sensitive microphones: సాలెగూడు మైక్రోఫోన్‌

సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు.

Published : 19 Jun 2024 00:03 IST

సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. విమానం బరువు పెరగకుండా, అదే సమయంలో దృఢంగా ఉండటం గొప్ప విషయం కదా. ఇప్పుడు సాలెగూళ్లను ఆదర్శంగా తీసుకొని సున్నితమైన మైక్రోఫోన్లనూ డిజైన్‌ చేస్తున్నారు. ఇవి ఏదో ఒకనాడు వినికిడి లోపాన్ని తగ్గించేందుకు తోడ్పడగలవని భావిస్తున్నారు.

మనం చెవులతో శబ్దాలను వింటున్నామంటే గాలి పీడనంలో తలెత్తే మార్పులతోనే. ఇవి కర్ణభేరి కంపించేలా చేసి చప్పుళ్లు వినపడేలా చేస్తాయి. మైక్రోఫోన్లు కూడా చెవులను అనుకరిస్తూ అలాగే పనిచేస్తాయి. సాలెగూళ్లు కూడా ఇలాగే వ్యవహరిస్తాయి. కాకపోతే భిన్నమైన యంత్రాంగంతో. ఇవి తమ గూళ్లను కర్ణభేరి మాదిరిగా ఉపయోగించు కుంటాయి. వీటి సాయంతో 10 అడుగుల దూరం నుంచే చప్పుళ్లను గుర్తిస్తున్నట్టు రెండేళ్ల కిందే అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. గాలి తరంగాలు తాకినప్పుడు సాలెగూళ్లు కంపించటానికి బదులు చెదిరిపోయే గాలి ప్రవాహంతో పాటు కదులుతాయి. అంటే ఇక్కడ గాలి మన చెవిలోని ద్రవ మాధ్యమంలా పనిచేస్తుందన్నమాట. దీని ఆధారంగా కొత్తరకం మైక్రోఫోన్ల తయారీకి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఇటీవలే దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని అకోస్టల్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికాలో సమర్పించారు.

ఎలా పనిచేస్తుంది?

సాలెగూడు మైక్రోఫోన్‌లో సిలికాన్‌తో చేసిన అతి పలుచటి పొర ఉంటుంది. ఒక వైపున అంటుకొని, మరోవైపున వేలాడే ఇది చప్పుడు ద్వారా పుట్టుకొచ్చే అతి స్వల్ప గాలి ప్రవాహానికైనా స్పందిస్తుంది. ఈ పొర కదలికలను లేజర్‌ కాంతి లెక్కించి, సాలీడు తన గూడును డీకోడ్‌ చేసినట్టుగా ఇది శబ్దాలను పసిగడుతుంది.

ఏంటీ ప్రయోజనం?

పీడనానికి బదులు గాలి ప్రవాహానికి స్పందించటం వల్ల చాలా చిన్న చిన్న మైక్రోఫోన్లను తయారు చేయొచ్చు. వినికిడి లోపాన్ని గుర్తించే సాధనాలనూ రూపొందించొచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమయ్యారు. శబ్దాలను గణించటానికి గాలి ప్రవాహాన్ని ఉపయోగించుకోవటం వల్ల ఆ చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించొచ్చు. దీన్ని మరింత మెరుగైన వినికిడి సాధనాల తయారీకి సైతం వాడుకోవచ్చు. చుట్టు పక్కల రణగొణధ్వనులు ఉన్నప్పుడు ఆయా శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలికగా పసిగట్టొచ్చు. సాలెగూడు స్ఫూర్తితో రూపొందించిన మైక్రోఫోన్‌ ద్వారా మన చెవులు వినలేని ఇన్‌ఫ్రాసౌండ్‌నూ గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


సాలెగూడు స్ఫూర్తి మైక్రోఫోన్లు అప్పుడే అందుబాటులోకి రాక పోవచ్చు. కానీ ఎప్పుడు వచ్చినా గొప్ప ప్రయోజనమే. ఇప్పటివరకూ మన శరీర భాగాల ప్రేరణతోనే పరికరాలను రూపొందిస్తున్నాం. సాలెగూడు మైక్రోఫోన్ల ఆవిష్కరణతో వీటి తయారీ ప్రక్రియ కొత్త మలుపు తిరగటం ఖాయం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని