CES 2022 : టెక్‌ ప్రపంచంలో ఒక్కోటి ఒక్కో రకం.. దేనికదే విచిత్రం!

ప్రపంచ టెక్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ఒక్కో గ్యాడ్జెట్‌ ఒక్కో రకంగా.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తున్నాయ్‌..  

Published : 06 Jan 2022 01:58 IST

ప్రపంచ అతిపెద్ద టెక్‌ సందడి (Consumer Electronics Show, CES-2022) మొదలైంది. జనవరి 5 నుంచి 7 వరకు జరిగే వరల్డ్‌ బిగెస్ట్‌ టెక్‌ షో అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు, టెక్‌ విద్యార్థులు వారి అత్యాధునిక ఆవిష్కరణలను తొలిరోజు వేదిక ముందు పెట్టారు. వాటిలో ఒక్కోటి ఒక్కో రకంగా.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ కట్టిపడేలా ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కెయండి..!


నిలబడ్డా కూర్చునట్టే..!

రోజంతా నిలబడి పనిచేసే సెక్యూరిటీగార్డు వంటి ఉద్యోగుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..! ఈ ఆలోచన నుంచే ఓ వ్యక్తి సరికొత్త సూట్‌ ఆవిష్కరణను సృష్టించారు. ఈ మేరకు దానిని టెక్‌ సదస్సు ముందుంచారు. ఎక్కోస్కెలిటన్‌ అని నామకరణం చేసిన ఈ సూట్‌ ధరించి నిలబడ్డా కూడా కూర్చునట్లే పనిచేసుకోవచ్చు. తద్వారా ఎటువంటి కీళ్ల నొప్పులు ఉండవు.


లిటిల్‌ స్పీకర్‌

స్పీకర్లు ఎందుకు పెద్దగా ఉండాలి..?అని అనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి.. ఏకంగా మొబైల్స్‌ వెనక అతికించే లిడిల్‌ అనే బ్లూటూత్‌ స్పీకర్‌ను కనిపెట్టాడు.  టెక్‌ సదస్సులో లిడిల్‌ స్పీకర్‌ పనితనాన్ని వివరించాడు. మాగ్నెటిక్‌ ఇంటర్‌ఫేస్‌తో వచ్చే ఈ స్పీకర్‌ బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌తో ఛార్జ్‌ అవుతుంది. 


సింగిల్‌ ఛార్జ్‌తో సుదూరం..

ప్రపంచం ఇప్పుడు నెట్‌ జీరో వెంట పరుగులు పెడుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వీటిలో భాగమే ఎలక్ట్రిక్‌ వాహనాలు. బ్యాటరీలతో ఉద్గారాల విషయాన్ని కాసేపు పెక్కనపెడితే! సింగిల్‌ ఛార్జ్‌తో 200 మైళ్లు ప్రయాణించే ఎలక్టిక్‌ బైక్‌ను ‘డెల్‌ఫాస్ట్‌’ అభివృద్ధి చేసింది. టెక్‌ సదస్సులో ఇది విశేష మన్ననలు అందుకుంటోంది. అలాగే ప్రపంచంలోనే తొలిసారి మంచులో దూసుకెళ్లే ఎలక్ట్రిక్‌ బైక్‌ ‘మూన్‌బైక్స్‌ మోటార్స్‌‌’ను ఈ వేడుకలో ప్రదర్శించారు. మరోవైపు విజన్‌-ఎస్‌ 02 పేరుతో ప్రముఖ దిగ్గజ కంపెనీ సోని సీఈఎస్‌-2022లో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయనుంది. 


సాగుకు చేదోడుగా.. 

సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చచొచ్చు కదా..! పలువురి నోట తరచూ వినిపించే మాట ఇది. దీని ఆధారం చేసుకోనే నయో టెక్నాలజీస్‌ సంస్థ ‘OZ’ పేరుతో ఓ రోబోట్‌ను అభివృద్ధి చేసింది. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చడానికి ఇదీ ఎంతో ఉపకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ పనులను ఆటోమేట్‌ చేయవచ్చట. ఇదిలా ఉంటే.. మరో డైనమిక్‌ రోబోతో వేడుకకు వచ్చిన హుందాయ్‌ మోటర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ యుసన్‌ చుంగ్‌ కాసేపు అలరించారు.


అందంతో పాటే భద్రత! 

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని MyEli కంపెనీ ఓ బ్రాస్‌లెట్‌ తయారు చేసింది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ బ్రాస్‌లెట్‌పై చిన్న ట్యాప్‌ చేస్తే చాలు.. సంబంధింత ఠాణాలకు సమాచారం వెళ్తుంది. చూడటానికీ బ్రాస్‌లెట్‌ చాలా అందంగా కనిపిస్తుంది.  


పిల్లల సందడీ ఉందండోయ్‌..!

సీఈఎస్‌ 2022లో ఈసారి పిల్లల ఆట వస్తువుల సందడి కూడా ఉందండోయ్‌. ఈ మేరకు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆవిష్కరించిన ‘అమాగామి హామ్ హామ్’ అనే ఆట బొమ్మ థెరప్యూటిక్ రోబోట్‌ మాదిరి పనిచేస్తుందట. చిన్నపిల్లలు ఈ బొమ్మ నోట్ల వేలు పెట్టి ఎంచక్కా ఆడుకోవచ్చు.


గృహోపకరణాలు

గృహోపకరణాలకు సంబంధించి సీఈఎస్‌-2022లో అత్యాధునిక డిష్‌ వాషర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని 9 లీటర్ల నీటితో ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. 


రియాలిటీ చెక్‌..

వర్చువల్‌ రియాలిటీ చిత్రీకరణ కోసం తీర్చిదిద్దిన డ్యూయల్ ఫిష్-ఐ లెన్స్‌ (dual fish-eye lens ) కెమెరాను కెనాన్‌ (Canon) ఈ వేడుకలో ప్రదర్శించింది. 


సరికొత్త సెన్సర్‌.. 

టెక్నాలజీ యుగం దూసుకెళ్తోన్న వేళ మరో సరికొత్త పేపర్‌ నానో టెక్‌ సెన్సర్‌ను (paper nanotech sensor) అమెరికా చెందిన వ్యక్తి ఈ వేడుకలో ప్రదర్శించారు.  వివిధ రకాల టచ్‌లెస్‌ టెక్నాలజీతో దీనిని వాడుకోవచ్చని పేర్కొన్నారు.


మరింత ర్యాపిడ్‌గా కరోనా టెస్టులు

 సరికొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కరోనా ఫస్ట్‌ ర్యాపిడ్‌ టెస్టు కిట్‌ను TestNPass ఈ వేడుకలో ప్రదర్శనకు పెట్టింది. సాధారణ టెస్టులతో పోలిస్తే ఇవీ వేగంగా కరోనా ఫలితాన్ని ఇస్తాయట. 


టెక్‌ మాస్క్‌

టెక్ సదస్సులో ఈ టెక్నాలజీ మాస్కు ఆకర్షణగా నిలిచింది. Airxom కంపెనీ తయారుచేసిన ఈ మాస్కు సేంద్రియ, రసాయన కాలుష్య కారకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. 


బద్దకిస్టుల బ్రష్‌లు

టెక్నాలజీ అందరి అవసరాలను తీరుస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన చాలా ఆవిష్కరణలు ఆ కోవకు చెందినవే. కానీ, ఈ బ్రష్‌ మాత్రం బద్దకస్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం 10 సెకన్లలోనే దంతాల్ని శుభ్రం చేస్తుంది. బ్యాటరీ, యూఎస్‌బీ కేబుల్ సహాయంతో పని చేసే దీనికి ‘ఫాస్టీష్‌ వై బ్రష్‌’ అని పేరు పెట్టారు. అలాగే ‘హమ్’ ఎలక్ట్రిక్‌ తయారు చేసిన స్మార్ట్‌ టూత్‌ బ్రష్‌ మన బ్రషింగ్‌ అలవాట్లను ట్రాక్‌ చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని