OnePlus foldable phone: వన్‌ప్లస్‌ నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు

చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఫోల్డబుల్‌ (foldable phone) ఫోన్లను తీసుకురావడానికి

Updated : 11 May 2022 18:43 IST

(source: Twitter - ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్ డెస్క్: చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్‌ (foldable phone) స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. వీటిని త్వరలోనే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత్‌లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఒప్పో ఫైండ్‌ ఎన్‌ (Oppo Find N) మాదిరిగానే వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్ల ఫీచర్లు ఉంటాయని ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. 

కాగా, వన్ ప్లస్.. ఒప్పోతో విలీనం అవుతున్నట్లు గతేడాది జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విలీనం తర్వాత ఈ రెండు టెక్‌ దిగ్గజాలు కలిసి తీసుకొస్తున్న తొలి ప్రధాన ఫోన్‌గా వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ (OnePlus foldable phone) కావడం గమనార్హం.


(source: Oppo website)

స్పెసిఫికేషన్లు ఇవే..

ఒప్పో ఫైండ్‌ ఎన్‌ మొబైల్లో 7.1 అంగుళాల ఇన్నర్‌ డిస్‌ప్లేతో రిఫ్రెష్‌రేటు 120 హెర్జ్‌తో స్కాట్‌ యూటీజీ గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. అలాగే 60 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 5.49 అంగుళాల ఔటర్‌ డిస్‌ప్లేను కూడా ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌సెట్‌ను వాడారు. అయితే, వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ 1 చిప్‌సెట్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో 12జీబీ ఎల్‌డీడీఆర్‌5, 512 జీబీ ర్యామ్‌తో 3.1 యూఎఫ్‌ఎస్‌ స్టోరేజీ సామర్థ్యం ఉండేలా ఈ ఫోన్‌ను  తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్‌ ఎన్‌ ఫోన్‌లో 50 మెగా ఫిక్సల్‌ ప్రధాన కెమెరాను అమర్చారు. 16 మెగా ఫిక్సల్ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 13 మెగా ఫిక్సల్‌ టెలీఫొటో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ  సామర్థ్యం ఇచ్చారు. 33  వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసేలా దీన్ని తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని