Smart Glasses: టైటాన్‌ నుంచి సరికొత్త కళ్లజోడు.. ధరెంతంటే?

టైటాన్‌ ఐ ప్లస్‌ మరో సరికొత్త బ్లూటూత్‌ కళ్లజోడును భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర ₹..

Updated : 09 Jan 2022 17:20 IST

దిల్లీ: దిగ్గజ వాచ్‌ల తయారీ కంపెనీ టైటాన్‌ అనుబంధ విభాగమైన టైటాన్‌ ఐ ప్లస్‌ (Titan Eye Plus) మరో సరికొత్త కళ్లజోడును భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌తో ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టైటాన్‌ ‘ఐఎక్స్‌ (EyeX)’గా నామకరణం చేసిన ఈ గ్లాసెస్‌లో క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌ను వాడారు. తద్వారా సూక్ష్మ, దూరదృష్టి కలిగిన (sight -/+ 5‌) వినియోగదారులూ ప్రిస్క్రిప్షన్ మేరకు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఫ్రంట్‌ మెటీరియల్‌, టెంపుల్‌ ప్లాస్టిక్‌తో వచ్చే ఈ గ్లాసెస్‌ ధర ఎంత? ప్రత్యేకతలెంటో చూద్దాం.. రండి..

ప్రత్యేకతలివే..

ఈ స్మార్ట్ కళ్లజోడు అద్దాలపై ఎటువంటి డేటా ప్రొజెక్టు కాదు. అయితే, పాటల వాల్యూమ్‌, కాల్స్‌ అటెండ్ చేయడానికి కళ్లజోడు హ్యాండిల్స్‌ వాడాల్సి ఉంటుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. అలాగే బ్లూటూత్‌ సాయంతో నోటిఫికేషన్లు వినొచ్చు. క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ (CVC) ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో స్పష్టమైన వాయిస్‌ను ఇది క్యాప్చర్‌ చేస్తుంది. అదేవిధంగా కాల్స్‌ వాల్యూమ్‌ను ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఒకవేళ మీరు అద్దాలను తప్పుగా పెట్టుకుంటే గుర్తించి హెచ్చరిస్తుంది. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ IP54 రేటింగ్‌, బ్లూటూత్ v5.2 వీటిలో మరిన్ని ప్రత్యేకతలు. 

మరోవైపు ఫిట్‌నెస్‌ను ట్రాక్‌ చేయడానికి ఇన్‌బిల్డ్‌ పెడోమీటర్‌, ఐదు గంటల బ్యాటరీ బ్యాకప్‌తో టైటాన్‌ ఐఎక్స్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ వస్తుంది. ఛార్జింగ్‌ లేనట్లయితే ఎప్పటిలాగే ప్రిస్క్రిప్షన్ కళ్లజోడుగా వాడుకోవచ్చు. కాగా, టైటాన్‌ ఇప్పటికే రెండు స్మార్ట్‌ గ్లాసెస్‌ను విడుదల చేయగా,  ఇది మూడోది. 2019, 2020లో ఫాస్‌ట్రాక్‌ ఆడియో సన్‌ గ్లాసెస్‌ను టైటాన్‌ విడుదల చేసింది. టైటాన్‌ ఐ ప్లస్‌ వెబ్‌సైట్‌లో టైటాన్‌ ఐఎక్స్‌ కళ్లజోడు ఫ్రేమ్‌ ధర రూ.9,999గా ఉంది. సైట్‌, సన్‌, పవర్డ్ లెన్స్‌లను బట్టి ఆయా ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు టైటాన్ ఐ+ రిటైల్ స్టోర్లలోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని