Smartphones: శాంసంగ్‌ నుంచి మూడు.. రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు

శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌లో మూడు, రియల్‌మీ 9 ప్రో 5జీ సిరీస్‌లో రెండు కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. మరి ఈ ఫోన్లలో ఫీచర్లపై ఓ లుక్కేద్దామా.

Updated : 17 Feb 2022 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్ (Samsung), రియల్‌మీ (Realme) కంపెనీలు భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 (Samsung Galaxy S22) సిరీస్‌లో మూడు కొత్త మోడల్స్‌ను, రియల్‌మీ 9 ప్రో (Realme 9 Pro 5G) సిరీస్‌లో రెండు కొత్త 5జీ మోడల్స్‌ను తీసుకొచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22, గెలాక్సీ ఎస్‌22+, గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా, రియల్‌మీ 9 ప్రో 5జీ, 9 ప్రో+ 5జీ పేర్లతో పరిచయం చేసిన మోడల్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి, ధరెంత, అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీలపై ఓ లుక్కేద్దాం. 


📲 శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌లోని మూడు మోడల్స్‌ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో పనిచేస్తాయి. అలానే ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ వన్‌ (Snapdragon 8 Gen 1) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నీటిలో తడిచినా పాడవకుండా ఈ ఫోన్లకు ఐపీ68 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ రక్షణ ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా (Samsung Galaxy S22 Ultra)

ఈ ఫోన్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల ఎడ్జ్‌ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్‌ 2ఎక్స్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రా-వైడ్‌, రెండు 10 ఎంపీ టెలీఫొటో షూటర్‌ కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 40 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ వైర్, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పవర్‌ షేర్‌ ఫీచర్‌తో ఈ ఫోన్‌ ఛార్జింగ్‌తో మరో డివైజ్‌ బ్యాటరీని ఛార్జ్‌ చేయొచ్చు. గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా మోడల్‌ 12 జీబీ ర్యామ్‌/ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,09,999. 12 జీబీ/512 జీబీ వేరియంట్‌ ధర రూ. 1,18,999. బుర్గుండి, ఫాంటమ్‌ బ్లాక్, ఫాంటమ్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. 


శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22+ (Samsung Galaxy S22+)

120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్‌ వైర్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 84,999. 8 జీబీ/256 జీబీ ధర రూ. 88,999. 


📲 శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22+, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 మోడల్స్‌లో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒకటి. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం ముందు 10 ఎంపీ కెమెరా ఉంది. వెనుకవైపు 50 ఎంపీ వైడ్‌ యాంగిల్‌తోపాటు, 12 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 10 ఎంపీ టెలీఫొటో కెమెరాలు అమర్చారు. ఈ ఫోన్లలో పవర్‌ షేర్ ఫీచర్‌ ఉంది. గ్రీన్‌, ఫాంటమ్‌ బ్లాక్‌, ఫాంటమ్‌ వైట్‌ రంగుల్లో లభిస్తాయి. 


శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 (Samsung Galaxy S22)

ఈ మోడల్‌లో 3,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ వైర్‌, 15 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 72,999. 8 జీబీ/256 జీబీ ధర రూ. 76,999. శాంసంగ్‌ కంపెనీ ఈ ఫోన్లు ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించింది. అమ్మకాలు ప్రారంభమయ్యే తేదీలను మాత్రం వెల్లడించలేదు. 


రియల్‌మీ 9 ప్రో+ 5జీ (Realme 9 Pro+ 5G)

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. గేమర్స్‌ కోసం ఇందులో మలీ-జీ68 ఎమ్‌సీ4 గ్రాఫిక్‌ కార్డ్ ఉపయోగించారు. ఈ ఫోన్‌లో వెనుకు మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాలన్నింటిలో సోనీ ఐఎమ్‌ఎక్స్‌355 లెన్స్‌ను ఉపయోగించారు.

రియల్‌మీ 9 ప్రో+ 5జీలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 60 వాట్ సూపర్‌డార్ట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది.  6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999. 8 జీబీ/128 జీబీ ధర రూ. 26,999. 8 జీబీ/256 జీబీ ధర రూ. 28,999. ఫిబ్రవరి 21 నుంచి రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 


రియల్‌మీ 9 ప్రో 5జీ (Realme 9 Pro 5G) 

120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్‌-యాంగిల్‌, 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ డార్ట్ ఛార్జ్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 20,999. ఫిబ్రవరి 23 నుంచి రియల్‌మీ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని