టెక్‌10: పబ్‌జీకి పోటీగా ‘సికో’.. మూడో ‘నార్జో 30’

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ మరియు గ్యాడ్జెట్‌ విభాగంలో జరిగిన, వెలువడిన విషయాలు మీ కోసం...

Published : 18 Mar 2021 20:49 IST

1. శాంసంగ్‌ ఫోన్‌ వచ్చేది అప్పుడే

శాంసంగ్‌ నుంచి ఈ ఏడాది చాలా స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ఏ సిరీస్‌తోపాటు, ఎస్‌ సిరీస్‌లో కూడా మొబైల్స్‌ రాబోతున్నాయి. అందులో గెలాక్సీ ఎస్‌ 21ఎఫ్‌ మొబైల్‌ ఆసక్తిరేకెత్తిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ ఎప్పుడు వస్తుందా అని టెక్‌ ప్రియులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మొబైల్ విషయంలో కాస్త స్పష్టత వచ్చింది. వచ్చే నెల ఆగస్టు 19న జరిగే ఈవెంట్‌లో ఈ మొబైల్‌ లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. ట్యాబ్‌ ఎస్‌ 7 లైట్‌ జూన్‌లో వస్తుందని సమాచారం. ఏ 22ను జులైలో తీసుకొస్తారట. 

2. వన్‌ప్లస్‌ వాచ్‌ ఫస్ట్‌లుక్‌

వన్‌ ప్లస్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌ వస్తుందని చాలా రోజులగా వార్తలొస్తున్నాయి. ఆ మధ్య వన్‌ప్లస్‌ బ్యాండ్‌ లాంచ్‌ సమయంలోనే వాచ్‌ను కూడా తీసుకొస్తారని చెప్పారు. ఆఖరికి ఈ నెల 23న ఈ వాచ్‌ మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ మొబైల్స్‌తో ఈ వాచ్‌ ఆవిష్కరిస్తారట. ఇందులో గుండ్రటి  డయల్‌ ఉండబోతోంది. అయితే ఈ వాచ్‌ గూగుల్‌ వేర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేయదట. ఆర్‌టీవోఎస్‌ ఆధారిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ వాచ్‌ పని చేస్తుందట. ఇందులో ఐపీ 68 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉండబోతోందని తెలుస్తోంది. 

3. నార్జో 30 రెండు రకాలుగా

రియల్‌మీ నార్జో నుంచి ఇటీవల రెండు కొత్త మొబైల్స్‌ లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ, రియల్‌మీ నార్జో 30ఏ పేరుతో మొబైల్స్‌ను లాంచ్‌ చేశారు. అయితే రియల్‌మీ నార్జో 30 పేరుతో మొబైల్ రాలేదు. ఇందులో రెండు రకాల వేరియంట్లు ఉంటాయని ఆ సమయంలో వార్తలొచ్చాయి. తాజాగా ఆ మొబైల్స్‌ గురించి సమాచారం వచ్చింది. రియల్‌మీ నార్జో 30ని 4జీ, 5జీ వేరియంట్లలో తీసుకొస్తున్నట్లు రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ తెలిపారు. దీంతోపాటు చాలా రోజులుగా ప్లాన్‌ చేస్తున్న రియల్‌మీ స్మార్ట్‌ స్కేల్‌ త్వరలోనే మన మార్కెట్‌లోకి వస్తుందట.

4. యాపిల్‌ మ్యాప్స్‌లో ‘వ్యాక్సిన్‌’ సెంటర్లు

కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలను ఇకపై యాపిల్‌ మ్యాప్స్‌లో చూడొచ్చు. ఈ మేరకు యాపిల్‌ తన మ్యాప్స్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. యాప్‌లోని వ్యాక్సిన్‌ ఫైండర్‌లోకి వెళ్తే... మీ పరిసరాల్లోని వ్యాక్సినేషన్ల సెంటర్ల వివరాలు కనిపిస్తాయి. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మన దేశంలోనూ ఎనేబుల్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ గూగుల్‌ జనవరిలోనే అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

5. ముందుగానే చెప్పేసేలా...

క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ కొత్త ఆప్షన్లు తీసుకొచ్చింది. ‘చెక్స్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా కాపీరైట్‌ సమస్యలు ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు. గతంలో ఏదైనా వీడియో అప్‌లోడ్‌ చేసి, లైవ్‌లోకి వచ్చిన కాసేపటికి దానిమీద కాపీ రైట్ ఇష్యూస్‌ను యూట్యూబ్‌ చూపించేది. అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్‌ చేయగానే ‘చెక్స్‌’ ప్రాసెసర్‌ మొదలవుతుంది. దీంతో మొత్తం ప్రాసెస్‌ పూర్తయి, అందులో ఎలాంటి కాపీ రైట్‌ సమస్యలు లేకపోతేనే... ఆ వీడియో పబ్లిక్‌ అవుతోంది. 

6. రెడ్‌మీ కె40 ప్రోలో అలా ఎందుకు చేశారంటే?

రెడ్‌మీ కె సిరీస్‌లో త్వరలో రెండు ఫోన్లు రాబోతున్నాయి. కె40, కె40 ప్రో పేరుతో రాబోతున్న ఈ మొబైల్స్‌లో శాంసంగ్‌ సూపర్‌ ఆమోలెడ్‌ స్క్రీన్ ఉంటుంది. అయితే  వీటిలో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉండటం లేదు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌నే ఇస్తున్నారు. ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఇచ్చి మళ్లీ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఏంటి? అని టెకీలు అనుకుంటున్నారు. అయితే సైడ్‌ మౌంటెడ్‌ సెన్సర్‌ వేగం ఎక్కువగా ఉండటమే కారణమని సంస్థ చెబుతోంది. అందుకే ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌కి బదులు... సైడ్‌ మౌంటెడ్‌ సెన్సర్‌ను వాడుతున్నామని తెలిపింది. 

7. పబ్‌జీకి కొత్త పోటీ వచ్చేసింది

బ్యాటిల్‌ గేమ్‌ పబ్‌జీకి పోటీగా మరో భారతీయ గేమ్‌ రాబోతోంది. ‘సికో’ పేరుతో రాబోతున్న ఈ గేమ్‌ను ఇండిక్‌ అరెనా అనే డెవలపర్‌ టీమ్‌ రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ట్రైలర్‌ను సికో టీమ్‌ విడుదల చేసింది. పబ్‌జీలో ఉండే మేజర్‌ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయట. ట్రైలర్‌ ప్రకారం చూస్తే అడవులు, దేవాలయ ప్రాంగణాలు, కార్యాలయాల నేపథ్యంలో ఈ గేమ్‌ రన్‌ అవుతోంది. ప్లే స్టోర్‌లో ఉన్న సమాచారం ప్రకారం అయితే... ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌తో ఈ గేమ్‌ ఆడుకోవచ్చు. ప్రస్తుతం గేమ్‌ ప్రి రిజిస్ట్రేషన్‌ మొదలైంది. 

8. ఐకూ కొత్త ఫోన్‌ వచ్చేసింది

ఐకూ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు చైనా మార్కెట్‌లోకి వచ్చాయి. నియో 5 పేరుతో వచ్చిన ఈ మొబైల్‌లో 5జీ సాంకేతికత ఇస్తున్నారు. 6.62 అంగుళాల ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 4,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. 12 జీబీ ఎల్‌పీడీడీఆర్‌ 5 ర్యామ్‌ ఉంటుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉంటుంది. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ఫోన్‌ ప్రారంభ ధర అక్కడి కరెన్సీని మన కరెన్సీలోకి కన్వర్ట్‌ చేస్తే... సుమారు ₹28 వేలు ఉంటుంది. 

9. జూమ్‌ కాల్‌ నుంచి తప్పించుకోవాలా

కరోనా - లాక్‌డౌన్‌ పుణ్యమా అని... ఇప్పుడు చాలావరకు ఆఫీసు పనులు, చదువులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అందులో ఎక్కువమంది వాడుతున్న సర్వీసు జూమ్‌. అయితే జూమ్‌ కాల్‌ కాన్ఫరెన్స్ ఇష్టం లేకపోతే కట్‌ చేయడానికి కారణాలు వెతకాలి.. చెప్పాలి. కానీ ఈ యాప్‌ వాడితే ఆ సమస్య ఉండదట. జూమ్‌ కాల్‌లో ఉన్నప్పుడు ‘జూమ్‌ ఎస్కేపర్‌’ యాప్‌ వాడి మ్యూజిక్‌ ప్లే అయ్యేలా చేసి ఇబ్బందిపెట్టొచ్చట. దీంతో కాల్‌లో డిస్ట్రబెన్స్‌ ఉందని అవతలి వ్యక్తి కాల్‌ కట్‌ చేస్తారు. ఈ సర్వీసుకు సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

10. ఎంఐఫోన్‌లో రెండో డిస్‌ప్లే

షావోమి నుంచి త్వరలో ఎంఐ 11 ప్రో రాబోతోందనే విషయం తెలిసిందే. గత కొన్ని  రోజులుగా ఈ మొబైల్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఫొటోలు బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే... ఈ మొబైల్‌లో వెనుకవైపు చిన్న డిస్‌ప్లే ఉంటుందట. కెమెరా బంప్‌లో ఓవైపు ఈ సెకండరీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీంతో వెనుకవైపు కెమెరాతోనే సెల్ఫీ తీసుకోవచ్చని అంటున్నారు. ఆ లెక్కన ఎంఐ11 ప్రోలో ఫ్రంట్‌ కెమెరా ఉండదని కూడా వార్తలొస్తున్నాయి. త్వరలో ఈ విషయంలో స్పష్టత వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని