Liver: కాలేయంలో నాయక కణాలు

అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు.

Updated : 19 Jun 2024 00:14 IST

అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. వీటి కన్నా మరోరకం కణాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు స్కాట్లాండులోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు గుర్తించారు.

గోడ కూలిపోయిందనుకోండి. దాన్ని మరమ్మతు చేయాలంటే ముందు ఇటుకలు, రాళ్ల వంటివి జోడించి.. పైన సిమెంటుతో మూసేస్తాం. మరి ఇటుకలు, రాళ్లు లేకుండా పూడ్చాలంటే? కష్టమైన పనే. ముందు ఖాళీలను పూడ్చి, తర్వాత మరమ్మతు చేస్తే త్వరగా పనవుతుంది. సరిగ్గా కాలేయంలోనూ ఇలాంటి మరమ్మతు ప్రక్రియే కొనసాగుతున్నట్టు, ఇందులో కొత్తరకం కణాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కాలేయంలోని గాయాల్లోకి ఆరోగ్యకర కణజాలాన్ని లాక్కొచ్చి, ఖాళీలను పూరిస్తున్నట్టు.. ఇలా కణాలు తిరిగి వృద్ధి చెందేలా పురికొల్పుతున్నట్టు కనుగొన్నారు. అందుకే వీటిని ‘నాయక’ కణాలని ముద్దుగా పిలుచుకుంటున్నారు. కాలేయ జబ్బులకు వినూత్న చికిత్సలను రూపొందించటానికివి తోడ్పడగలవని భావిస్తున్నారు.


కొన్నిసార్లు అసాధ్యం

కొన్నిసార్లు కాలేయం అంత త్వరగా మరమ్మతు కాలేనంతగా దెబ్బతినొచ్చు. ఇది ఉన్నట్టుండి కాలేయం విఫలం కావటానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితి 48 గంటల్లోనే తలెత్తుతుంది. ఫలితంగా చర్మం పసుపురంగులోకి మారటం, తీవ్రంగా రక్తస్రావం అవటం, మెదడు ఉబ్బటం, చాలా అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆయా కారణాలను బట్టి మందులతో తిరిగి కాలేయం బాగుపడేలా చేయొచ్చు. కానీ, పరిస్థితి తీవ్రంగా విషమిస్తే కాలేయ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే కాలేయ సహజ మరమ్మతు సామర్థ్యాన్ని ఇనుమడింపజేయగల కొత్త చికిత్సలు ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. ఈ ప్రక్రియ తీరును మరింత బాగా అర్థం చేసుకోవటానికి యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు కాలేయం విఫలమైనవారి నుంచి సేకరించిన కణజాలం మీద అధ్యయనం చేశారు. వీరిలో చాలా కణాలు వృద్ధి చెందుతున్నప్పటికీ కాలేయం ఇంకా దెబ్బతింటున్న సూచనలే కనిపించాయి. అదేంటి? కణాలు వృద్ధి చెందితే కోలుకోవాలి కదా. దెబ్బతిన్న భాగం మరమ్మతు కావటానికి కొత్త కణాలు పుట్టుకొస్తే చాలదా? ఇంకేదైనా కారణముందా? అని పరిశోధకులు లోతుగా పరిశీలించారు.


అద్భుత మరమ్మతు

కాలేయాన్ని మనం అవయవంగా పిలుచుకుంటుంటాం. నిజానికిదో గ్రంథి. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఇదే. రక్తంలోంచి విషతుల్యాలను తొలగించటం, జీర్ణక్రియలో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థ పదార్థాలను తొలగించే పైత్యరసం ఉత్పత్తి, మందులను విచ్ఛిన్నం చేయటం వంటి ఎన్నో పనులు నిర్వర్తిస్తుంది. కాలేయం గొప్పతనమేంటంటే దెబ్బతిన్నప్పుడు తనకు తానే మరమ్మతు చేసుకోవటం. ఉదాహరణకు- హెపటైటిస్‌ వంటి వైరల్‌ జబ్బులు, మందులు, మద్యం తాగటం వల్ల దెబ్బతినప్పుడు తిరిగి తనకు తానే త్వరగా కోలుకుంటుంది.


జన్యు విశ్లేషణతో

ప్రతి కాలేయ కణం నుంచి శాస్త్రవేత్తలు జన్యువులను సేకరించి, జన్యు పటాన్ని రూపొందించారు. ఆరోగ్యంగా ఉన్నవారి కాలేయ కణాల జన్యు పటాలతో పోల్చి చూశారు. మరమ్మతు జరిగే సమయంలో ఏయే కణాలు చురుకుగా ఉంటున్నాయో తెలుసుకున్నారు. కొత్త కణాలు విస్తరించటానికి ముందే ‘నాయక కణాలు’ పుట్టుకొచ్చి, దెబ్బతిన్న భాగంలో ఖాళీలను పూరిస్తున్నట్టు గమనించారు. అంటే కొత్త కణజాలం పుట్టుకు రావటానికి ముందే కాలేయం గాయాన్ని పూడ్చటానికి ప్రాధాన్యమిస్తోందన్నమాట. ఇలా పేగుల్లోని బ్యాక్టీరియా కాలేయంలోకి చేరుకోకుండా, ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా నిలువరిస్తోంది. అనంతరమే మరమ్మతు ప్రక్రియ పుంజుకుంటోంది. ఎంతైనా కాలేయం తెలివే వేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని