T-Mobile: స్మార్ట్‌ సూట్‌కేస్‌.. ఇకపై లగేజ్‌ మిస్‌ అవ్వదు!

ప్రయాణాల్లో కొన్నిసార్లు లగేజ్‌ మర్చిపోతుంటాం. తిరిగి వాటిని ట్రాక్‌ చేయడం తలనొప్పితో కూడిన వ్యవహారం. ఈ సమస్యకు పరిష్కారంగా టీ మొబైల్‌ సంస్థ స్మార్ట్‌ సూట్‌కేస్‌ తయారుచేసింది. ఆ స్మార్ట్‌ కేస్‌ వివరాలివే.

Published : 04 Nov 2022 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సేవల రంగంలో వినియోగదారుడిని ఆకట్టుకోవడమే కంపెనీల ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా సరికొత్త ఉత్పత్తులను విపణిలోకి తీసుకొస్తుంటాయి. ఇదే క్రమంలో అమెరికన్‌  మొబైల్ నెట్‌వర్క్ దిగ్గజం.. టీ మొబైల్‌ (T-Mobile) కూడా సరికొత్త స్మార్ట్‌ ఉత్పత్తిని యూజర్లకు పరిచయం చేసింది.  అన్‌-క్యారియర్‌ ఆన్‌ (Un-Carrier On) పేరుతో స్మార్ట్‌ సూట్‌కేస్‌ (Smart Suitcase)ను తీసుకొచ్చింది. శామ్‌సారా లగేజ్‌ సంస్థతో కలిసి టీ మొబైల్‌ ఈ స్మార్ట్‌ సూట్‌కేస్‌ను డిజైన్‌ చేసింది. ఇందులో పవర్‌ బ్యాంక్‌ ఉంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తోపాటు మొబైల్, ల్యాప్‌టాప్‌  ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ-సీ పోర్ట్ ఇస్తున్నారు.

ప్రయాణాల్లో లగేజ్‌ ట్రాకింగ్ కోసం ఇందులో ట్యాగ్‌ స్మార్ట్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంచారు. విమానం ఎక్కేముందు లేదా ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ల్యాప్‌టాప్‌ పెట్టుకునేందుకు వీలుగా ఈ సూట్‌కేస్‌ పైభాగాన్ని డిజైన్ చేశారు. యూజర్‌ సులువుగా తీసుకెళ్లేందుకు 360 డిగ్రీల కోణంలో తిరిగే వీల్స్‌ ఉన్నాయి. విమాన ప్రయాణాల్లో లగేజ్‌ లోపలి వస్తువులు కదలకుండా ఇందులో ఎనిమిది ప్యాకింగ్ క్యూబ్స్‌ ఇస్తున్నారు. దీంతో సూట్‌కేస్‌ను విసిరినా లోపలి వస్తువులు పాడవకుండా ఉంటాయని సంస్థ చెబుతోంది. 

టీ మొబైల్ నెట్‌వర్క్‌ తమ యూజర్లకు విమాన ప్రయాణాల్లో ఉచిత వైఫై సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగానే టీ మొబైల్ అన్‌-క్యారియర్‌ ఆన్‌ స్మార్ట్‌ సూట్‌కేస్‌ను విడుదల చేసింది. దీని ధర 325 డాలర్లు (సుమారు రూ. 26,000). ప్రస్తుతం ఈ సూట్‌కేస్‌ అమెరికన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని రీజియన్లలో పరిచయం చేస్తారని సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని