DSLR కెమెరాలను మొబైల్స్‌ అధిగమించగలవా..? అదీ మూడేళ్లలో..!?

సోనీ సెమీకండక్టర్‌ సొల్యూషన్స్‌ ప్రెసిడెంట్‌, సీఈవో తెరుషి షిమిజు ఇటీవల ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. 2024 నాటికి మొబైల్‌ సహాయంతో..

Published : 04 Jun 2022 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తులో DSLRల (డిజిటల్‌ సింగిల్‌ లెన్స్‌ రిఫ్లెక్స్‌) కంటే స్మార్ట్‌ మొబైల్‌ కెమెరాల ఇమేజ్‌ల నాణ్యతే మరింత మెరుగ్గా ఉంటుందా..?అదీ మూడేళ్లలో చూడగలమా..!? ఊహించడానికి ఇది కొద్దిగా కష్టంగా ఉన్నా.. చెప్పిన వ్యక్తిని బట్టి వీటిని నమ్మక తప్పట్లేదు! సోనీ సెమీకండక్టర్‌ సొల్యూషన్స్‌ ప్రెసిడెంట్‌, సీఈవో తెరుషి షిమిజు దీనికి సంబంధించి ఇటీవల ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. 2024 నాటికి డీఎస్‌ఎల్‌ఆర్‌ల కంటే మొబైల్‌ సాయంతో మెరుగైన చిత్రాలను తీయవచ్చని వెల్లడించారు. ఇందుకు సెన్సార్‌ టెక్నాలజీలో మొబైల్‌ కెమెరాలు సాధిస్తున్న పురోగతి దీనికి కారణమన్నారు. గత వారం బిజినెస్ బ్రీఫింగ్ సెషన్‌లో ఆయన ఈ విషయమై మాట్లాడారు.

సెన్సార్‌లు, ఎపర్చర్లతో పాటు కంప్యూటేషనల్‌ ఫొటోగ్రఫీని ఉపయోగించడం వల్ల మెరుగైన ఫొటోగ్రఫీ సాధ్యపడుతుందని షిమిజు పేర్కొన్నారు. తొలుత స్టీల్‌ ఇమేజ్‌ క్వాలిటీలో ఈ మార్పును చూడగలమని తెలిపారు. ఇందుకు సంబంధించి గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ మొబైల్లో ఏఐ ఫీచర్ల సామర్థ్యాన్ని ఇప్పటికే తాము చూసినట్లు చెప్పారు. ఈ మేరకు సరికొత్త మెగాపిక్సెళ్ల కౌంట్‌ కొత్త స్థాయిలను దాటే అవకాశముందన్నారు. శాంసంగ్‌తోపాటు సోనీ, ఒప్పో, వీవో వంటి తదితర సంస్థలు స్మార్ట్‌ మొబైల్‌లో కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైనట్లు వివరించారు. Vivo X80 Pro, Pixel 6 Pro వంటి మొబైల్‌లు ఇందుకు  నిదర్శనని చెప్పారు. పెరిస్కోప్ లెన్స్, మైక్రోస్కోపిక్ సెన్సార్లతో రాబోయే రోజుల్లో మొబైళ్లతో మరింత నాణ్యమైన ఫొటోలు తీయొచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్తు మార్కెట్‌ అంచనాపై సోనీకీ భాగస్వామ్యం ఉంటుందన్నారు. 2025 నాటికి తమ స్మార్ట్‌ఫోన్‌లు హై-స్పీడ్ వీడియో నాణ్యత, మెరుగైన ఆటో-ఫోకస్ ఫలితాలను పొందుతాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని