పబ్‌జీ లవర్స్‌..మరికొంత కాలం ఎదురుచూపులేనా..

గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పబ్‌జీ గేమ్‌ కోసం మరి కొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. కొద్ది రోజుల క్రితం పబ్‌జీ కార్పొరేషన్‌ మాతృ సంస్థ క్రాఫ్టన్‌ ఇన్‌కో కొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్‌ పేరుతో గేమ్‌ని...

Updated : 27 Dec 2022 18:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న పబ్‌జీ గేమ్‌ కోసం మరి కొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. కొద్ది రోజుల క్రితం పబ్‌జీ కార్పొరేషన్‌ మాతృ సంస్థ క్రాఫ్టన్‌ ఇన్‌కో కొత్త లుక్‌తో పబ్‌జీ మొబైల్‌ పేరుతో గేమ్‌ని భారత్‌లో తిరిగి తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో నవంబర్‌ 20వ తేదీన కొత్త పబ్‌జీ గేమ్‌ను విడుదల చేస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకు కొత్త గేమ్‌ విడుదల తేదీపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం పబ్‌జీ మొబైల్‌ పేరుతో తిరిగి భారత్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపే వీడియో టీజర్‌ని మాత్రం వారం రోజుల క్రితం విడుదల చేశారు. దీంతో శుక్రవారం గేమ్‌ విడుదల చేస్తారని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురయింది.

గతంలో సైబర్‌ సెక్యూరిటీ ఇబ్బందులతో కేంద్రం పబ్‌జీతో సహా చైనాకు చెందిన 117 యాప్‌లపై నిషేధం విధించింది. దీంతో పబ్‌జీ పబ్లిషర్‌గా ఉన్న టెన్సెంట్‌తో క్రాఫ్టన్‌ ఒప్పందం రద్దు చేసింది. తాజాగా మైక్రోసాఫ్ట్‌తో కలిసి పబ్‌జీ మొబైల్ పేరుతో భారత మార్కెట్లోకి తిరిగి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే భారత మార్కెట్‌ కోసం గేమ్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు తెలిపింది. అంతేకాదు స్థానిక సంస్థలతో కలిసి తమ వ్యాపార పరిధిని విస్తరింపజేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే భారత్‌లో వీడియో గేమ్, ఈ-స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ విభాగాలకు సంబంధించి వంద మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ముందస్తుగా వంద మంది ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు తెలిపింది. అలానే భారత్‌లో గేమర్స్‌ గోప్యత, సమాచార భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్‌ గేమర్స్‌ గురించిన సమాచారం ఉండే స్టోరేజ్‌ సిస్టంల మీద తరచుగా ఆడిట్ నిర్వహిస్తామని తెలిపింది. భారత్‌లో మరింత మందికి చేరువ కావాలనే లక్ష్యంతో గేమ్‌లో కొత్త క్యారెక్టర్స్‌, ప్రదేశాలను యాడ్‌ చేసినట్లు పబ్‌జీ కార్పొరేషన్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని