Updated : 30 Dec 2021 13:29 IST

Year Ender 2021:ఈ ఏడాది ఊరించి ఉసూరుమనిపించిన మొబైళ్లు ఇవే...

టెక్‌ మార్కెట్‌ ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా శరవేగంగా దూసుకెళ్లింది. కరోనా కారణంగా స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్‌లు, వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అందివచ్చిన మార్కెట్‌ను దిగ్గజ కంపెనీలు అద్భుతంగా ఒడిసిపట్టాయ్‌‌. మరోవైపు.. అమితంగా ఊరించి, ఆశ పెట్టి, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కొన్ని బ్రాండ్‌ మొబైళ్లు ఈ ఏడాది భారత మార్కెట్‌లో విడుదలే కాలేదు. పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చి మనకు అందని ద్రాక్షల్లా మారిన ఆ గొప్ప మొబైళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం! 

గూగుల్‌ నుంచి మూడు..!

డిజైన్‌ పరంగా కీలక మార్పులు చేసి తన టెన్సర్‌ ప్రాసెసర్లతో.. ఈ ఏడాది గూగుల్ కొత్త ఫోన్‌ పిక్సెల్‌ 6ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇతర పిక్సెల్ ఫోన్‌లకు భిన్నంగా పిక్సెల్‌ 6 సిరీస్‌లో వెనుకవైపు ఆకట్టుకునేలా ప్రత్యేకమైన బార్‌ను అమర్చింది. అందులో మూడు కెమెరాలను ఏర్పాటు చేసింది. ‘గూగుల్‌ పిక్సెల్‌ 6 (Google Pixel 6)’ వేరియంట్‌లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌, 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతోపాటు.. ‘పిక్సెల్‌ 6ప్రో (Google Pixel 6 Pro)’ను 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో గూగుల్‌ తీసుకొచ్చింది. అయితే, ప్రపంచ డిమాండ్‌ సహా పిక్సెల్‌ 6 ధర ఎక్కవగా ఉండటం, భారత మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతుండటంతో ఈసారి ఇవి మనకు అందలేదు. మరోవైపు భారత్‌లో విడుదలైన ‘గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ’ అప్‌డేట్‌ వెర్షన్‌ ‘గూగుల్‌ 5ఏ’ ఈ ఏడాది మనకు అందుబాటులోకి రాలేదు. 

మడత పెట్టకుండానే..

మడతపెట్టే స్మార్ట్‌ మొబైళ్లతో ఒప్పో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ లాంచ్‌ చేసిన తొలి ఫోల్డబుల్‌ మొబైల్‌ ‘ఒప్పో ఫైండ్‌ ఎన్‌ (Oppo Find N)’. ఇది చైనాలో లాంచ్‌ అయినా ఇంకా భారత్‌లో విడుదల కాలేదు. ‘శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌’ పోలి ఉండే దీంట్లో ఓఎల్‌ఈడీ (OLED) ప్యానెల్‌ అమర్చారు. అలాగే షావోమి నుంచి మార్చి 2021లో వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌మొబైల్‌ ‘ఎంఐ మిక్స్‌ ఫోల్డ్‌ (Mi Mix Fold)’ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. షావోమి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP), లిక్విడ్ లెన్స్‌ వంటివి దీని ప్రత్యేకతలు.

వన్‌ప్లస్‌ నిరీక్షణకు తెర ఎప్పుడో..?

వన్‌ప్లస్‌ (Oneplus) నుంచి టాప్‌-ఎండ్‌ ఫ్లాగ్‌షిప్‌లో విడుదలైన ‘9RT (Oneplus 9RT)’ ఈ ఏటా మన వద్ద సందడి చేయలేదు. చైనాలో అక్టోబర్‌లో లాంచ్‌ అయిన 9RT కోసం భారత గ్యాడ్జెట్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. మల్టీ టాస్కింగ్‌, మెమరీ మేనేజ్‌మెంట్‌ కోసం 7జీబీ వర్చువల్‌ ర్యామ్‌ (Virtual RAM) అదనం. డిసెంబర్‌ 16న భారత్‌లో ఈ మొబైల్‌ లాంచ్‌ అవుతుందని తొలుత వార్తలు వచ్చినా ఆ నిరీక్షణకు ఇప్పటికీ తెరపడలేదు.

మరిన్నీ..

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన ‘సర్ఫెస్‌ డ్యుయో 2 (Surface Duo 2)’ కూడా మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. డ్యుయెల్‌ స్క్రీన్‌తో వచ్చే ఈ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో రన్‌ అవుతోంది. మరోవైపు ‘హువావే పీ50 (Huawei P50)’ సిరీస్‌, ‘ఆసుస్‌ ఆర్‌ఓజీ 5ఎస్‌ (Asus ROG Phone 5s)’ భారత మార్కెట్లో విడుదల కాలేదు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని