
Telegram: టెలిగ్రాం కొత్త ఫీచర్లు.. హైడ్ మెసేజ్.. కలర్‌ఫుల్ క్యూఆర్ కోడ్స్
ఇంటర్నెట్‌డెస్క్: మెసేజింగ్ యాప్ టెలిగ్రాం కొత్తగా నాలుగు ఆసక్తికరమైన ఫీచర్స్‌ను యూజర్స్ కోసం తీసుకొచ్చింది. ఈ జాబితాలో మెసేజ్ రియాక్షన్, స్పాయిలర్, మెసేజ్ ట్రాన్స్లేషన్, థీమ్ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. మరి ఈ ఫీచర్స్ ఎలా పనిచేస్తాయి? వీటితో యూజర్స్‌కు ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
మెసేజ్ రియాక్షన్
యాపిల్ ఐమెసేజ్ తరహాలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇందులోని యానిమేటెడ్ ఎమోజీలతో చాట్ సంభాషణల్లో యూజర్స్ తమ అభిప్రాయాలను మరింత సమర్థంగా చెప్పొచ్చు. అలానే ఇతరుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు టెక్ట్స్‌తో కాకుండా ఎమోజీలతో రిప్లయ్ ఇవ్వొచ్చు. ఇందుకోసం యూజర్స్ చాట్ పేజీలో తాము రిప్లయ్ ఇవ్వాలనుకుంటున్న మెసేజ్‌పై డబుల్ క్లిక్ చేస్తే వివిధ రకాల ఎమోజీలు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన ఎమోజీపై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే యానిమిషన్తో కూడిన ఎమోజీ టెక్ట్స్ మెసేజ్‌కు రిప్లయ్లా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అయితే ఈ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ గ్రూప్‌లో ఎనేబుల్ చేయాలా? వద్దా? అనేది గ్రూప్ అడ్మిన్లు నిర్ణయిస్తారు. వ్యక్తిగత చాట్‌లో అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ సెట్టింగ్స్‌లో క్విక్ రియాక్షన్లోకి వెళ్లి ఎనేబుల్ చేయాలి. ఐఓఎస్ యూజర్స్ సెట్టింగ్స్‌లో స్టిక్కర్స్ అండ్ ఎమోజీలోకి వెళ్లి క్విక్ రియాక్షన్ ఎనేబుల్ చేసి ఈ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు. గ్రూప్ చాట్‌లో అడ్మిన్లు ఛానల్ ఇన్ఫో పేజీలోకి వెళ్లి, ఎడిట్పై క్లిక్ చేస్తే రియాక్షన్స్ ఆప్షన్ వస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే గ్రూప్స్‌లో కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
స్పాయిలర్
ఇతరుల నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడు అందులోని సమాచారం కోసం ఆసక్తిగా ఓపెన్ చేస్తాం. అయితే టెలిగ్రాం కొత్తగా తీసుకొచ్చిన స్పాయిలర్ ఫీచర్లో యూజర్ ఉత్సాహాన్ని మరింత పెంచేలా మార్పులు చేసింది. ఇందులో మీరు పంపే మెసేజ్‌లో కొంత భాగాన్ని హైడ్ చేయొచ్చు. రిసీవర్ మెసేజ్‌పై క్లిక్ చేస్తేనే అందులో ఏముందనేది తెలుస్తుంది. చాట్ పేజీలో టెక్ట్స్ టైప్ చేసిన తర్వాత మెసేజ్‌లో దేన్ని హైడ్ చేయాలనుకుంటున్న భాగాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ, పేస్ట్, ఇటాలిక్ వంటి ఆప్షన్లతోపాటు మీకు స్పాయిలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన మెసేజ్ ముందు స్పాయిలర్ అలర్ట్ అని చూపిస్తూ మెసేజ్ హైడ్ అవుతుంది. నోటిఫికేషన్లలో కూడా మీకు కేవలం స్పాయిలర్ అలర్ట్ అని మాత్రమే కనిపిస్తుంది.
మెసేజ్ ట్రాన్స్లేషన్
ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడిలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యూజర్స్ గ్రూపులుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో గ్రూపులోని వ్యక్తులు షేర్ చేసే సమాచారం వేరే భాషలో ఉంటే మిగతా వారు దాన్ని అర్థం చేసుకోలేరు. ఈ సమస్యకు పరిష్కారంగా టెలిగ్రాం ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్ తమకు అర్థంకానీ మెసేజ్‌పై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ట్రాన్స్లేషన్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు కావాల్సిన భాషలోకి సమాచారాన్ని మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాంగ్వేజ్ బటన్‌పై క్లిక్ చేస్తే షో ట్రాన్స్‌లేట్ బటన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.
థీమ్డ్ క్యూఆర్ కోడ్స్
మన ఫేవరెట్ పేజ్ లేదా క్లబ్‌ను ఇతరులకు చూపించేందుకు క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి దాన్ని వారితో షేర్ చేస్తాం. అయితే ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే ఉంటుంది. టెలిగ్రాం తాజాగా తీసుకొచ్చిన ఫీచర్లో క్యూఆర్ కోడ్‌ను మనకు నచ్చిన రంగులోకి మార్చి ఇతరులకు పంపొచ్చు. ఈ ఫీచర్ కోసం యూజర్ నేమ్ పక్కనున్న క్యూఆర్ కోడ్‌పై క్లిక్ చేస్తే మీకు వేర్వేరు రంగుల్లో క్యూఆర్ కోడ్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన రంగులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను షేర్ చేయొచ్చు. దీంతోపాటు టెలిగ్రాం ఇంటరాక్టివ్ వెర్షన్ పేరుతో పాత ఎమోజీలకు కొత్త హంగులను అద్దింది. వీటిలో యూజర్స్ ఎమోజీ పంపిన వెంటనే దానికి సంబంధించిన యానిమేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఇవీ చదవండి
Advertisement