Published : 12 Jun 2022 20:47 IST

Android Apps: ఫోన్‌ వాడకం రొటీన్‌గా ఉందా..? అయితే ఈ యాప్స్‌ను ప్రయత్నించండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగించాలంటే యాప్స్‌ తప్పనిసరి. ప్రొడక్టవిటీ నుంచి గేమింగ్ వరకు యూజర్ల అవసరాలకు అనువైన ఎన్నో రకాల యాప్స్‌ ప్లేస్టోర్‌లో ఉన్నాయి. ఇవి ఫోన్‌ వినియోగంలో యూజర్‌కు సరికొత్త అనుభూతిని అందించడంతోపాటు ముఖ్యమైన వ్యవహారాలను సులువుగా చక్కబెట్టేందుకు సాయపడుతుంటాయి. మరి ఆ యాప్‌లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..


నయాగారా లాంచర్‌ (Niagara Launcher)

కొత్త ఫోన్‌ కొన్నప్పటికీ అందులోని ఓఎస్‌ పాతదే కావడంతో చాలా మంది బోర్‌ ఫీలవుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంలో కొత్తదనం కోరుకునేవారు ఈ లాంచర్‌ను తమ ఫోన్లలో ఉపయోగించవచ్చు. ఇది ఫోన్‌కు కొత్త లుక్‌ను ఇవ్వడంతోపాటు డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌ను తగ్గిస్తుంది. ఎలాంటి ప్రకటనలు ఉండవు. ఇందులో ఐకాన్స్‌, విడ్జెట్స్‌, నోటిఫికేషన్స్, యాప్‌లు ముందు వరుసలో కనిపించేలా ప్రత్యేక ఫీచర్స్‌ ఉన్నాయి. నోటిఫికేషన్స్‌ కూడా హోమ్‌ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. ప్రాధ్యానంలేని నోటిఫికేషన్స్‌ను ఆటోమేటిగ్గా ఫిల్టర్ చేయడంతోపాటు, యూజర్‌కు నచ్చిన యాప్స్‌ను ప్రాధాన్యక్రమంలో చూపిస్తుంది.  


మైటీ టెక్ట్స్‌ (Mighty Text)

మీరు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇంతలో ఏదో ముఖ్యమైన విషయమై ఇతరులకు టెక్ట్స్‌ మెసేజ్‌  పంపాలి. వాట్సాప్‌లో అయితే ల్యాప్‌టాప్‌/పీసీ ఆన్‌ చేసి ఉంటుంది కాబట్టి వెబ్‌ వాట్సాప్‌ నుంచి పంపుతాం. కానీ సాధారణ టెక్ట్స్‌ మెసేజ్‌ అయితే తప్పక మొబైల్‌ నుంచి పంపాల్సిందే. ఇలాంటప్పుడే సాధారణ మెసేజ్‌ కూడా మొబైల్‌ నుంచి పంపితే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారు మైటీ టెక్ట్స్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు. ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ల్యాప్‌టాప్‌/పీసీలో బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఇన్‌స్టాల్ చేసుకుని ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్‌తో ల్యాప్‌టాప్‌/పీసీ నుంచే మెసేజ్‌లు పంపడం, చదవడం, వాటికి రిప్లై ఇవ్వడంతోపాటు మొబైల్‌లోని ఇతర యాప్‌ల నోటిఫికేషన్లు కూడా చూడొచ్చు. అలానే ఫోన్‌కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఉచిత వెర్షన్‌లో నెలవారీ పరిమితి ఉంటుంది. ఒకవేళ మీరు అన్‌లిమిటెడ్‌గా ఉపయోగించుకోవాలనుకుంటే సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. 


సూపర్‌ స్టేటస్‌ బార్‌ (Super Status Bar)

ఆండ్రాయిడ్‌లో ఉన్నట్లుగా కస్టమైజేషన్‌ ఆప్షన్లు మరే ఏ ఓఎస్‌లోనూ ఉండవు. అయితే స్టేటస్‌ బార్‌ విషయంలో మాత్రం ఆండ్రాయిడ్ యూజర్లు ఒకింత అసంతృప్తికి లోనవుతుంటారు. అలాంటి వారు సూపర్‌ స్టేటస్‌ బార్‌ను ప్రయత్నించవచ్చు. ఇందులో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను అడ్జెస్ట్ చేసుకోవడంతోపాటు‌, స్క్రీన్‌ మీద స్వైప్‌ చేసి వాల్యూమ్‌ లెవెల్స్‌లో మార్పులు చేయొచ్చు. అలానే మెసేజ్‌లు, నోటిఫికేషన్ల, బ్రౌజింగ్‌ ట్యాబ్‌కు టిక్కర్‌ను పెట్టుకోవచ్చు. బ్యాటరీ లైఫ్‌, గెస్చర్‌ కంట్రోల్‌ వంటి వాటిని మానిటర్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ యాప్‌ ఉచిత, సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్లలో అందుబాటులోకి ఉంది.  


నోట్‌పిన్‌ (Notepin) 

ఈ యాప్‌ కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజులో మనం ఏమేం పనులు చేయాలనేది నోట్స్‌ రాసుకొని స్టేటస్‌ బార్‌లో పిన్‌ చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యమైన వాటిని ముందుగా పిన్‌ చేసుకోవడం లేదా రీసెంట్‌గా యాడ్‌ చేసిన నోట్‌ను ముందుకు తెచ్చుకోవడంతోపాటు వాటికి కలర్‌ ఇవ్వొచ్చు. ఒక్కసారి నోట్‌ను స్టేటస్‌ బార్‌లో పిన్‌ చేస్తే యూజర్‌ అన్‌పిన్‌ చేసే వరకు అక్కడే ఉంటుంది. ఆర్గనైజ్డ్‌గా ఉండి, ప్రొడక్టివిటీ మీద ఎక్కువ దృష్టి సారించే వారికి ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts