Mobile Charging: స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌.. ఈ ఛార్జర్లతో నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌

కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నామంటే తప్పనిసరిగా బ్యాటరీ ఎంత వేగంగా చార్జ్‌ అవుతుందనేది చూస్తాం. ప్రస్తుతం 200 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ను మొబైల్‌ కంపెనీలు సిద్ధం చేస్తున్నాయి.

Published : 05 Jun 2022 23:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నామంటే తప్పనిసరిగా బ్యాటరీ ఎంత వేగంగా చార్జ్‌ అవుతుందనేది చూస్తాం. స్మార్ట్‌ఫోన్‌ విడుదలైన తొలినాళ్లలో 10 వాట్‌ ఛార్జింగ్‌తో మొదలైన ప్రయాణం 33 వాట్‌, 65 వాట్‌ అంటూ ప్రస్తుతం 90 వాట్‌, 100 వాట్, 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ వరకు చేరింది. వీటితో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుంది. అయితే ఇప్పుడు 200 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ను మొబైల్‌ కంపెనీలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో 4,500-5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుందని సమాచారం. 

ఇప్పటికే షావోమి కంపెనీ 200 వాట్‌ హైపర్‌ ఛార్జర్‌ టెక్నాలజీని ప్రదర్శించింది. దీంతో 100 శాతం బ్యాటరీ కేవలం 8 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుంది. దీనికి పోటీగా ఒప్పో కంపెనీ కూడా 240 వాట్‌ ఛార్జర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఛార్జర్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 100 శాతం 9 నిమిషాల్లో, 0-50 శాతం మూడు నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుందని ఒప్పో కంపెనీ వెల్లడించింది. ఈ రెండింటికి పోటీగా వివో సంస్థ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కోసం 20V/10A అడాప్టర్‌ సపోర్ట్‌తో 200 వాట్‌ ఫాస్ట్ చార్జర్‌ను తీసుకురానుందట.

ఈ సాంకేతికత వివో త్వరలో తీసుకురానున్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలోని 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీలకు సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను అందించడంతోపాటు, 120 వాట్‌, 80 వాట్‌, 65 వాట్ ఛార్జర్‌లను కూడా సపోర్ట్ చేస్తుందట. అలానే ఇన్ఫీనిక్స్‌ కంపెనీ 160 వాట్‌ అల్ట్రా ఫ్లాష్‌ ఛార్జర్‌ను తీసుకురానుంది. దీంతో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 10 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫాస్ట్‌ ఛార్జర్‌లు యూజర్లుకు అందుబాటులోకి వస్తే మొబైల్‌ వినియోగించే సమయం పెరగటంతోపాటు, ఛార్జింగ్‌ కోసం గంటలకొద్దీ వేచి చూడాల్సిన అవసరం ఉండదని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని