5G: ఎన్ని దేశాల్లో ‘5జీ’ ఉందో తెలుసా?

ప్రస్తుతం ఉన్నది డిజిటల్‌ యుగం. ఏం కావాలన్నా ఇంటర్నెట్‌ ద్వారా చేతికందుతోంది. అందుకే, ఇప్పుడు ఇంటర్నెట్‌ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే, ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్‌ కోసం 4జీ నెట్‌వర్క్‌ని వినియోగిస్తుండగా.. ఈ ఏడాదిలో మనం 5జీకి మారబోతున్నట్లు తాజాగా కేంద్రం

Published : 01 Feb 2022 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఉన్నది డిజిటల్‌ యుగం. ఏం కావాలన్నా ఇంటర్నెట్‌ ద్వారా చేతికందుతోంది. అందుకే, ఇప్పుడు ఇంటర్నెట్‌ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే, ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్‌ కోసం 4జీ నెట్‌వర్క్‌ని వినియోగిస్తుండగా.. ఈ ఏడాదిలో మనం 5జీకి మారబోతున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. 5జీతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌, పౌరసేవలు విస్తృతంగా అందించేందుకు వీలవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ 5జీ నెట్‌వర్క్‌ అంటే ఏంటి? ఏయే దేశాల్లో అందుబాటులో ఉందో ఓ సారి చూసేద్దాం..

5జీ అంటే..

అవసరాలకనుగుణంగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూవస్తోంది. అందులో భాగమే ఈ 5వ జనరేషన్‌ నెట్‌వర్క్‌(5జీ). గతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ కోసం 2జీ నెట్‌వర్క్‌ ఉండేది. దానితో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌కి చాలా సమయం పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది.. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే, త్వరలో రాబోతున్న 5జీ నెట్‌వర్క్‌ 4జీ కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. దీని వేగం కనీసం 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ వరకు ఉంటుందట. గరిష్ఠంగా 10జీబీపీఎస్‌ ఉండొచ్చని అంచనా. 5జీ వేగానికి ఉదాహరణ చెప్పాలంటే.. మూడు గంటలు ఉన్న ఒక సినిమా ఒక్క సెకండ్‌లోనే డౌన్‌లోడ్‌ అయిపోతుంది.

ఏయే దేశాల్లో అందుబాటులో ఉంది?

దశాబ్దం కిందటి నుంచే 5జీ నెట్‌వర్క్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే, యూఎస్‌, దక్షిణ కొరియా, చైనా దేశాలు 2020 నాటికే 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. చైనాలో 376 నగరాల్లో, అమెరికాలో 284 నగరాల్లో, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో 5జీ సేవలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు అత్యధిక నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల జాబితాలో యూకే, స్పెయిన్‌, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, ఫ్రాన్స్‌, థాయ్‌లాండ్‌, స్వీడెన్‌, ఇస్టోనియా, ఫిలిప్పీన్స్‌ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో 30శాతం అంటే దాదాపు 61 దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, పూర్తిస్థాయిలో ఈ సేవలు అందడానికి ఇంకొంత సమయం పడుతుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో అత్యధిక 5జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 415 ఎంబీపీఎస్‌గా ఉంది.

భారత్‌లో పరిస్థితేంటి?

దేశంలోనూ 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 5జీ పరీక్షలను నిర్వహించేందుకు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ టెలికాం సంస్థలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆయా టెలికాం సంస్థలు పలు నగరాల్లో 5జీ ట్రయల్స్‌ని కూడా నిర్వహించాయి. దీంతో దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఈ ఏడాదిలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ నగరాల జాబితాలో హైదరాబాద్‌, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో 5జీ సేవలు విజయవంతంగా అమలైతే.. దేశవ్యాప్తంగా విస్తరింపజేయనున్నారు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని