Notes: నోట్స్‌.. కొత్తకొత్తగా!

ఐఫోన్‌లో బాగా ఉపయోగపడే యాప్స్‌లో నోట్స్‌ ఒకటి. బిల్టిన్‌గా డాక్యుమెంట్‌ స్కానర్‌ వంటి అదనపు ఫీచర్లూ దీని సొంతం. ఐఓఎస్‌18 రాకతో ఇది మరింత మెరుగైంది కూడా.

Published : 10 Jul 2024 01:26 IST

ఐఫోన్‌లో బాగా ఉపయోగపడే యాప్స్‌లో నోట్స్‌ ఒకటి. బిల్టిన్‌గా డాక్యుమెంట్‌ స్కానర్‌ వంటి అదనపు ఫీచర్లూ దీని సొంతం. ఐఓఎస్‌18 రాకతో ఇది మరింత మెరుగైంది కూడా. ఈ కొత్త ఓఎస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టయితే యాపిల్‌ నోట్స్‌లోని కొత్త ఫీచర్లను ఓసారి ప్రయత్నించి చూడండి. ఆశ్చర్యపోవటం ఖాయం.

వాయిస్‌ నోట్స్‌ తీసుకోవటం

ఐఓఎస్‌ 18లోని యాపిల్‌ నోట్స్‌ ఇప్పుడు వాయిస్‌ రికార్డింగ్స్‌నూ సపోర్టు చేస్తుంది. ఇది త్వరగా వాయిస్‌ నోట్స్‌ను తీసుకోవటమే కాకుండా వాటిని టెక్స్ట్‌ మధ్యలో పొందుపరుస్తుంది కూడా. వాయిస్‌ నోట్‌ను రికార్డు చేసుకున్నాక దాన్ని ఇతరులతోనూ షేర్‌ చేసుకోవచ్చు. ఇతరుల వాయిస్‌ నోట్‌ను ఎంచుకొని ఎవరితోనైనా షేర్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. వాయిస్‌ నోట్‌ను సృష్టించుకోవాలంటే- ముందుగా కొత్త నోట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత పేపర్‌క్లిప్‌ గుర్తును తాకి రికార్డు ఆడియో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ఎర్ర రికార్డు బటన్‌ను నొక్కి మాట్లాడితే చాలు. మధ్యలో ఆపాలనుకుంటే పాజ్‌ బటన్‌ను నొక్కాలి. పూర్తయ్యాక డన్‌ మీటను తాకాలి.

మాటలు అక్షరాలుగా

వాయిస్‌ నోట్స్‌ను అక్షరాలుగా మార్చే (ట్రాన్స్‌క్రైబ్‌) వెసులుబాటు కూడా ఉంది. దీంతో చేత్తో టైప్‌ చేయాల్సిన అవసరం తప్పుతుంది. కేవలం మాటలతోనే పదాలను సృష్టించుకోవచ్చు. ఐఫోన్‌ 12, ఆ తర్వాతి ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ప్రస్తుతానికి ఆంగ్లాన్ని (ఇంగ్లిష్‌ యూకే, యూఎస్, ఆస్ట్రేలియా వంటివి) మాత్రమే సపోర్టు చేస్తుంది. అదనంగా ఇంగ్లిష్‌ (ఇండియా) వర్షన్‌నూ సపోర్టు చేస్తున్నప్పటికీ దీనికి ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్‌ ఇంకా అందుబాటులో లేదు. నోట్స్‌లో ఆడియో రికార్డింగ్‌ మీద తాకి, తెర కింద ఎడమవైపున కనిపించే కొటేషన్‌ మార్క్‌ను నొక్కితే చాలు. మాట్లాడే మాటలు అక్షరాల్లోకి మారతాయి.

లెక్కల సాధన

లెక్కలను పరిష్కరించటానికీ నోట్స్‌ యాప్‌ ఉపయోగపడుతుంది. ఆయా వివరాలను తెలియజేస్తే వాటి విలువలను చిటికెలో చెప్పేస్తుంది. ఉదాహరణకు- ఎక్స్‌=10, వై=20, జెడ్‌=30 అని వివరించారనుకోండి. వాటి మొత్తమెంతో లెక్కించేస్తుంది. కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి సాధారణ లెక్కలేవైనా చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్‌లో కొత్తగా వచ్చిన మ్యాత్‌ నోట్స్‌లోని పరిజ్ఞానంతోనే ఈ నోట్స్‌ యాప్‌ లెక్కలను సాధిస్తుంది.

పెద్ద నోట్స్‌లో పైకీ కిందికీ

నోట్స్‌ను విభాగాల కింద విడగొట్టుకునే సదుపాయం ఇంతకుముందు నుంచే ఉంది. కానీ చాలా విభాగాలను యాడ్‌ చేసుకుంటే త్వరగా చదువుకోవటం కష్టమవుతుంది. ఐఓఎస్‌ 18లో ఈ విభాగాలను కలిపే ఫీచర్‌ జత చేరింది. దీంతో నోట్స్‌ను స్క్రోల్‌ చేస్తూ త్వరగా చివరికి చేరుకోవచ్చు. అలాగని నోట్స్‌ విభాగాలేమీ డిలీట్‌ కావు. ఒకదగ్గర కలుస్తాయంతే. ఏదైనా నోట్స్‌ సెక్షన్‌కు హెడ్డింగ్‌ శైలిని ఆపాదించి, తర్వాత దాన్ని కొలాప్స్‌ చేస్తే చాలు. విభాగాలన్నీ మాయమవుతాయి.

రంగులతో ఆకర్షణీయం

కొందరు టైప్‌ చేస్తున్నప్పుడు వేర్వేరు రంగులను వాడుకోవటానికి ఆసక్తి చూపుతుంటారు. నోట్‌లో ముఖ్యమైన అంశాలను తేలికగా గుర్తించటానికి, ఇతర అంశాలతో కలవకుండా ఉండటానికి రంగులను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు కీబోర్డు మీదుండే నోట్స్‌ టూల్‌బార్‌లో ఏఏ బటన్‌ మీద తాకి, రెండో వరుసలోని వృత్తాన్ని ఎంచుకుంటే వేర్వేరు రంగులకు మారొచ్చు. నీలం, ఎరుపు, నారింజ, గులాబీ.. ఇలా ఇష్టం వచ్చిన రంగుల్లో అక్షరాలు టైప్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని