Face ID with Mask: మాస్క్‌ ఉన్నా ఫేస్‌ఐడీ అన్‌లాక్‌.. ఈ కంపెనీ తొలి ప్రయత్నం!

కొవిడ్‌ మహమ్మారి వస్తూ వస్తూనే చాలా కష్టాలు మోసుకొచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. సాంకేతికంగానూ కొత్త కష్టాలను తెచ్చింది. అలాంటి వాటిలో ఒకటే స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌ ఐడీ ఫీచర్‌ పనిచేయకపోవడం.

Published : 28 Jan 2022 23:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి వస్తూ వస్తూనే చాలా కష్టాలు మోసుకొచ్చింది. ఆరోగ్యపరంగానే కాదు.. సాంకేతికంగానూ కొత్త కష్టాలను తెచ్చింది. అలాంటి వాటిలో ఒకటి స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌ ఐడీ ఫీచర్‌ పనిచేయకపోవడం. కొవిడ్‌ పుణ్యమా అని అందరూ మాస్కులు ధరించాల్సి రావడంతో ఈ ఫీచర్‌ నిరుపయోగంగా మారిపోయింది. వేల రూపాయలు పెట్టి ఫోన్‌లో అయినా ఫేస్‌ఐడీ సదుపాయం పనిచేయకపోవడంతో అందరూ మళ్లీ ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌నో, పిన్‌, పాస్‌వర్డ్‌పైనో ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టెక్‌ కష్టానికి ఐఫోన్లు తయారు చేసే యాపిల్‌  సంస్థ పరిష్కార మార్గం చూపింది.

ఈ కంపెనీ త్వరలో తీసుకురాబోయే ఐవోఎస్‌ 15.4 అప్‌డేట్‌లో మాస్క్‌ ఉన్నా ఫోన్‌ అన్‌లాక్‌ అయ్యే సదుపాయాన్ని తీసుకురాబోతోంది. యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందడంతో యాపిల్‌ ఈ మార్పుకు సిద్ధమైంది. కొత్త ఫేస్‌ఐడీ సదుపాయం పొందాలంటే ఐవోఎస్‌ 15.4కు అప్‌గ్రేడ్‌ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఈ అప్‌డేట్‌ వచ్చాక సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌ఐడీ సదుపాయాన్ని మాస్క్‌ ఉన్నా ఓపెన్‌ అయ్యే విధంగా మార్పు చేసుకోవచ్చు. ఈ సెటప్‌ చేయడానికి మాస్కు ధరించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం ఫేస్‌ ఐడీని ఎలా సెట్‌ చేస్తామో అలానే సెట్‌ చేసుకోవచ్చు. అయితే, ఐఫోన్‌ ఎక్స్‌, ఆ తర్వాతి మోడళ్లలో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేయనుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజలు ఆగాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని