Startup: ఒకప్పటి డ్రాపౌట్‌ .. జియో పెట్టుబడులు పట్టేశాడు..!

స్టార్టప్‌ టూ (TWO) ప్లాట్‌ఫారమ్‌లో సుమారు రూ.111కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు జియో ఇటీవల ప్రకటించింది. మరి ఇంతకీ ఈ అంకురం ఎవరిది?

Published : 06 Feb 2022 20:15 IST

సిలికాన్‌ వ్యాలీకి చెందిన డీప్‌ టెక్నాలజీ స్టార్టప్‌ టూ (TWO) ప్లాట్‌ఫారమ్‌లో 15 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.111కోట్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికాం దిగ్గజం జియో ఇటీవల ప్రకటించింది. ఆ కంపెనీలో 25 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. మరి ఇప్పుడెప్పుడే ప్రస్థానం మొదలుపెట్టి, అంతలా జియో పెట్టుబడులు పట్టేసి, ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ అంకురం ఇంతకీ ఎవరిది? దీని గొప్పతనమేంటి?

దిగ్గజాలను తోసిరాజని.. 

స్టార్టప్‌ టూ వెనుక ఉన్నది కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే. కొన్నేళ్లుగా ప్రముఖ టెక్‌ కంపెనీల్లో పనిచేసిన ప్రణవ్‌ మిస్త్రీ గతేడాదే దీనిని నెలకొల్పాడు. శాంసంగ్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, నాసాలో పనిచేసిన మిస్త్రీకి భవిష్యత్తు తరం సాంకేతికతలపై మంచి పట్టుంది. ఈ అనుభావంతోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, మెటావర్స్‌, మెబ్‌ 3.0.. వంటి రేపటి టెక్నాలజీలపై పనిచేసే కంపెనీని తీసుకొచ్చాడు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌, గేమింగ్‌, రిటైల్‌, సర్వీసెస్‌, ఎడ్యుకేషన్‌, హెల్త్‌ విభాగాల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు తీసుకురావాలని యోచిస్తున్నాడు మిస్త్రీ. ఈ మేరకు ఎంతో అనుభవం, సామర్థ్యం కలిగిన టూ బృందం పనితీరు మమ్మల్ని ఆకట్టుకుందని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. అటు డిజిటల్‌ ఇండియాకు పునాది వేసిన జియోతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు.

ప్రస్థానమిదే..

ప్రణవ్‌ మిస్త్రీ స్వస్థలం గుజరాత్‌లోని పాలన్‌పూర్‌. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 1981లో జన్మించిన మిస్త్రీ అహ్మదాబాద్‌లోని CEPT వర్శిటీ డ్రాపౌట్‌ . తొలుత ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ కోసమని వెళ్లి మధ్యలోనే ఆపేశాడు. తర్వాత గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి 2003లో కంప్యూటర్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆపై ఐఐటీ బాంబేలో డిజైన్‌ ఇన్‌ మాస్టర్స్‌ చేస్తూనే పరిశోధన సహాయకుడిగానూ పనిచేశాడు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ మేకర్‌ ఇండియా ఇంక్యుబేషన్‌ టీంలో డైరెక్టర్‌గా (2005 నుంచి 2006 వరకు) ఉన్నాడు. ఇలా మైక్రోసాఫ్ట్‌లో దాదాపు ఏడాది పనిచేసిన అనంతరం మిస్త్రీ MIT నుంచి మీడియా ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌ చేశాడు. అదే సబ్జెక్ట్‌లో MIT నుంచే పీహెచ్‌డీని అభ్యసించి 2012లో తప్పుకున్నాడు. 

ఇక 2006 నుంచి 2012 మధ్య ప్రణవ్‌ మిస్త్రీ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, నాసాలో పరిశోధకుడిగా పనిచేశాడు. 2009 నవంబర్‌ నుంచి ఓ మూడు నెలల పాటు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీకి విజిటింగ్ రీసెర్చర్‌గానూ ఉన్నాడు. సరిగ్గా 2012 మే నెలలో శాంసంగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పయనం మొదలుపెట్టాడు. 2017లో శాంసంగ్‌ కంపెనీలో కార్పొరేట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులై.. మొబైల్‌ ఇన్నోవేషన్‌ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ రెండేళ్లలోనే మిస్త్రీ శాంసంగ్‌ టెక్నాలజీ, అడ్వాన్సడ్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌, సీఈవోగానూ పనిచేశాడు. ఈ మేరకు శాంసంగ్‌ మొదటి స్మార్ట్‌వాచ్‌ వంటి అనేక ప్రాజెక్టులకు, కంపెనీ ఇంటర్నల్‌ థింక్‌ ట్యాంక్‌ బృందానికి నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఇంతటి అనుభవం, సామర్థ్యం కలిగిన ప్రణవ్‌ మిస్త్రీ స్టార్టప్‌ నుంచి ఏ ఆవిష్కరణ వస్తుందో వేచిచూడాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని