OnePlus Folding Phone: వన్‌ప్లస్‌ మడత ఫోన్‌ సిద్ధమవుతోంది..!

వన్‌ప్లస్‌ కూడా కొత్త మడత మోడల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడు పీట్‌ లా మడత ఫోన్‌ మెకానిజమ్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు...

Updated : 15 Aug 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ మారింది.. గతేడాది వరకు సింగిల్‌ స్క్రీన్‌ ఫోన్లవైపు మొగ్గుచూపిన యూజర్లు, క్రమంగా మడతఫోన్లపై మనసుపారేసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం వరుసగా మడతఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవలే శాంసంగ్‌, షావోమి, మోటోరోలా కంపెనీలు కొత్త మడత ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా వన్‌ప్లస్‌ కూడా కొత్త మడత మోడల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్‌ సహ వ్యవస్థాపకుడు పీట్‌ లా మడత ఫోన్‌ మెకానిజమ్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీని ప్రకారం వన్‌ప్లస్‌ మడత ఫోన్‌ రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ..ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందట.       

వన్‌ప్లస్‌ మడత ఫోన్‌ నమూనా చిత్రాన్ని షేర్‌ చేస్తూ ‘‘ఫోల్డింగ్‌ ఫోన్‌లో మీరు ఎలాంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోల్డింగ్ టెక్నాలజీని చేరుకోవడానికి మాకు ఎన్నో ఏళ్ల సమయం పట్టింది. ఈ కొత్త మెకానిజమ్‌ గురించి మీరు ఏమనుకుంటున్నారు’’ అని పీట్‌ లా ట్వీట్ చేశారు. కొత్తగా తీసుకొస్తున్న మడత ఫోన్‌లో యూజర్‌ కోరుకున్నట్లు పెద్ద డిస్‌ప్లేతోపాటు, ఫోన్‌ను ట్యాబ్‌లాగా ఉపయోగించుకోవచ్చు. గతేడాదే ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు విలీనం అయిన సంగతి తెలిసిందే. ఒప్పో ఫైండ్‌ ఎన్‌ పేరుతో మడతఫోన్‌ను విడుదల చేసింది. పీట్‌ లా ప్రకటనతో టెక్‌ యూజర్లు వనప్లస్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని