Inventions: కొత్త భయం

మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. చిత్రమేంటంటే- కొంగొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు వెల్లువెత్తటం.

Updated : 31 May 2023 02:41 IST

మార్పు నిత్యం. అదే సత్యం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంది. చిత్రమేంటంటే- కొంగొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు వెల్లువెత్తటం. ఇటీవల అధునాతన కృత్రిమ మేధ పరిజ్ఞానం మీద రేగుతున్న ఆందోళనలే దీనికి నిదర్శనం. మానవ మనుగడకు ముప్పు తెచ్చిపెట్టే అతిపెద్ద కారకాల్లో ఇదొకటని టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ పేర్కొనగా.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ సైతం దీనికి వంత పాడారు. మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌ విభాగం అధిపతి మాత్రం దీన్ని కొట్టిపారేశారు.

కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి కొన్ని ‘భయానక’ పరిజ్ఞానాలు, ఆవిష్కరణలపై ఓ కన్నేద్దాం. వీటిని తలచుకుంటే ఇప్పుడు నవ్వు రావటం ఖాయం.

రైలు ప్రయాణమా? బతుకుతామా?

‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్‌బాంక్రాన్‌కీట్‌’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్‌ సిక్‌నెస్‌’ అని అర్థం. ఇంగ్లండ్‌ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ రైళ్లకు చేరుకున్నాం.

టెలిఫోన్‌.. గోప్యతకు చెల్లు!

ప్పుడంటే సెల్‌ఫోన్‌ లేకుండా ఐదు నిమిషాలైనా ఉండలేకపోతున్నాం. కానీ టెలిఫోన్‌ను ఆవిష్కరించిన కొత్తలో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ప్రజల గోప్యతను తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుందని కొన్ని పత్రికలు గట్టిగా వ్యతిరేకించాయి. ఇది ప్రజలను బద్ధకస్తులుగా మార్చేస్తుందని, సమాజానికి హాని చేస్తుందనీ కొందరు భావించారు. టెలిఫోన్‌తో వినికిడి పోతుందని, దీన్ని ముట్టుకుంటే విద్యుత్తు షాక్‌తో చనిపోతామని భయపడినవారూ ఉన్నారు. టెలిఫోన్‌ తీగలను తెంపేయటం, దొంగిలించటమూ చేశారు.

* టెలిగ్రాఫ్‌ను తొలిసారి ప్రవేశపెట్టినప్పుడూ వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ కొత్త టెక్నాలజీ ఇంగ్లిష్‌ కవిత్వాన్ని నాశనం చేస్తుందనీ భావించారు. పొట్టి, అసంపూర్ణ పదాలతో సాగే ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రోత్సహిస్తే అది ప్రజలకూ అలవడుతుందని.. పొడి పొడి మాటలతోనే సరిపెడతారని భయపడ్దారు. ఆలోచనలకూ భంగం కలుగుతుందని అనుకునేవారు.

రేడియోతో మేలా? కీడా?

రేడియో ఆవిష్కరణతో ముడిపడిన భయం ఇంకా చిత్రమైంది. దీన్నుంచి రేడియేషన్‌ వెలువడుతుందనే ప్రజలు భయపడటం అటుంచితే.. రేడియోను ఆవిష్కరించిన మార్కొని సైతం భయపడటం విచిత్రం. ఆయన 1895లో వైర్‌లెస్‌ టెక్నాలజీని సరిగ్గా రూపొందించానని నమ్మినప్పటికీ ఇది పెద్దఎత్తున ప్రసారం కావటానికి రెండు దశాబ్దాలకు పైనే పట్టింది. మార్కొని రాసుకున్న ఒక ప్రసంగంలో తాను ‘ప్రపంచానికి మంచి చేశానా? లేకపోతే ఉపద్రవాన్ని తెచ్చిపెట్టానా?’ అని సందేహించటం గమనార్హం. సముద్రంలోని నౌకల మధ్య సమాచార ప్రసారాన్ని మెరుగుపరచటమే తన టెక్నాలజీ ఉద్దేశమనే ఆయన భావించారు. మార్కొని చూడలేకపోయారు గానీ అనంతరం ప్రపంచవ్యాప్తంగా రేడియో ఎంత సంచలనం సృష్టించిందో, ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిన కథే.

* వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ పరికరం గురించి మార్కొనీ వివరిస్తూ దీనికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి ఎలాంటి ప్రత్యుత్తరమూ లభించలేదు. పైగా మార్కొనీని పిచ్చాసుపత్రిలో చేర్చాలని మంత్రి సిఫారసు చేయటం విచిత్రం.

టీవీతో చదువులు ఫట్‌!

టెలివిజన్‌ 1927లో వచ్చింది. ఇది రేడియో భయాలను మరింత పెంచింది. రేడియో మాదిరిగానే టీవీలతో చదువులు దెబ్బతింటాయని, ఒకరితో ఒకరు సన్నిహితంగా మాట్లాడుకోవటం తగ్గుతుందని భావించారు. ఇది కొంతవరకు నిజమే అయినా కుటుంబ సంబంధాల విషయంలో పెద్ద ప్రభావమేమీ చూపించలేదు. పైగా సమాచార ప్రసారానికి, విజ్ఞాన సాధనకు ప్రముఖ వేదికగా మారింది. అభివృద్ధిలో ఇతోధిక పాత్ర పోషించింది.

* టీవీలకు దగ్గరగా కూర్చుంటే కళ్లు దెబ్బతింటాయని ఇప్పటికీ వింటుంటాం. ఇంతకీ ఈ భయం ఎలా మొదలైందో తెలుసా? అప్పట్లో ఒక కంపెనీ నాసిరకం టీవీలను తయారుచేసింది. వీటి నుంచి ప్రమాదకర ఎక్స్‌రేలు వెలువడేవి. అందుకే అధికారులు టీవీలకు మరీ దగ్గరగా కూర్చోవద్దని సూచించారు. అనంతరం కంపెనీ దాన్ని సరిదిద్దింది. కానీ భయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

పీసీని తాకితే అంతే..‌

స్తుతం అంతా కంప్యూటర్లు వాడుతున్నారు. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లే కాదు.. ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు సైతం కంప్యూటర్ల మాదిరిగా పనిచేస్తున్నాయి. కానీ కంప్యూటర్‌ను తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర భయాందోళనలు రేగాయి. కొందరు కంప్యూటర్‌ను తాకటానికే జంకేవారు. కంప్యూటర్ల గురించి చదవాలన్నా, మాట్లాడాలన్నా వెనకాడేవారు. దీనికి కంప్యూటర్‌ఫోబియా అనీ పేరు పెట్టారు. మనదేశంలో కార్యాలయాల్లో కంప్యూటర్లను ప్రవేశ పెట్టొదంటూ ఆందోళనలూ చేశారు. ఇప్పుడు కంప్యూటర్లు లేకుండా ఏ పనీ జరగని స్థితికి చేరుకున్నాం.

* సీఆర్‌టీ (క్యాథోడ్‌ రే ట్యూబ్‌) మానిటర్ల నుంచి రేడియేషన్‌ వెలువడుతుందని, గర్భిణుల్లో అబార్షన్లకు కారణమవుతుందని భావించేవారు.

*కంప్యూటర్లు రాకముందే చాలాకాలం క్రితం.. కాలిక్యులేటర్లు వచ్చిన కొత్తలో బ్రిటన్‌లో గణిత ఉపాధ్యాయలు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయటం గమనార్హం. ఇది తమ ఉద్యోగాలను పోగొడుతుందని భయపడటమే దీనికి కారణం.

అమ్మో.. వై-ఫై

ప్పుడు వై-ఫై లేని ఇల్లు లేదన్నా అతిశయోక్తి కాదేమో. అయితే మొదట్లో దీని విషయంలో చాలా భయపడేవారు. వై-ఫై నుంచి వెలువడే కంటికి కనిపించని రేడియేషన్‌ ఆరోగ్యానికి హాని చేస్తుందని, క్యాన్సర్లు వస్తాయని వణికిపోయేవారు. ఇందులో ఎలాంటి నిజం లేదని అనంతర కాలంలో అందరికీ అవగతమైంది. కానీ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇదీ రేడియేషన్‌కు కారణమవుతుందని ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎంతోమంది సురక్షితంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను వాడుకోవటం పరిపాటిగా మారింది.

స్విచ్చు తాకితే షాక్‌

ది 19 శతాబ్దం. అప్పుడప్పుడే విద్యుత్తు అందుబాటులోకి రావటం మొదలైంది. దీని గొప్పతనమూ తెలిసి వస్తోంది. అయినా ఎంతోమంది విద్యుత్తు వాడకమంటే భయపడేవారు. విద్యుత్తును వ్యామోహంగా భావించేవారు. ఇంట్లో విద్యుత్తు ఉన్నప్పటికీ కొందరు లాంతర్లను వెలిగించేవారు. అమెరికా అధ్యక్షుడు బెంజమిన్‌ హారిసన్‌ కూడా విద్యుత్తుకు భయపడేవారు. స్విచ్చులను తాకితే షాక్‌ కొడుతుందని ఆయన భయం. అందుకే ఉద్యోగులతోనే స్విచ్చులు వేయించేవారు. విద్యుత్తు డోర్‌బెల్స్‌ విషయంలోనూ ఇలాంటి భయాలే నెలకొనేవి. చాలామంది డోర్‌బెల్‌ మీటను తాకటానికి హడలి పోయే వారు.

శరీరానికి పరికరాలా?

స్మార్ట్‌వాచ్‌ల వంటి శరీరానికి ధరించే పరిజ్ఞానాలదే భవిష్యత్తు అని ఇప్పుడంతా అంగీకరిస్తున్నారు. ఇవి మనం రోజుకు ఎంత దూరం నడుస్తున్నాం? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోంది? ఇలాంటి ఆరోగ్య సమాచారాన్ని చిటికెలో చూపిస్తున్నాయి. కొన్ని పరికరాలైతే తినే పదార్థాల్లో ఏయే పోషకాలు, ఎంతెంత మోతాదుల్లో ఉంటున్నాయో కూడా చెబుతున్నాయి. కానీ శరీరానికి ధరించే ఇలాంటి పరిజ్ఞానాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని, క్యాన్సర్‌ వంటి జబ్బులకు కారణమవుతాయని మొదట్లో తెగ వణికిపోయేవారు. రాన్రానూ వాడకం పెరుగుతున్నకొద్దీ అపోహలూ తొలగిపోయాయి.

రాతతో మతిమరుపు!

శ్చర్యంగా అనిపించినా రాత మీదా భయాలు నెలకొని ఉండేవి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ ఎన్నడూ రాసేవారు కాదు. రాతతో మతిమరుపు వస్తుందనేది ఆయన భావన. ‘రాతతో అభ్యాసకుల్లో మతిమరుపు వస్తుంది. ఎందుకంటే వాళ్లు బయట రాసిన అక్షరాలనే నమ్ముతారు. అసలు విషయాలను గుర్తుంచుకోలేరు’ అని అభిప్రాయపడేవారు. ఆయన శిష్యుడు అరిస్టాటిల్‌ పత్రాల మీద రాసినప్పటికీ రాత అనేది సత్యానికి వెనకడుగని అనుకునేవారు.

* పుస్తకాల విషయంలోనూ ఇలాంటి భయాలే ఉండేవి. వాణిజ్యపరంగా మొట్టమొదటి అచ్చుయంత్రం 1458లో మొదలైంది. అప్పటి సంపన్నవర్గాలు దీనిపై చాలా అసంతృప్తి చూపేవారు. చేత్తో రాసేవారు మరింత విజ్ఞతను ప్రదర్శిస్తారని, అందువల్ల చేత్తో రాసిన పుస్తకాలకు ముద్రించిన పుస్తకాలు ఎప్పటికీ సాటి రావని అనుకునేవారు. తమ సిద్ధాంతాలు చాలా చోట్లకు ఎందుకు వ్యాపించాలో అర్థం కావటం లేదనీ అప్పట్లో కొందరు పోప్‌నకు ఫిర్యాదు కూడా చేశారు. గాట్‌ఫ్రైడ్‌ విల్‌హెల్మ్‌ అనే తత్వవేత్త, గణితశాస్త్రవేత్త 1680లో.. అంటే అచ్చుయంత్రాన్ని కనిపెట్టిన 200 ఏళ్ల తర్వాత కూడా ‘గుట్టలుగా పెరిగిపోతున్న పుస్తకాలు ప్రపంచాన్ని తిరిగి అనాగరికత వైపు నడిపిస్తాయి’ అని అభిప్రాయపడటం విచిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని