SMS Transfer: ఫోన్‌ నుంచి ఫోన్‌కు మెసేజ్‌ల బదిలీ.. ఇలా!

ఒక స్మార్ట్‌ఫోన్‌తో సరిపెట్టుకునే కాలమా ఇది. రోజురోజుకీ కొత్త ఫోన్లు, కొత్త ఫీచర్లు ఊరిస్తూనే ఉంటాయి. కొత్త మోడల్‌ ఫోన్లు కొంటూనే ఉంటాం. కొత్త ఫోన్‌ కొన్నాక కాంటాక్టులు,...

Updated : 31 Jul 2022 17:53 IST

ఒక స్మార్ట్‌ఫోన్‌తో సరిపెట్టుకునే కాలమా ఇది. రోజురోజుకీ కొత్త ఫోన్లు, కొత్త ఫీచర్లు ఊరిస్తూనే ఉంటాయి. కొత్త మోడల్‌ ఫోన్లు కొంటూనే ఉంటాం. కొత్త ఫోన్‌ కొన్నాక కాంటాక్టులు, ఫొటోలు, వీడియోల బదిలీ గురించే చాలామంది ఆలోచిస్తుంటారు. పాత ఫోన్‌లోని మెసేజ్‌లను దిగుమతి చేసుకోవటాన్ని మాత్రం మరచిపోతుంటారు. వ్యక్తిగతమో, ఆఫీసు వ్యవహారాలో.. మెసేజ్‌లలో ముఖ్యమైన సమాచారం చాలానే ఉంటుంది. మున్ముందు ఇవి అవసరపడొచ్చు. అందువల్ల ముందే వీటిని కొత్త ఫోన్‌లోకి మార్చుకుంటే ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బ్లూటూత్‌ సాయంతో దీన్ని తేలికగా చేసుకోవచ్చు.

* రెండు ఫోన్లను ఒకదగ్గర పెట్టి రెండింటిలోనూ బ్లూటూత్‌ ఆన్‌ చేయాలి. సరైన పాస్‌వర్డ్‌తో రెండింటినీ పెయిర్‌ చేయాలి. పాత (సోర్స్‌) ఫోన్‌లో మెసేజెస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
* షేర్‌ చేసుకోవాలనుకునే మెసేజ్‌ల మీద కాసేపు అలాగే నొక్కి పట్టి ఎంచుకోవాలి. కావాలనుకుంటే కుడివైపున పైన కనిపించే ఆప్షన్‌తో అన్ని మెసేజ్‌లను ఒకేసారి ఎంచుకోవచ్చు.
* మెసేజ్‌లను ఎంచుకున్నాక షేర్‌ బటన్‌ను నొక్కి, బ్లూటూత్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
* బ్లూటూత్‌తో పెయిర్‌ అయి ఉన్న పరికరాన్ని ఎంచుకోవాలి. అందులో ఇన్‌కమింగ్‌ ఫైల్‌ పాప్‌ అప్‌ అవుతుంది. ‘అగ్రీ’ బటన్‌ నొక్కగానే మెసేజ్‌ల బదిలీ మొదలవుతుంది.


థర్డ్‌ పార్టీ యాప్‌లతోనూ..

బ్లూటూత్‌తో మెసేజ్‌ల బదిలీ తేలికే గానీ ఇది నెమ్మదిగా సాగుతుంది. థర్డ్‌పార్టీ యాప్‌లైతే త్వరగా మెసేజ్‌లను బదిలీ చేస్తాయి. వీటిని ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇవి సోర్స్‌ ఫోన్‌లోని అన్ని మెసేజ్‌లను బ్యాకప్‌ చేసి, ఎస్‌డీ కార్డులో స్టోర్‌ చేస్తాయి. కొత్త ఫోన్‌లోనూ అదే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. మెసేజ్‌లు చేరుకున్నాక ‘రిస్టోర్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. దీనికి బ్యాకప్‌ ఫైల్‌ పాత్‌ను ప్రత్యేకంగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడు క్షణాల్లోనే మెసేజ్‌లు కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతాయి.


జీపేలో కాంటాక్ట్‌ బ్లాక్‌ ఎలా?

గూగుల్‌ పేతో డబ్బును పంపించుకోవటం, తీసుకోవటమే కాదు. మెసేజ్‌లనూ పంపించుకోవటం తెలిసిందే. అయితే కొన్నిసార్లు మనకు తెలియనివారి నుంచీ డబ్బులు పంపమనే రిక్వెస్ట్‌ రావొచ్చు. లేదూ కొందరిని గూగుల్‌ పేతో మనల్ని కాంటాక్ట్‌ చేయకుండా చూసుకోవాలని అనిపించొచ్చు. ఇందుకు దారి లేకపోలేదు. అనవసరమైన మెసేజ్‌లు పెట్టేవారిని గూగుల్‌ పేలో బ్లాక్‌ చేసుకునే అవకాశముంది మరి. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఇలా చేయాలి.

* ఫోన్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
* బ్లాక్‌ చేయాలనుకునేవారి నంబరును సెలెక్ట్‌ చేసుకోవాలి.
* కుడివైపు మూలకు పైన ఉన్న మూడు చుక్కల గుర్తును నొక్కాలి. ‘బ్లాక్‌ దిస్‌ పర్సన్‌’ ఆప్షన్‌ను మీద క్లిక్‌ చేయాలి. అంతే. ఆ కాంటాక్ట్‌ నంబరు నుంచి మెసేజ్‌లు అందటం ఆగిపోతుంది. గమనించాల్సిన విషయమేంటంటే- మనం బ్లాక్‌ చేసినప్పుడు వాళ్లు ఫొటోస్‌, హ్యాంగవుట్స్‌ వంటి ఇతర గూగుల్‌ సేవలనూ వాడుకోలేరు.
* ఐఫోన్‌లోనైతే- గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేసి, తెర అడుగున వేళ్లతో పైకి స్వైప్‌ చేయాలి. దీంతో కాంటాక్ట్‌ నంబర్లు కనిపిస్తాయి. బ్లాక్‌ చేయాలనుకునే నంబరును ఎంచుకొని, మోర్‌ ఆప్షన్‌ ద్వారా బ్లాక్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని