
Password: మీ పాస్వర్డ్స్ స్ట్రాంగేనా? తెలుసుకోండిలా!
ఇంటర్నెట్ డెస్క్: హ్యాకర్స్(Hackers), హ్యాకింగ్... ఈ పదాలు వింటే చాలు, మన ఆన్లైన్ ఖాతాలకు సెట్ చేసిన పాస్వర్డ్స్ భద్రంగా ఉన్నాయా లేదా అన్న చిన్న సందేహం వస్తుంది. అంతేనా ఒకసారి అన్ని అకౌంట్లు ఓపెన్ చూసుకొని చెక్ చేసేసుకుంటాం కూడా.. ఎందుకంటే ఆన్లైన్ దొంగలు(హ్యాకర్స్) అంతలా భయపెట్టేశారు. మన బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్స్.. ఇలా ఏ అకౌంట్స్ నుంచైనా మన వ్యక్తిగత సమాచారం వారికి దొరికిందంటే... ఇక మన కథ కంచికే. అందుకే అలా జరగకుండా పాస్వర్డ్స్ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్ క్రోమ్(Google Chrome)లో ఒక సెట్టింగ్ ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి..
పాస్వర్డ్ చెకర్
పాస్వర్డ్స్(Passwords) హ్యాక్‌కు గురవుతాయనే ఆందోళన ఇక అవసర్లేదు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాటికి చెక్ పెట్టనుంది. అందులోని ఒక ఫీచర్.. మీ పాస్వర్డ్ ఎప్పుడైనా హ్యాకింగ్‌కు గురైతే వెంటనే గుర్తించి నోటిఫికేషన్ రూపంలో మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అదే పాస్వర్డ్ చెకర్. ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్, డెస్క్‌టాప్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పాస్వర్డ్లు హ్యాక్(Hack) అయ్యాయో లేదో.. ఈ ఫీచర్‌తో తెలుసుకోవచ్చు. అయితే వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను క్రోమ్‌లో సేవ్ చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఫీచర్ పనిచేయదు. పాస్వర్డ్ స్ట్రాంగ్‌గా లేకపోతేనూ.. అది గుర్తించి మనకు ఒక సెక్యూరిటీ అలర్ట్‌ను పంపిస్తుంది.
ఇలా పనిచేస్తుంది
ట్విటర్, ఫేస్బుక్, జీమెయిల్, బ్యాంక్ అకౌంట్స్... ఇలా ఏ అకౌంట్ అయినా గూగుల్‌తో సింక్(Sync) అయివుండాలి. ఎప్పుడైనా మీ అకౌంట్స్‌ను మీ అనుమతి లేకుండా ఎవరైనా యాక్సెస్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంటే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి.
క్రోమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి >> అందులో ‘‘ఆటో ఫిల్’’ ఆప్షన్‌కు వెళ్లాలి >> అక్కడ ‘‘పాస్వర్డ్స్’’ >> ‘‘చెక్ పాస్వర్డ్స్’’ను క్లిక్ చేయాలి. అంతే.. మీ అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను గూగుల్ క్రోమ్ సర్వర్లకు పంపి విశ్లేషిస్తుంది. మీ పాస్వర్డ్ బలహీనంగా ఉంటే మిమ్మల్ని పాస్‌వర్డ్‌ను మార్చుకోమని చెబుతుంది. లేదంటే ఎప్పుడైనా కొత్త ఐపీ నుంచి మీ అకౌంట్స్‌లో లాగిన్ చేసినా.. మిమ్మల్ని క్రోమ్ అప్రమత్తం చేస్తుంది.
హ్యాకర్స్‌కు దొరక్కుండా..
అసలు పాస్వర్డ్లు హ్యాకర్స్‌కు దొరక్కుండా ఉండాలంటే.. ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ని మరోసారి వాడకుండా చూసుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అన్ని ఆన్లైన్ ఖాతాలకు ఒకే పాస్వర్డ్ ఉపయోగించొద్దని సూచిస్తున్నారు. పాస్వర్డ్స్ ఎప్పుడూ అక్షరాలు, సింబల్స్, పంక్చువేషన్తో కలిసి ఉండాలని, తరచుగా వాటిని మారుస్తూ ఉండాలని తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి యాప్ ఆధారిత అథెంటికేటర్ యాప్‌లను వాడాలని సూచిస్తున్నారు. వీటిలోని కోడ్స్ కాలపరిమితి తక్కువ. ఆ పరిమిత సమయం తర్వాత పనిచేయవు. దాంతో వీటిని తెలుసుకున్నా ఉపయోగించి ప్రయోజనం లేదని తెలిపారు. వీటి కన్నా.. ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ లేదా వాయిస్, ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉపయోగిస్తే ఉత్తమం అని చెబుతున్నారు.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.