కొత్తగా వన్‌ప్లస్‌, శాంసంగ్ సెల్ఫీ కెమెరాలు..!

ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల లాంఛ్‌తో అదరగొడుతున్న వన్‌ప్లస్, శాంసంగ్ కంపెనీలు త్వరలో తమ ఫోన్‌ కెమెరాల‌లో కీలక మార్పులు చేయనున్నాయట. ఇందులో భాగంగా పంచ్‌ హోల్, నాచ్‌ డిస్‌ప్లేకు గుడ్‌బై చెప్పనున్నాయని సమాచారం....

Updated : 11 Feb 2021 22:01 IST

(Photo Credit: Content Creator)

ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల లాంఛ్‌తో అదరగొడుతున్న వన్‌ప్లస్, శాంసంగ్ కంపెనీలు త్వరలో తమ ఫోన్‌ కెమెరాల‌లో కీలక మార్పులు చేయనున్నాయట. ఇందులో భాగంగా పంచ్‌ హోల్, నాచ్‌ డిస్‌ప్లేకు గుడ్‌బై చెప్పనున్నాయని సమాచారం. ఇప్పటి వరకు సెల్ఫీ కెమెరాల కోసం ఫోన్‌ డిస్‌ప్లే పైభాగంలో చిన్న హోల్ ఇచ్చేవారు. దీని వల్ల డిస్‌ప్లే క్వాలిటీని పూర్తి స్థాయిలో యూజర్స్‌ ఆస్వాదించలేకపోతున్నారట. అందుకని సెల్ఫీ కెమెరా కోసం సరికొత్త డిజైన్ ఆవిష్కరించనుంది వన్‌ప్లస్‌. ఇందులో భాగంగా సెల్ఫీ కెమెరాని ఫోన్ పైభాగంలో చిట్ట చివరన ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన డిజైన్‌కు పేటెంట్ కోసం వన్‌ప్లస్ దరఖాస్తు చేసిందని లెట్స్‌గో డిజిటల్ అనే వెబ్‌సైట్ వెల్లడించింది.

(Photo Credit: LetsGo Digital)

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనివల్ల ఫోన్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువవుతుందని, ఫోన్‌లో ఎక్కువ భాగం డిస్‌ప్లే ఉంటుందని వన్‌ప్లస్‌ భావిస్తోందట. ప్రస్తుతం మొబైల్ పరిశ్రమ డిస్‌ప్లే కింది భాగంలో సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసే టెక్నాలజీపై దృష్టి సారించింది. అయితే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో వన్‌ప్లస్‌ వంటి సంస్థలు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేస్తున్నాయి. 

(Photo Credit: LetsGo Digital)

వన్‌ప్లస్‌ తరహాలోనే శాంసంగ్ కూడా కొత్త ఫోన్ కెమెరా అనుభూతిని యూజర్స్‌కి అందివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పాప్‌-అప్‌, రొటేషన్ కెమెరాను తీసుకురానుందట. దీనికి సబంధించిన కొన్ని ఫొటోలను కంటెంట్ క్రియేటర్ అనే వెబ్‌సైట్ షేర్ చేసింది. ఇందులో ఫోన్ వెనక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ కెమెరా కోసం క్లిక్ చేసినప్పుడు ఫోన్ వెనక వైపున ఉన్న కెమెరా బార్ పైకి జరిగి ముందు వైపుకి తిరిగి సెల్ఫీ కెమెరాలా మారుతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను భవిష్యత్తులో రాబోయే మోడల్స్‌లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

ఇవీ చదవండి..

స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు..

‘నాలుగు’ కెమెరాలతో నోకియా కొత్త ఫోన్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని