ఆ వైఫైకి కనెక్ట్‌ చేస్తే... ఐఫోన్‌ పని అంతే!

ఇటీవల ఐఫోన్ వినియోగదారులకు కొత్త సమస్య వచ్చింది. ప్రత్యేక పేరుతో ఉండే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే ఐవోఎస్‌ బగ్‌ ఒకటి ఇబ్బంది పెడుతోంది.

Published : 23 Jun 2021 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల ఐఫోన్ వినియోగదారులకు కొత్త సమస్య వచ్చింది. ప్రత్యేక పేరుతో ఉండే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే ఐవోఎస్‌ బగ్‌ ఒకటి ఇబ్బంది పెడుతోంది. స్పెషల్‌ క్యారెక్టర్లతో ఉండే వైఫైను కనెక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఐఫోన్‌ స్తంభించిపోతుందని సెక్యూరిటీ రీసెర్చర్‌ ఒకతను గుర్తించాడు. పరిశోధనలో భాగంగా.. వ్యక్తిగత వైఫై హాట్‌స్పాట్‌కు ప్రత్యేక క్యారెక్టర్లతో పేరు పెట్టాడు. ఐఫోన్‌తో ఆ హాట్‌స్పాట్‌కు కనెక్ట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఐఫోన్‌ కనెక్ట్‌ కావడం లేదని కనిపెట్టాడు. అలానే పూర్తిగా వైఫై కనెక్టివిటీని డిజేబుల్‌ చేస్తున్నట్లు గుర్తించాడు. అంతేకాకుండా ఇతర హాట్‌స్పాట్‌కు కనెక్ట్‌ అవ్వడానికి కూడా కుదరడంలేదు. హాట్‌స్పాట్‌ ఎస్‌ఎస్‌డీ మార్చినా, ఐఫోన్‌ను రీబూట్ చేసినా అదే సమస్య ఉత్పన్నమవుతోంది. 

మరి పరిష్కారం ఎలా?

ఇదే సమస్య ఐఫోన్‌కేనా లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కూడా వస్తోందా అనే దానిపై పరీక్షించగా.. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఇబ్బందేమీ లేదని తేలింది. అసాధారణమైన పేరుతో ఉన్న హాట్‌స్పాట్‌కు ఎలాంటి సమస్య లేకుండా ఆండ్రాయిడ్‌ యూజర్లు కనెక్ట్‌ అవుతున్నారు. అంటే ఈ సమస్య కేవలం ఐఫోన్లలోనే వస్తున్నట్లు స్పష్టమైంది. సమస్యకు పరిష్కారం ఏంటో కూడా నిపుణులు చెబుతున్నారు. ఐవోఎస్‌ నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ను రీసెట్‌ చేస్తే సమస్య తీరిపోతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని