iPhone 15: టైప్‌-సీ పోర్ట్‌తో ఐఫోన్‌.. ప్రో మ్యాక్స్‌కు బదులు అల్ట్రా!

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ స్థానంలో ఐఫోన్ 15 అల్ట్రా అనే కొత్త వేరియంట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దానితోపాటు ఐఫోన్లకు టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్ ఇవ్వనుందట...

Updated : 26 Sep 2022 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ కంపెనీ కొత్తగా ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఈ మోడల్స్‌ను భారత్‌లో కూడా తయారు చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు, టెక్‌ వర్గాల్లో ఐఫోన్‌ 15 సిరీస్‌ గురించి చర్చ ప్రారంభమైంది. ఈ సిరీస్‌ మోడల్స్‌లో కీలక మార్పులుంటాయని యాపిల్‌ పాపులర్ టిప్‌స్టర్‌లు అభిప్రాయపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ మోడల్‌ స్థానంలో ఐఫోన్ 15 అల్ట్రా అనే కొత్త వేరియంట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ కంపెనీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తన ప్రొడక్ట్స్‌ను రీ-డిజైన్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్‌ 15 సిరీస్‌లో ప్రో మ్యాక్స్‌కి బదులు అల్ట్రా వేరియంట్‌ను పరిచయం చేస్తుందని టిప్‌స్టర్ల అంచనా. ఇప్పటికే యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల కోసం ఎమ్‌1 అల్ట్రా ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. యాపిల్ వాచ్‌ మ్యాక్స్‌లలో కూడా అల్ట్రా సిరీస్‌లోని ప్రాసెసర్‌నే ఉపయోగించింది. దీంతో ఐఫోన్‌ అల్ట్రా వేరియంట్‌ కూడా వస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఐఫోన్ 15 అల్ట్రాలోనే యాపిల్ కంపెనీ టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్‌ను పరిచయం చేయనుందట. ఇప్పటి వరకు యాపిల్ డివైజ్‌లకు ఛార్జింగ్‌ కోసం లైట్నింగ్ పోర్ట్‌ ఇస్తోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఒకే తరహా ఛార్జర్‌ విధానాన్ని పాటించాలని పలు దేశాలు మొబైల్‌ తయారీ కంపెనీలను కోరుతున్నాయి. ఫోన్ తయారీకి అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకు ఒక కంపెనీ ఛార్జర్‌ను వేరేగా కొనాలనే నిబంధన పెడితే, అమ్మకాలు పెంచుకునేందుకు మరో కంపెనీ ఛార్జర్‌ను ఉచితంగా ఇస్తోంది. దీనివల్ల వినియోగదారుడు నష్టపోవడమే కాకుండా, ఈ-వేస్టేజ్‌ పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. దీంతో కామన్‌ ఛార్జర్‌ విధానానికి తీసుకొచ్చేందుకు భారత్‌ సహా పలు దేశాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు టైప్‌-సీ పోర్ట్‌ కలిగిన ఛార్జింగ్‌ ప్రమాణాలను పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు ఇస్తున్న టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్‌నే యాపిల్‌ డివైజ్‌లకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ కొత్త ఫోన్‌తోపాటు ఛార్జింగ్‌ అడాప్టర్‌ను ఇవ్వడం నిలిపివేసింది. మరి, యాపిల్ టైప్‌-సీ పోర్ట్‌ ఫోన్లకు మాత్రమే పరిమితం అవుతుందా? లేక ఐపాడ్‌, మ్యాక్‌ కంప్యూటర్లకు కూడా ఇదే పోర్ట్‌ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని