CoronaVaccine: ఈ మెసేజ్‌ నమ్మొద్దు

Covid Vaccine కోసం నమోదు చేసుకోండి అంటూ లింక్‌ వచ్చిందా... క్లిక్‌ చేయొద్దు

Updated : 04 May 2021 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఏం జరిగినా హ్యాకర్లు క్యాష్‌ చేసుకోవడంలో ముందుంటారు. మిగిలిన దేశాల్లో ఏమో కానీ, మన దేశంలో మాత్రం చాలా ముందుంటారు. తాజాగా మరోసారి అలాంటి హ్యాకింగ్‌/మాల్‌వేర్‌ ప్రయత్నం బయటపడింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం 18 ఏళ్లు పైబడినవారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీనినే హ్యాకర్లు ఆయుధంగా చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మెసేజ్‌లు పంపి ఆకట్టుకొని, రిజిస్ట్రేషన్‌ కోసం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండని మాల్‌వేర్‌ లింక్‌ పంపుతున్నారు. 

పైన ఇమేజ్‌ చూశారు కదా... ఇలాంటి మెసేజ్‌లే చాలామందికి వస్తున్నాయి. చూడటానికి మీ మీద అభిమానంతో ఎవరో పంపించినట్లు ఉంటాయి. వ్యాక్సినేషన్‌ కోసం సమాచారం ఇచ్చేలానే ఉంటాయి. అయితే ఆ లింక్‌ను క్లిక్‌ చేసి.. వాళ్లు చెప్పినట్లు నడుకుచుంటే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం గోవిందా... గోవింద. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే... ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అయ్యే పేజీ, డౌన్‌లోడ్‌ అయ్యే యాప్‌ అచ్చంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించినవిలానే ఉండటం. దీంతో ఎవరికీ అనుమానం రావడం లేదు. 

అసలేమవుతోంది అంటే... 

వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అంటూ మెసేజ్‌లో  వచ్చే లింక్‌ను క్లిక్‌ చేస్తే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అక్కడివరకు సమస్య చిన్నదే. అయితే ఆ యాప్‌ వాడటానికి ఓపెన్‌ చేసినప్పుడు మీ మొబైల్‌లోని కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, కాల్‌ హిస్టరీ... ఇలా యాక్సెస్‌ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ వివరాలన్నీ ఆ మాల్‌వేర్‌ సృష్టించిన వ్యక్తికి వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు కొవిన్‌ యాప్‌ రిజిస్ట్రేషన్‌ మాటున వస్తున్న మాల్‌ వేర్‌ కొత్తగా ప్రవర్తిస్తుందట. మీ మొబైల్‌లో వివిధ సర్వీసుల బిల్లింగ్‌ ప్లాన్‌లు మార్చడం, లిమిట్‌ మార్చడం లాంటివి చేస్తుందట. అయితే ఆండ్రాయిడ్‌ యూజర్లు మాత్రమే ఈ మాల్‌వేర్‌తో ఇబ్బందిపడుతున్నారట. 

ఎలా జాగ్రత్తపడాలంటే... 

ఇలాంటి మాల్‌ వేర్‌ నుంచి రక్షణ ఎలా... అంటే పాత సమాధానమే వస్తుంది. యాప్‌లు డౌన్‌లోడ్‌ అనేది కేవలం ప్లేస్టోర్‌ నుంచి మాత్రమే చేయాలి. ఏ ఇతర లింక్స్‌ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయకూడదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్‌లోడ్‌ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే...

మాల్‌వేర్‌ ఉన్న లింక్‌ను ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే... వెంటనే మీ ఫోన్‌ను రీసెట్‌ చేయండి. దాని కోసం మొబైల్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో సిస్టమ్‌ ఆప్షన్‌లోకి వెళ్తే  రిసెట్‌ (Reset) అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఎరేజ్‌ ఆల్ డేటా  (Erase All Data) ఆప్షన్‌ వస్తుంది. దీన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ను రీసెట్‌ చేయొచ్చు. దీంతోపాటు మీ మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని