Samsung Repiar Mode: రిపేర్ మోడ్‌.. డేటా భద్రతకు శాంసంగ్‌ కొత్త ఫీచర్‌!

వ్యక్తిగత డేటా ఆధారంగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో టెక్‌ కంపెనీలు యూజర్‌ డేటా భద్రత కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్‌ కూడా యూజర్‌ డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

Published : 01 Aug 2022 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత డేటా ఆధారంగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో టెక్‌ కంపెనీలు యూజర్‌ డేటా భద్రత కోసం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. స్పైవేర్‌లకు చెక్ పెట్టేందుకు ఇటీవలే యాపిల్‌ కంపెనీ లాక్‌డౌన్‌ మోడ్‌ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో శాంసంగ్‌ కూడా యూజర్‌ డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. యూజర్లు తమ ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చినప్పుడు అందులోని వ్యక్తిగత సమాచారం ఇతరులు సేకరించకుండా ‘రిపేర్‌ మోడ్‌’ పేరుతో ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీనివల్ల యూజర్‌ అనుమతి లేకుండా ఫోన్‌ డేటాను యాక్సెస్ చేయడం సాధ్యంకాదు. ముందుగా ఈ ఫీచర్‌ను గెలాక్సీ సిరీస్‌ ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానుంది. 

‘‘స్మార్ట్‌ఫోన్‌ను రిపేర్ కోసం ఇచ్చినప్పుడు అందులోని డేటా గురించి యూజర్లు ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. రిపేర్ చేసే సంస్థ లేదా వ్యక్తులు ఫోన్‌లోని యూజర్‌ డేటాను అనుమతి లేకుండా సేకరించే అవకాశం ఉండటంతో వారి ఆందోళనకు ముఖ్యకారణం. శాంసంగ్‌  రిపేర్‌ మోడ్‌తో ఫోన్‌ సర్వీస్‌కు ఇచ్చినా కూడా యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చే ముందు రిపేర్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే సర్వీసింగ్‌ సంస్థ లేదా వ్యక్తులు డేటాను యాక్సెస్ చేయలేరు’’ అని శాంసంగ్‌ తెలిపింది.

ఈ ఫీచర్‌ కోసం గెలాక్సీ ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ అండ్‌ డివైజ్‌ కేర్‌ సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. అందులో రిపేర్ మోడ్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. తర్వాత ఫోన్‌లోని డేటాను ఎవరు యాక్సెస్‌ చేయలేరు. ఈ మోడ్‌ను డిసేబుల్ చేసేందుకు యూజర్‌ ఫోన్‌ను రీస్టార్ట్ చేసి, ఫింగర్‌ ప్రింట్ అథెంటికేషన్‌ లేదా లాక్ ప్యాట్రన్‌తో ధ్రువీకరించాలి. ముందుగా ఈ ఫీచర్‌ను గెటాక్సీ ఎస్‌21 సిరీస్‌ ఫోన్లలో, తర్వాత మిగిలిన గెలాక్సీ ఫోన్లలో పరిచయం చేయనున్నట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని