Google Wallet: డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం గూగుల్ మరో కొత్త యాప్‌!

డిజిటల్‌ చెల్లింపులు చేసే వారికోసం గూగుల్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్ పే యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త పేమెంట్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం...

Updated : 23 Jul 2022 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిజిటల్‌ చెల్లింపులు చేసే వారికోసం గూగుల్ (Google) మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్ పే (Google Pay) యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త పేమెంట్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. గూగుల్ వాలెట్‌ (Google Wallet) పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌ను ముందుగా భారత్‌ సహా 39 దేశాల్లో ఆండ్రాయిడ్, వేర్ ఓఎస్‌తో పనిచేస్తున్న డివైజ్‌లలో పరిచయం చేయనుంది. ఈ యాప్‌లో కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకురానుంది. మరి గూగుల్ వాలెట్‌లో రాబోతున్న ఆ ఫీచర్లేంటో చూద్దామా? 

ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ అనగానే కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే కాదు, ఇతరత్రా ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ల వివరాలతోపాటు లాయల్టీ కార్డులు, బోర్డింగ్‌ పాస్‌లు, ట్రాన్సిట్‌ కార్డులు, హోటల్‌ కీ వంటి వాటిని కూడా వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంత సమాచారం ఒకే యాప్‌లో ఉంటే దాని భద్రత కూడా పటిష్ఠంగా ఉండాలి కదా! అందుకే గూగుల్ సంస్థ వాలెట్‌ యాప్‌కు పేస్‌ రికగ్నిషన్‌, పాస్‌వర్డ్‌ లాకింగ్‌ ఫీచర్‌తో భద్రత కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా డేటా భద్రత కోసం ఎన్‌క్రిప్షన్‌ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. టికెట్‌ రిజర్వేషన్‌, టికెట్ బుకింగ్‌, ట్రాన్సిట్‌ కార్డ్‌ కోసం ఇతర యాప్‌లను ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాలెట్ యాప్‌ నుంచే యాక్సెస్‌ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పిస్తోంది.

గూగుల్ వాలెట్ అనే పేరు ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్తేమీకాదు. యాపిల్‌ పే తరహాలో తొలుత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో గూగుల్ వాలెట్‌ను పరిచయం చేశారు. 2015లో దాని పేరును ఆండ్రాయిడ్ పే (Android Pay)గా మార్చారు. 2018లో మరోసారి గూగుల్ పే అని రీబ్రాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇదే పేరుతో యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు డిజిటల్‌ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. త్వరలోనే దీని స్థానంలో గూగుల్ వాలెట్ అందుబాటులోకి రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని