Published : 16 May 2022 15:54 IST

Realme: రియల్‌మీ నుంచి అదిరే 5జీ స్మార్ట్‌ఫోన్లు.. 12 రోజులు ఛార్జ్‌ వచ్చే స్మార్ట్‌వాచ్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ యూజర్ల కోసం కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకువస్తోంది. 5జీ నెట్‌వర్క్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లతోపాటు అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేయనుంది. మే 18న జరిగే డిజిటల్‌ ఈవెంట్‌లో వీటిని భారత్ మార్కెట్లలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరి ఈ ప్రొడక్ట్స్‌ ఫీచర్లేంటో ఓసారి చూద్దాం..


రియల్‌మీ నార్జో 50 (అంచనా)

రియల్‌మీ నార్జో సిరీస్‌లో నార్జో 50 (Realme Narzo 50) పేరిట మరో కొత్త ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. 2డీ డిజైన్‌లో 8ఎంఎం మందంతో ఫోన్‌ తీసుకొస్తోంది. 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 810 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. కెమెరా విషయానికొస్తే..  ఫోన్‌ వెనుకభాగంలో దీర్ఘచతురస్రాకారంలో డిజైన్‌ చేసిన వాటిలో 48 ఎంపీ+2ఎంపీ కెమెరాలు, ముందువైపు సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా ఇవ్వనున్నారు. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్‌గా ఉంటుంది.


రియల్‌మీ నార్జో 50 ప్రో (అంచనా)

రియల్‌మీ నార్జో సిరీస్‌లోనే 50 ప్రో (Realme Narzo 50 Pro) పేరిట ఇంకొక మొబైల్‌ను కంపెనీ తీసుకురానుంది. 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో విడుదల చేయనున్నారు. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 920 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను వాడారు. ఇది కూడా 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ రెండు వేరియంట్లలో లభించనుంది.  ఫోన్‌ వెనుకభాగంలో ట్రిపుల్‌ కెమెరా ఇవ్వనున్నారు. 48ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలతో పాటు ముందుభాగంలో 16ఎంపీ కెమెరా అమర్చనున్నారు. దీనిలోనూ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.


రియల్‌మీ టెక్‌లైఫ్‌ వాచ్ ఎస్‌జెడ్‌100 (అంచనా)

రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్‌(Realme TechLife Watch SZ100)ను కూడా కంపెనీ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇంతకుముందు రిలీజ్‌ చేసిన రియల్‌మీ టెక్‌లైఫ్‌ వాచ్‌ ఎస్‌100కు అప్‌కమింగ్‌ మోడల్‌గా దీన్ని తీసుకొస్తున్నట్లు టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిలో 1.69 అంగుళాల హెచ్‌డీ కలర్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఈ వాచ్‌లో హార్ట్‌రేట్ సెన్సర్, స్కిన్‌ అండ్‌ బాడీ టెంపరేచర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. స్టెప్స్‌ కౌంట్స్‌, రిమైండర్‌, క్యాలెండర్‌, వెథర్‌ రిపోర్ట్‌ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే ఫోన్‌ కనెక్ట్ అయినప్పుడు మ్యూజిక్ కంట్రోల్, కెమెరా యాక్సెస్, ఫైండ్ మై ఫోన్‌ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే సుమారు 12 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే బ్యాటరీ ఉంటుంది. అయితే, రియల్‌మీ టెక్‌లైఫ్‌ వాచ్‌ ఎస్‌100 స్మార్ట్‌ వాచ్‌ను కంపెనీ రూ. 2,499 ధరతో విక్రయిస్తోంది. దాదాపు ఇదే ధరతో ఎస్‌జెడ్‌ 100 సిరీస్‌ను విక్రయిస్తోందని టెక్‌ నిపుణుల అంచనా.


Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts