విండోస్‌కూ నియర్‌బై షేరింగ్‌!

గూగుల్‌ నియర్‌బై షేర్‌ ఫీచర్‌తో పరికరాల మధ్య ఫైళ్ల బదిలీ చాలా తేలికైపోయింది. స్మార్ట్‌ఫోన్లకే అందుబాటులో ఉన్న ఇదిప్పుడు విండోస్‌ పీసీలకూ విస్తరించింది.

Published : 12 Apr 2023 00:09 IST

గూగుల్‌ నియర్‌బై షేర్‌ ఫీచర్‌తో పరికరాల మధ్య ఫైళ్ల బదిలీ చాలా తేలికైపోయింది. స్మార్ట్‌ఫోన్లకే అందుబాటులో ఉన్న ఇదిప్పుడు విండోస్‌ పీసీలకూ విస్తరించింది. దీనికోసం గూగుల్‌ ప్రత్యేక డెస్క్‌టాప్‌ యాప్‌ను (బీటా వర్షన్‌) విడుదల చేసింది. కేబుళ్లతో పనిలేకుండానే ఆండ్రాయిడ్‌ ఫోన్లు, పీసీల మధ్య ఫైళ్ల బదిలీకిది వీలు కల్పిస్తుంది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి రకరకాల ఫైళ్లను దీంతో పంపొచ్చు. విండోస్‌ 10 ఓఎస్‌తో పనిచేసే 64 బిట్‌ వర్షన్‌ కంప్యూటర్‌ ఉంటే చాలు. ఎంచక్కా వాడేసుకోవచ్చు. బీటా వర్షన్‌గా ప్రస్తుతానికిది లింక్‌ ద్వారానే లభిస్తున్నప్పటికీ మున్ముందు క్రోమ్‌ స్టోర్‌లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

*  ముందుగా కంప్యూటర్‌లో బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి https://www.android.com/better-together/nearby-share-app/  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ‘ఈమెయిల్‌ మీ ఎ లింక్‌ టు బీటా’ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే మెయిల్‌కు లింక్‌ అందుతుంది. దానిపై క్లిక్‌ చేసి ‘గెట్‌ స్టార్టెడ్‌’ బటన్‌ను నొక్కాలి. ఈఎక్స్‌ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చెయ్యాలి.

* అనంతరం గూగుల్‌ ఖాతాకు సైన్‌ ఇన్‌ కావాలి. నియర్‌బై షేర్‌ యాప్‌నకు అండ్రాయిడ్‌ పరికరాన్ని అనుసంధానించాలి. ఆండ్రాయిడ్‌ పరికరంలో షేర్‌ మెనూతో గానీ విండోస్‌లో ఫైళ్లను డ్రాగ్‌ చేసి గానీ షేర్‌ చేసుకోవచ్చు.

* పీసీ నుంచి ఆండ్రాయిడ్‌ పరికరానికి ఫైలును పంపించాలంటే దాన్ని స్వీకరించేవారిని ఎంచుకోవాలి. అవతలివారు యాక్సెప్ట్‌ చేస్తేనే ఫైలు డౌన్‌లోడ్‌ అవుతుంది. అదే మనకు మనమే పంపించుకుంటే దానంతటదే డౌన్‌లోడ్‌ అవుతుంది. రెండు పరికరాలూ ఒకే గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ అయ్యుంటే ఫైల్‌ షేరింగ్‌ దానంతటదే యాక్సెప్ట్‌ అవుతుంది.

* ఆండ్రాయిడ్‌ పరికరం నుంచి పీసీకి ఫైలు పంపించాలంటే ముందుగా పీసీలో నియర్‌బై షేర్‌ యాప్‌ను రన్‌ చేయాలి. అందుబాటులో ఉన్న పరికరాల జాబితాలోంచి పీసీని ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని