Instagram: యువతను మెప్పించేలా ఇన్‌స్టా కొత్త ఫీచర్లు.. ఓ లుక్కేయండి మరి!

ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఏడు కొత్త మెసేజింగ్‌ ఫీచర్లను తీసుకొచ్చింది.

Updated : 11 May 2022 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత చింతకాయ పచ్చడిలా రోటీన్‌గా ఉంటే ఈ కాలం యూత్‌కు అంతగా నచ్చదు. మసాలా దట్టిస్తేనే భలేగా ఉందంటూ మళ్లీ కావాలంటారు. అలాంటి పంథానే అవలంభిస్తోంది ఇన్‌స్టాగ్రామ్ (Instagram). తాజాగా యూత్‌ను మెప్పించేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను (Instagram new features) ప్రవేశపెట్టింది. అవేంటో ఓ సారి చూద్దాం!


బ్రౌజ్‌ చేస్తూనే రిప్లై (Reply While You Browse)

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఎవరైనా  మెసేజ్‌ చేస్తే ఏం చేస్తాం? ప్రత్యేకంగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లి మెస్‌జ్‌ను చదివి రిప్లై ఇస్తాం. అయితే ఇన్‌బాక్స్‌కు వెళ్లకుండా డైరెక్ట్‌గా మెసేజ్‌ ఓపెన్‌ చేసి రిప్లయి ఇచ్చేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు సులువుగా మరింత సౌకర్యవంతంగా చాట్‌ చేసే వీలు ఉంటుంది.


మరింత వేగంగా.. (Quickly Send To Friends)

ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆసక్తికరమైన కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్‌ చేయడం కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. షేర్‌ బటన్‌ నొక్కి పట్టుకోవడం ద్వారా మన దగ్గరి వ్యక్తులకు/స్నేహితులకు (క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఎంచుకున్నవారికి) కంటెంట్‌ను వేగంగా షేర్‌ చేయవచ్చు. 


ఆన్‌లైన్‌లో ఎవరున్నారు? (See Who's Online)

ఇన్‌స్టాగ్రామ్‌ ఆన్‌లైన్‌లో ఉన్న వారిని సులువుగా గుర్తించేలా ఓ ఫీచర్‌ తీసుకొస్తున్నారు. యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఎంతమంది, ఏయే స్నేహితులు ఆన్‌లైన్‌లో ఉన్నారనే వివరాలను ఇన్‌బాక్స్‌లో పైన చూపిస్తుంది. 


చాట్‌లోనూ సాంగ్స్‌ షేర్‌.. (Play, pause and re-play)

ఇన్‌స్టాగ్రామ్‌లో యాపిల్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, స్పాటిఫై వంటి మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సౌకర్యాలను ఎనేబుల్‌ చేసుకునేలా మరో ఫీచర్‌ తీసుకురానుంది. దీంతో చాట్‌లో 30 సెకన్ల నిడివితో ఉన్న సాంగ్స్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు.


చాటింగ్‌ మరింత గోప్యంగా.. (Keep it on ye lo-fi)

ఇన్‌స్టాలో వ్యక్తిగత చాటింగ్‌ను గోప్యంగా ఉంచుకునేలా కొత్తగా లో-ఫై (lo-fi) అనే చాట్‌ థీమ్‌ను పరిచయం చేయనుంది. ఇదెలా పని చేస్తుందనే విషయంలో స్పష్టత లేదు.


సైలెంట్ మెసేజ్‌ (Send silent Messages)

ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌ నోటిఫికేషన్‌లో తెలుస్తుంది. అయితే ఈ మెసేజ్‌ నోటిఫికేషన్‌ వల్ల అవతలి వారికి ఇబ్బంది కలగవచ్చు. అలా ఇబ్బంది లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌ సైలెంట్ మెసేజ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. పంపే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్‌ చేస్తే మెసేజ్‌ నోటిఫికేషన్‌ సైలెంట్‌గా అవతలి వ్యక్తికి చేరుతుంది.


క్రియేట్‌ పోల్‌.. (Create a Poll with your squad)

టెలీగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఉన్నట్లుగానే ఇన్‌స్టాగ్రామ్‌ కూడా గ్రూప్‌ పోల్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో పోల్‌ను క్రియేట్‌ చేసి స్నేహితులతో పంచుకోవచ్చు. గ్రూప్‌ పోల్‌ను క్రియేట్ చేయడానికి ఒక ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  తర్వాత, యూజర్లు ఓటు వేయడానికి కొన్ని సమాధానాలను జోడించాల్సి ఉంటుంది.


గమనిక: ఇందులో కొన్ని ఆప్షన్లు ప్రయోగాత్మకంగా కొందరికి అందుబాటులో ఉన్నాయి.  త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని