Whatsapp: జాగ్రత్త.. వాట్సాప్‌ ‘వాయిస్‌ నోట్‌’ నమ్మారో ఖాతా లూటీ!

హ్యాకర్స్‌ వాట్సాప్‌ ఫీచర్‌ను ఉపయోగించి మరో కొత్త మోసానికి తెరలేపారు. వాట్సాప్‌ సంస్థకు చెందిన వ్యక్తి పంపుతున్నట్లు వాయిస్‌ నోట్ ఈ-మెయిల్‌కు అటాచ్‌ చేసి

Updated : 11 May 2022 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు యూజర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఆయా సంస్థలు యూజర్ డేటా భద్రతకు ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ యూజర్లను ఏమార్చి కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా హ్యాకర్స్‌ వాట్సాప్‌ ఫీచర్‌ను ఉపయోగించి మరో కొత్త మోసానికి తెరలేపారు. వాట్సాప్‌ సంస్థకు చెందిన వ్యక్తి పంపుతున్నట్లు వాయిస్‌ నోట్ ఈ-మెయిల్‌కు అటాచ్‌ చేసి పంపుతున్నారు. ఆ వాయిస్‌ నోట్‌పై క్లిక్ చేయమని సూచిస్తున్నారు. ఒకవేళ యూజర్‌ వాయిస్‌ నోట్‌పై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లోని వాయిస్‌ నోట్‌ మెసేజ్‌ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మన డివైజ్‌లో సైబర్‌ దుండగులకు సంబంధించిన మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. దీనివల్ల మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని సైబర్‌ కేటుగాళ్లు డబ్బును లూటీ చేస్తున్నారు. హెల్త్‌కేర్‌, ఎడ్యూకేషన్‌, రిటైల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా ఈ-మెయిల్‌ వచ్చిందని చెప్పారు. ఇటువంటి మెయిల్స్‌ను నమ్మవద్దని చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దాడుల బారిన పడకుండా ఉండటానికి యూజర్లు డివైజ్‌లో సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటున్నారు. అలాగే ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలకు టూ ఫ్యాక్టర్‌ సెటప్‌ అథెంటికేషన్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీకూ ఇటువంటి అనుమానాస్పద మెయిల్స్‌ వచ్చినట్లయితే ఓపెన్‌ చేయకుండా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని