టెలిగ్రాంలో వాట్సాప్ ఫీచర్స్‌..ఏంటో తెలుసా!

వాట్సాప్ కొత్త పాలసీ నిబంధనలు వివాదాస్పదం కావడంతో టెలిగ్రాంతో సహా ఇతర మెసేజింగ్ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తాజాగా వాట్సాప్‌ తరహా ఫీచర్స్‌ని టెలిగ్రాం యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం....

Updated : 24 Feb 2021 11:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వాట్సాప్ కొత్త పాలసీ నిబంధనలు వివాదాస్పదం కావడంతో టెలిగ్రాంతో సహా ఇతర మెసేజింగ్ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో యూజర్స్‌ను ఆకట్టుకునేందుకు సదరు యాప్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌ తరహా ఫీచర్స్‌ని టెలిగ్రాం యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్స్‌ బీటా వెర్షన్లలను పరీక్షిస్తున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే టెలిగ్రాం యూజర్స్ అందరికీ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి ఆ ఫీచర్స్‌ ఏంటో.. అవి ఎలా పనిచేస్తాయో ఒక్కసారి చూద్దాం..!

క్యూఆర్‌ కోడ్

కొత్త వ్యక్తులు ఎవరైనా టెలిగ్రాంలో ఉండే గ్రూపులో చేరాలంటే వారి నంబర్‌ని గ్రూప్‌ అడ్మిన్‌ యాడ్ చేయాలి. కొత్తగా తీసుకొస్తున్న క్యూఆర్‌ కోడ్ ఫీచర్‌తో టెలిగ్రాం యూజర్స్‌ సులభంగా గ్రూప్‌లో చేరవచ్చు. ఇందుకోసం గ్రూప్ క్యూఆర్‌ కోడ్‌ని టెలిగ్రాం యూజర్‌తో షేర్ చేసుకుంటే వాళ్లు ఆ కోడ్ స్కాన్‌ చేసి గ్రూప్‌లో చేరిపోతారు. వాటితో పాటు ఇన్వైట్ లింక్‌లు ఉపయోగించి కూడా గ్రూప్‌లోకి ఆహ్వానించొచ్చు. అయితే వీటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అలానే ఈ కోడ్‌ని ఎక్కువ సార్లు స్కాన్ చేసినా పనిచేయదు. ఈ ఫీచర్ గ్రూప్‌ సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది. టెలిగ్రాం బీటా వెర్షన్ వాడుతున్న యూజర్స్ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

స్పామ్‌ రిపోర్ట్‌ 

గ్రూప్‌లో చాలా మంది తమకు ఇతరుల నుంచి వచ్చిన మెసేజ్ లేదా సమాచారాన్ని చదవకుండా యథాతథంగా ఫార్వార్డ్ చేస్తుంటారు. దానివల్ల మంచికంటే చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. అందుకే గ్రూప్‌లో ఏదైనా కంటెంట్ మీకు అభ్యంతరకరంగా లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సదరు మెసేజ్‌ లేదా సమాచారాన్ని స్పామ్‌ అని ఫిర్యాదు చెయ్యొచ్చు. ఈ ఫీచర్ కోసం మెసేజ్‌పై క్లిక్ చేయాలి. అందులో మీకు రిపోర్ట్ అనే ఫీచర్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫిర్యాదుకు సంబంధించి ఐచ్ఛికాలు కనిపిస్తాయి. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి సెండ్ రిపోర్ట్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

విడ్జెట్స్‌ 

టెలిగ్రాం కొత్త అప్‌డేట్‌లో 2X2, 5x2 వెర్షన్‌లో రెండు విడ్జెట్‌లను పరిచయం చేస్తున్నారు. వీటిలో 2X2లో నాలుగు థంబ్‌ నెయిల్స్‌ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ఛాట్ పేజీలను థంబ్‌నెయిల్స్‌గా పెట్టుకోవచ్చు. ఇక 5x2 విడ్జెట్‌లో మీరు చివరిగా ఛాట్‌ చేసిన జాబితా ఆధారంగా ఛాట్ పేజీలు కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని