OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో 5జీ ఫోన్‌.. ధర, స్పెసిఫికేషన్లు ఇవీ..

నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ 5జీ ఫోన్‌ను వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్‌-రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో మీడియాటెక్ ప్రాసెసర్‌, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లున్నాయి. మరి నార్డ్‌ 2 5జీ ధరెంత..ఏయే వేరియంట్లలో లభిస్తుంది..ఎప్పటి నుంచి అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభంకానున్నాయి వంటి వివరాలు తెలుసుకుందాం.   

Updated : 22 Jul 2021 21:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ 5జీ ఫోన్‌ను వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్‌-రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో మీడియాటెక్ ప్రాసెసర్‌, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లున్నాయి. మరి నార్డ్‌-2 5జీ ధరెంత? ఏయే వేరియంట్లలో లభిస్తుంది? అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభంకానున్నాయి వంటి వివరాలు తెలుసుకుందాం...

వన్‌ప్లస్‌ నార్డ్‌-2 5జీ ఫీచర్స్

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఆక్సిజన్‌ 11.3 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఓఎస్‌లో డార్క్‌మోడ్‌ కూడా ఉంది. ఇందులో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2ఎంపీ మోనో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ఇంకా నైట్‌స్కేప్‌ అల్ట్రా, నైట్ పొట్రైట్, ఓఐఎస్‌, ఏఐ వీడియో, ఏఐ ఫొటో, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. నార్డ్ 2లో 4,500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 65వాట్ వ్రాప్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 

మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ.29,999 కాగా.. 12జీబీ/256జీబీ వేరియంట్‌ ధర రూ.34,999. బ్లూ హేజ్‌, గ్రే సియెర్రా, గ్రీన్‌ వుడ్స్‌ రంగుల్లో లభించనుంది. అమెజాన్ ప్రైమ్‌, రెడ్‌ కేబుల్ ఖాతాదారులు జులై 26 నుంచి, సాధారణ వినియోగదారులు జులై 28 నుంచి వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీని కొనుగోలు చెయ్యొచ్చు. ఇవి కాకుండా 6జీబీ/128జీబీ వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు వన్‌ప్లస్‌ వెల్లడించింది. దీని ధర రూ. 27,999గా నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ వేరియంట్ అమ్మకాలు ప్రారంభకానున్నాయి.  

దీంతోపాటు వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో ఇయర్‌బడ్స్‌ని కూడా వన్‌ప్లస్‌ విడుదలచేసింది. ఇందులో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ) ఉంది. మూడు మైక్రోఫోన్స్‌ ఉన్నాయి. జెన్ మోడ్‌ ఎయిర్‌, 11 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఇస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏఎన్‌సీ 23 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. కేవలం పది నిమిషాల్లో పది గంటలకు సరిపడా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. వైట్‌, బ్లాక్‌ రంగుల్లో ఇవి లభిస్తాయి. వీటికి ఐపీ55తో వాటర్‌, డస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీటిని ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే విక్రయిస్తున్నారు. త్వరలోనే భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తామని వన్‌ప్లప్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని