమ్‌కు సంబంధించి టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌, ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే మధ్య ఆసక్తికర్ సంభాషణ జరిగింది. 

Updated : 15 May 2022 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు 44 బిలియన్‌ డాలర్లతో మొగ్గు చూపిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్.. శుక్రవారం అనూహ్యంగా ప్రణాళికను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్విటర్‌లోని లోపాలను ఆయన మరోసారి ఎత్తి చూపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వినియోగానికి సబంధించి యూజర్లకు కీలక సూచన చేశారు. అయితే మస్క్‌ చేసిన ట్వీట్‌పై ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. అసలేం జరిగిందంటే..

‘‘యూజర్లకు ముఖ్యమైన సూచన.. మీ ఫీడ్‌కు సంబంధించి అల్గారిథమ్‌తో ట్విటర్‌ మిమ్మల్ని ఏమారుస్తోంది. దానివల్ల యూజర్లు తాజా ట్వీట్‌లను చూడలేపోతున్నారు. దాన్ని సరి చేసుకునేందుకు ట్విటర్‌ హోమ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే స్క్రీన్‌ పైభాగంలో కుడివైపున స్టార్స్‌ కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే లేటెస్ట్ ట్వీట్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు తాజా ట్వీట్‌లను చూడొచ్చు’’ అని మస్క్‌ ట్వీట్ చేశారు. 

మస్క్‌ చేసిన ట్వీట్‌కు ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రిప్లై ఇచ్చారు. ‘‘ట్విటర్‌ అల్గారిథమ్‌లో ఎలాంటి లోపాలు లేవు. యాప్‌ను ఉపయోగించనప్పుడు యూజర్ల సమయం ఆదా చేసేందుకు, చాలా కాలంగా ట్వీట్లు చూడని యూజర్ల కోసం అల్గారిథమ్‌ను అలా డిజైన్ చేశారు. తాజా ట్వీట్లు చూసేందుకు పేజ్‌ను రీఫ్రెష్‌ చేస్తే సరిపోతుంది’’ అని ట్వీట్ చేశారు.  దీనికి మస్క్ రిప్లై ఇచ్చారు. ‘‘అల్గారిథమ్‌ గురించి నాకు ఎలాంటి దురాలోచనలేదు. మీరు ఏం అనుకుంటున్నారో దాన్నే చదువుతున్నారు. బహుశా ఇలా జరుగుతోందని మీకు తెలియకపోవచ్చు’’ అని చెప్పారు. 

ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మస్క్‌ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ సంభాషణ జరగడం నెటిజన్లలో ఆసక్తిని కలిగించింది. మరోవైపు ట్విటర్‌లో నకిలీ/స్పామ్ ఖాతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో నకిలీ/స్పామ్‌ ఖాతాల సంఖ్య 5 శాతం కన్నా తక్కువేనని కంపెనీ నివేదికలో పేర్కొన్నట్లు ఉన్న వార్తను ట్వీట్‌ చేశారు. అలానే నకిలీ/స్పామ్‌ ఖాతాలను గుర్తించేందుకు తమ బృందం 100 మంది యూజర్లను శాంపిల్‌ సైజ్‌గా ఎంచుకుని సర్వే నిర్వహిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. అయితే సర్వేకు సంబంధించి శాంపిల్ సైజ్‌ను బహిర్గతం చేయడం ద్వారా తాను ఎన్‌డీఏ నిబంధనలు ఉల్లంఘించానని ట్విటర్‌ న్యాయవాదులు తనకు లీగల్‌ నోటీసులు పంపినట్లు మస్క్ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని