Smartphones: మార్కెట్‌లోకి కొత్త గ్యాడ్జెట్స్‌.. ఏం వచ్చాయి, ఏం రానున్నాయి?

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మంగళవారం భారత మార్కెట్లోకి పలు కొత్త మోడల్‌ మొబైళ్లను విడుదల చేశాయి. వీటితోపాటు మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 ఓఎస్‌తో కొత్త ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. 

Updated : 15 Feb 2022 20:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస కొత్త ఫోన్ల విడుదలతో భారత మొబైల్ మార్కెట్‌లో జోష్‌ పెరిగింది. ఈ ఏడాదిలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానుండటంతో మార్కెట్లో 5జీ కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పోకో, ఇన్ఫీనిక్స్‌ కంపెనీలు కొత్త 5జీ ఫోన్లను విడుదల చేయగా, అసుస్‌ 5జీ గేమింగ్‌ మోడల్‌ను, 10 సిరీస్‌లో రెడ్‌మీ 2022 మోడల్‌ను తీసుకొచ్చాయి. వీటితోపాటు శాంసంగ్‌, నోకియా, పోకో కంపెనీలు కొత్త మోడల్‌ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఈ ఫోన్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేసి, అనువైన మోడల్‌ను ఎంచుకోండి మరి!


పోకో ఎమ్‌4 ప్రో 5జీ (Poco M4 pro 5G)

గతంలో పోకో కంపెనీ ఎమ్‌3 ప్రో 5జీ మోడల్‌ను విడుదల చేయగా, తాజాగా 5జీ శ్రేణిలో ఎమ్‌4 ప్రో 5జీను పరిచయం చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇస్తున్నారు. ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెండు వేరియంట్లో పోకో ఎమ్‌4 ప్రో 5జీ లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999. 6 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 16,999. 8 జీబీ/128 జీబీ ధర రూ. 18,999. ఫిబ్రవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.     


అసుస్‌ రోగ్‌ ఫోన్ 5ఎస్‌ (Asus ROG Phone 5s)

గేమింగ్ ప్రియుల కోసం అసుస్‌ కంపెనీ రోగ్‌ సిరీస్‌లో మరో కొత్త 5జీ మోడల్‌ను విడుదల చేసింది. అసుస్‌ రోగ్‌ ఫోన్ 5ఎస్‌, అసుస్ రోగ్‌ ఫోన్‌ 5ఎస్‌ ప్రో పేరుతో రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రోగ్ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. రెండింటిలో 144 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్, 360 హెర్జ్‌ టచ్ శాంప్లింగ్‌తో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ శాంసంగ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మెరుగైన గేమింగ్ అనుభూతి కోసం వీటిలో 2.5డీ కర్వడ్ గ్లాస్‌తోపాటు పిక్సెల్‌వర్క్‌ ఐ6 డిస్‌ప్లే ప్రాసెసర్‌ను అమర్చారు. రోగ్‌ ఫోన్ 5ఎస్‌ ప్రో మోడల్‌లో రోగ్‌ విజన్‌తో చిన్న పామోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. రెండింటిలోనూ స్నాప్‌డ్రాగన్‌ 888+ 5జీ ప్రాసెసర్ ఉపయోగించారు.   

ఈ ఫోన్లలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 13 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. డ్యూయల్ ఫ్రంట్‌ స్టీరియో స్పీకర్స్‌ కూడా ఉన్నాయి. వీటిలో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అసుస్‌ రోగ్ ఫోన్‌ 5ఎస్‌ 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 49,999గాను, 12 జీబీ/256 జీబీ ధర రూ. 57,999. అసుస్‌ రోగ్ ఫోన్‌ 5 ఎస్‌ ప్రో 12 జీబీ ర్యామ్‌/ 512 జీబీ ధర రూ. 79,999గా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. 


ఇన్ఫీనిక్స్‌ జీరో 5జీ (Infinix Zero 5G)

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫీనిక్స్‌ జీరో 5జీలో వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999. ఫిబ్రవరి 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు. 


రెడ్‌మీ 10 2022 (Redmi 10 2022)

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ అడాప్టివ్‌సింక్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌, 9 వాట్ రివర్స్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌/ 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ధర, ఫోన్‌ అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.


మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ (Microsoft Surface Laptop)

మైక్రోసాఫ్ట్ కంపెనీ సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 11వ జనరేషన్‌ ఇంటెల్‌కోర్‌ హెచ్‌35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నివిడియా జీఈఫోర్స్‌ ఆర్‌టీఎక్స్‌ గ్రాఫిక్‌ కార్డు ఉంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 14.4 పిక్సెల్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ల్యాపీలో ల్యాప్‌టాప్‌, స్టేజ్‌, స్టూడియో అనే మూడు మోడ్‌లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ మోడ్‌లో ఫుల్‌ కీబోర్డ్, టచ్‌పాడ్ యూజర్‌కు అందుబాటులో ఉంటాయి. స్టేజ్‌ మోడ్‌లో గేమింగ్‌, స్ట్రీమింగ్‌, డాకింగ్‌కు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లేను ముందుకు జరపవచ్చు. స్టూడియో మోడ్‌లో ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లేను డ్రాయింగ్ వంటి వాటి కోసం ఉపయోగించవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఐ5 ప్రాసెసర్‌/ 16 జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌, ఐ5/16 జీబీ ర్యామ్‌/512 జీబీ వేరియంట్లతోపాటు ఐ7 ప్రాసెసర్‌/16 జీబీ/ 512 జీబీ, ఐ7/32 జీబీ ర్యామ్‌/1టీబీ స్టోరేజ్‌, ఐ7/32 జీబీ ర్యామ్‌/ 2టీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1,56,999గా కంపెనీ నిర్ణయించింది. 


రాబోయే ఫోన్లు ఇవే

శాంసంగ్ గెలాక్సీ ఏ23 (Samsung Galaxy A23)

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ23, గెలాక్సీ ఏ23 5జీ వేరియంట్లలో పరిచయం చేయనుంది. గెలాక్సీ ఏ23లో స్నాప్‌డ్రాగన్‌ 680, ఏ23 5జీ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందట. సాధారణ వేరియంట్‌లో 6.55 అంగుళాల డిస్‌ప్లే, 5జీ వేరియంట్‌లో 6.4 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లలో వెనుకవైపు నాలుగు (50 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ + రెండు 2 ఎంపీ) కెమెరాలుంటాయని తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా, బ్యాటరీ వివరాలు తెలియాల్సివుంది. మార్చిలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తారని టెక్‌ వర్గాలు తెలిపాయి. 


నోకియా జీ21 (Nokia G21)

నోకియా జీ21లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. బ్యాటరీ సేవింగ్‌ కోసం రిఫ్రెష్‌ రేట్‌ను 60 హెర్జ్‌కు తగ్గించుకోవచ్చు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నోకియా జీ20 మోడల్‌కు కొనసాగింపుగా జీ21ను తీసురానుంది. ఇందులో 12ఎన్‌ఎమ్‌ యూనిసాక్‌ టీ606 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 5,050 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. నోకియా ముందుగా ఈ ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసి, తర్వాత భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. 


పోకో ఎఫ్‌4 జీటీ (Poco F4 GT)

పోకో కంపెనీ ఎఫ్‌4 జీటీ పేరుతో గేమింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే పోకో కంపెనీ ఎఫ్‌ సిరీస్‌లో  ఎఫ్‌3 జీటీ గేమింగ్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో పనిచేస్తుందట. పోకో ఎఫ్‌4 జీటీలో 4,560 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ ఇస్తున్నారట. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ముందు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని