Pollution Sensors: ఆ సెన్సర్‌లు కాలుష్యాన్ని పసిగడతాయట!

పట్టణాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్య. దీన్ని తగ్గించటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. మరి మూలంలోనే కాలుష్యాన్ని అరికట్టగలిగితే? హాంకాంగ్‌ ఇలాంటి పనే చేపట్టింది కాలుష్యాన్ని...

Updated : 16 Mar 2022 16:20 IST

పట్టణాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్య. దీన్ని తగ్గించటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. మరి మూలంలోనే కాలుష్యాన్ని అరికట్టగలిగితే? హాంకాంగ్‌ ఇలాంటి పనే చేపట్టింది కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే వాహనాలను పసిగట్టటంపై దృష్టి సారించింది. ఇందుకు ప్రత్యేక సెన్సర్ల సాయం తీసుకోవటం విశేషం. పట్టణాల్లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే పొగే. పెట్రోలు, డీజిల్‌తో నడిచే కార్లు, వ్యాన్లు, లారీలు, బస్సుల నుంచి వెలువడే పొగలో కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్ల వంటి హానికర రసాయనాలెన్నో ఉంటాయి. కొత్త వాహనాల్లో వీటిని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. కానీ పాత పడుతున్న కొద్దీ కాలుష్యం వెదజల్లటం ఎక్కువవుతుంది. అందుకే పెద్దమొత్తంలో కాలుష్యాన్ని వెలువరించే వాహనాలను గుర్తించటానికి హాంకాంగ్‌ రోడ్ల పక్కన ప్రత్యేక సెన్సర్లను అమర్చింది. ఇవి పరారుణ, అతి నీలలోహిత కాంతి పుంజాల సాయంతో వాహనాల పొగలోంచి వెలువడే వాయువులను గుర్తిస్తాయి. కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తెలియగానే కెమెరాలు ఆయా వాహనాల నంబరు ప్లేట్లను ఫొటోలు తీస్తాయి. తర్వాత వాహన యజమానులకు నోటీసులు అందుతాయి. వాహనాలను మరమ్మతు చేసుకొని, ఉద్గారాల పరీక్షలో నెగ్గేంతవరకు అవి తిరిగి రోడ్ల మీదికి ఎక్కటానికి వీలుండదు. ఇలా గుర్తించిన వాటిల్లో 96% వాహనాలు కాలుష్య పరీక్షలో నెగ్గిన తర్వాతే రోడ్ల మీదికి రావటం విశేషం. ఈ పథకంతో అక్కడ వాయు కాలుష్యం వేగంగా తగ్గినట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. కాలుష్యాన్ని పసిగట్టే సెన్సర్లను కొన్ని దేశాల్లో ఇప్పటికే పరీక్షిస్తున్నారు. కానీ వీటిని అమలు చేసిన మొదటి దేశంగా హాంకాంగ్‌ పేరు కొట్టేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని