Telegram: యూజర్లను మెప్పించేలా టెలిగ్రామ్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు..!

ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు దీటుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో టెలిగ్రామ్‌ యూజర్లను ఆకర్షిస్తోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది.

Updated : 11 May 2022 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు దీటుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో టెలిగ్రామ్‌ యూజర్లను ఆకర్షిస్తోంది. తాజాగా మరిన్ని కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. కొత్త ఫీచర్లతో ఇక టెలిగ్రామ్‌ యాప్‌ను గతంలో కంటే సులభంగా, వేగంగా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ ఫీచర్లేంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.. 


చాట్‌ నుంచే నోటిఫికేషన్‌ టోన్స్‌..

టెలిగ్రామ్ చాట్‌లో వచ్చిన ఏదైనా సౌండ్‌ ఫైల్, వాయిస్‌ మెసేజ్‌ను నోటిఫికేషన్‌ టోన్‌గా పెట్టుకునేలా టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో సేవ్‌ చేసిన ఆడియో ఫైల్స్‌ను నోటిఫికేషన్‌ సౌండ్‌గా పెట్టుకోవచ్చు. దీనికోసం ఆడియో ఫైల్స్‌ ఉన్న చాట్‌ పేజీ మెనూ బటన్‌లో మ్యూట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత
‘కస్టమైజ్‌ (coustomize)’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.  కస్టమ్‌ నోటిఫికేషన్స్‌ను ఎనెబుల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సౌండ్‌ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి. పైన ఉన్న టెలిగ్రామ్‌ టోన్‌లో అప్‌లోడ్‌ సౌండ్‌ ఆప్షన్‌ను ఎంచుకొని నచ్చిన ఆడియో ఫైల్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. అయితే, మనం సెలక్ట్‌ చేసుకునే ఆడియోఫైల్స్‌ 300కేబీ సైజ్‌ కంటే తక్కువగా ఉండి 5సెకన్ల నిడివి మాత్రమే ఉండాలి. అంతేకాకుండా టెలిగ్రామ్‌ సౌండ్‌ సెట్టింగ్స్‌లోకెళ్లి ప్రైవేట్‌ చాట్‌, గ్రూప్‌ చాట్‌కి కూడా విడివిడిగా నోటిఫికేషన్‌ టోన్లను మార్చుకోవచ్చు.


తొందరగా మ్యూట్‌ చేసేయొచ్చు..

ఏదైనా కాంటాక్ట్‌, గ్రూప్‌ను మ్యూట్‌ చేయడానికి కొత్తగా మ్యూట్‌ ఫీచర్‌ను టెలిగ్రామ్‌ పరిచయం చేసింది. దీంతో వీలైనంత త్వరగా మ్యూట్‌ చేసేలా ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. దీనికోసం మ్యూట్‌ చేయాలనుకున్న కాంటాక్ట్‌/గ్రూప్‌ను ఎంచుకోవాలి. ప్రోఫైల్‌ ఓపెన్‌ అయిన వెంటనే నోటిఫికేషన్స్‌ ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. డిసేబుల్‌ సౌండ్‌, మ్యూట్‌ నోటిఫికేషన్‌ ఫర్‌, కస్టమైజ్‌, మ్యూట్‌ ఫర్‌ ఎవర్‌ వంటి ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతేకాదు కస్టమైజ్‌ ఆప్షన్‌ ద్వారా నోటిఫికేషన్‌ టోన్‌ను మార్చుకునే వెసులుబాటు ఇక్కడ కూడా ఉంటుంది.


పిక్చర్‌ ఇన్‌ పిక్ఛర్‌ మోడ్‌..

టెలిగ్రామ్‌లో మెరుగైన పిక్చర్‌ అనుభవం కోసం ‘పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌’ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ సాయంతో మనకు అనుకూలంగా వీడియోను జూమ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, మ్యాక్‌ఓఎస్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లోనూ పనిచేస్తుంది. ఇప్పటికే ఐఫోన్‌లోనూ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.


మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌..

టెలిగ్రామ్‌కు వచ్చిన మెసేజ్‌ ఇతర భాషలోకి తర్జుమా చేసుకునేలా ‘మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం లాంగ్వేజ్‌ సెట్టింగ్‌లోకెళ్లి ట్రాన్స్‌లేట్‌ బటన్‌ను ఎనెబుల్‌ చేసుకోగానే చాట్‌ మెసేజ్‌పై క్లిక్‌ చేస్తే ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ కనిపిస్తోంది.


ఆటోమెటిక్‌ మెసేజ్‌ డిలీట్‌..

ఇతరులతో మనం చేసిన చాటింగ్‌ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవ్వడానికి ‘ఆటో డిలీట్‌ ఫీచర్‌’ పనిచేస్తుంది. ఈ ఆప్షన్‌ కోసం కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసి త్రీ డాట్స్‌ మెనూపై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆటో డిలీట్‌ ఆప్షన్‌ కనిపిస్తోంది. దీనిపై క్లిక్‌ చేయగానే టైం లిమిట్‌ చూపిస్తోంది. మనం సెట్‌ చేసుకున్న టైం లిమిట్ ప్రకారం ఆ మెసేజ్‌ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది.


స్వైప్‌ లెఫ్ట్‌ రిప్లయి..

వాట్సాప్‌ తరహాలోనే ఇతరులకు సులువుగా కన్వే అయ్యే విధంగా మెసేజ్‌కు ప్రత్యేకంగా రిప్లయి ఇచ్చేందుకు ‘స్వైప్‌ లెఫ్ట్‌ రిప్లయి’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎడమ వైపు స్వైప్‌ చేస్తే మెసేజ్‌కు రిప్లయి ఇవ్వొచ్చు. కుడివైపు స్వైప్‌ చేస్తే టెలిగ్రామ్‌ హోం పేజీకి వెళ్లేలా ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని