Samsung: శాంసంగ్‌ కొత్త ఫోన్లలోనూ శాటిలైట్‌ కనెక్టివిటీ.. కానీ!

యాపిల్‌ ఐఫోన్‌ 14 మోడల్స్‌లో ఉన్నట్లుగా శాంసంగ్‌ ఫోన్లలో కూడా శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 

Published : 19 Sep 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాపిల్ కంపెనీ కొద్దిరోజల క్రితం హై-ఎండ్ ఫీచర్స్‌తో ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లలో ప్రధానంగా శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్‌ గురించే టెక్‌ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. మొబైల్ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని సమయంలో శాటిలైట్‌ కనెక్టివిటీ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇకపై ఈ సాంకేతికతను శాంసంగ్‌ ఫోన్లలో కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. త్వరలో శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ మోడల్స్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎస్‌23 మోడల్స్‌లో శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ టెక్నాలజీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై శాంసంగ్‌ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. యాపిల్‌ కంటే ముందు ఈ ఫీచర్‌ను హువావే మేట్‌ 50 సిరీస్‌ మోడల్‌లో పరిచయం చేసింది. 

ఇటీవలే గూగుల్ కూడా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో శాటిలైట్‌ కనెక్టివిటీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో ఇది యూజర్లకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగానే శాంసంగ్‌ ఫోన్లలో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాంసంగ్‌ ఫోన్లు ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తాయి. ఇప్పటిదాకా ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 13 విడుదల కానుంది. కానీ, ఈ వెర్షన్‌లో శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండబోదని బీటా వెర్షన్‌లో విడుదలైన ఫీచర్లు స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం శాంసంగ్‌ ఫోన్లలో ఇప్పటికైతే శాటిలైట్ కనెక్టివిటీ సాంకేతికత ఉండబోదని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

భారత్‌లో శాటిలైట్ కనెక్టివిటీ సాంకేతికత వినియోగానికి కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కొనుగోలు చేసిన ఫోన్‌ లేదా సిమ్‌కార్డ్‌ ద్వారా మాత్రమే ఈ సేవలు ఉపయోగించుకోవాలి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డీఓటీ) నుంచి  అనుమతులతోపాటు, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఫోన్‌ 14 మోడల్స్‌లో ఉన్నప్పటికీ, భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల దృష్ట్యా ఈ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని