Password: మీరిలాంటి పాస్‌వర్డ్‌నే ఉపయోగిస్తుంటే.. వెంటనే మార్చుకోవాలి!

ఆన్‌లైన్ భద్రత అనగానే ముందుగా చేసే సూచన పాస్‌వర్డ్‌ (Password). వెబ్‌ విహారంలో ఇది తొలి దశ భద్రతా వలయంగా పనిచేస్తుంది. పాసవర్డ్ పటిష్ఠంగా ఉండే ఖాతాలను సైబర్‌ నేరస్థులు అంత సులువుగా హ్యాక్‌ చేయలేరనేది సైబర్‌ నిపుణులు చెబుతున్నమాట..

Updated : 11 Jun 2022 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్ భద్రత అనగానే ముందుగా చేసే సూచన పాస్‌వర్డ్‌ (Password) మార్చుకోవాలని! పాస్‌వర్డ్ పటిష్ఠంగా ఉండే ఖాతాలను సైబర్‌ నేరస్థులు అంత సులువుగా హ్యాక్‌ చేయలేరనేది సైబర్‌ నిపుణులు చెబుతున్నమాట. అయితే చాలా మంది యూజర్లు తమ పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవడం కోసం నంబర్స్‌, అల్ఫాబెట్స్‌, పేర్లు వంటివి పెట్టుకుంటున్నారు. దీంతో హ్యాకర్స్‌ వాటిని సులువుగా ఛేదించి యూజర్‌ డేటా, ఖాతాల్లోని నగదును దొంగలిస్తున్నారని సైబర్‌ సెక్యూరిటీ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. అలానే యూజర్స్‌ తరచూ ఉపయోగించే పాస్‌వర్డ్‌ లిస్ట్‌ను నార్డ్‌ పాస్‌వర్డ్స్‌ (Nord Password) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ విడుదల చేసింది. మరి ఈ జాబితాలో మీరు ఉపయోగించే పాస్‌వర్డ్‌ ఉందేమో చెక్‌ చేసుకోండి.

యూజర్స్‌ ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్స్‌

ఎక్కువ మంది 12345678/987654321/111111/666666 కాంబినేషన్‌ను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. మరికొంత మంది కీబోర్డులోని ఆంగ్ల అక్షరాల కాంబినేషన్‌ను, అంటే asdfgh/qwerty/zxcvbnm/abcdef వంటి వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారట.

అలానే qwerty123/Hello123 వంటి వాటితోపాటు సులువుగా ఉండే password/sweety/I love You/ p@ssword/ passw0rd/ samsung/ monkey/ dragon/ sweety/ master/ goodluck/ prince/ srinivas/ engineer/ lovely/ creative వంటి పదాలను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని నార్డ్ సంస్థ వెల్లడించింది. ఇలాంటి పాస్‌వర్డ్‌లను హ్యాకర్స్‌ సులువుగా ఛేదించగలుగుతారని తెలిపింది.

పాస్‌వర్డ్‌ సూచనలు

అంతేకాకుండా పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి యూజర్లకు కొన్ని కీలక సూచనలు చేసింది. యూజర్స్‌ తమ పాస్‌వర్డ్‌ అక్షరాలు, నంబర్లు, స్పెషల్‌ క్యారెక్టర్ల కలయికగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అలానే పాస్‌వర్డ్‌లో అప్పర్‌ కేస్ అక్షరాలు, లోయర్‌ కేస్‌ అక్షరాలు, అంకెలతో పాటు గుర్తులను ఉపయోగించడం మేలని తెలిపింది. ఉదాహరణకు Rocky@1058#bhai. పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఈ విధంగా పాస్‌వర్డ్ పెడితే హ్యాకర్స్‌ సులువుగా పసిగట్టలేరని తెలిపింది.

పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయం

పాస్‌వర్డ్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దిగ్గజ టెక్ సంస్థలు పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయంగా మల్టీ-డివైజ్‌ ఫిడో క్రెడెన్షియల్స్‌ (Multi-Device FIDO Credential) అనే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ సాంకేతికతలో యూజర్‌ ఫోన్ పాస్‌వర్డ్‌గా పనిచేస్తుందని సమాచారం. దీంతో యూజర్లకు పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

ఇప్పటికే జీ-మెయిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను పరిచయం చేశాయి. ఇందులో యూజర్లు పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసినా తమ మొబైల్‌ నుంచి లాగిన్‌ అనుమతివ్వడం లేదా మొబైల్‌లోని యాప్‌లో కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చూపించే నంబర్స్‌ ఎంటర్‌ చేయడం వంటివి చేయాలి. ఇక యాపిల్‌ కంపెనీ తాజాగా తీసుకొచ్చిన పాస్‌ కీస్‌ టెక్నాలజీలో యూజర్‌ ఐడీతో ఎంటర్‌ చేశాక.. ఫేస్‌కీస్‌లో అప్రూవ్‌ చేయమని కోరుతుంది. తర్వాత ఫింగర్‌ ప్రింట్‌/ఫేస్‌ఐడీ /పాస్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే లాగిన్ అవుతుంది. పాస్‌కీస్‌ ఫీచర్‌ను పబ్లిక్‌ కీ క్రిపోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా రూపొందించారు. దీనివల్ల ఫిషింగ్‌లు, లీక్‌లు వంటి వాటికి తావు ఉండదని యాపిల్‌ సంస్థ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని