Trucaller Update: ట్రూకాలర్‌.. ఒక్క క్లిక్‌తో టెక్ట్స్‌ నుంచి ఫొటోకు...

ట్రూకాలర్‌ మెసేజింగ్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మరి ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. 

Published : 25 Mar 2022 19:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాల్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్ ట్రూకాలర్ (Truecaller) కొత్తగా మరో నాలుగు ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. అర్జెంట్‌ మెసేజెస్‌ (Urgent Messages), స్మార్ట్‌కార్డ్‌ షేరింగ్ (Smart Card Sharing), రీవ్యాంప్డ్‌ స్మార్ట్ ఎస్సెమ్మెస్‌ (Revamped Smart SMS), ఎడిట్ చాట్ మెసేజ్‌ (Edit Chat Message) పేరుతో ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్‌ యూజర్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంతోపాటు, సమయం ఆదా చేస్తాయని ట్రూకాలర్ చెబుతోంది. 

అర్జెంట్ మెసేజెస్‌

అర్జెంట్‌ మెసేజెస్‌ ఫీచర్‌తో యూజర్‌ పంపే ముఖ్యమైన, సున్నితమైన సమాచారంతో కూడిన మెసేజ్‌లను రిసీవర్ చదివే వరకు ఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. అంటే యూజర్‌ పంపే మెసేజ్‌లు అవతలి వ్యక్తికి రిసీవ్‌ అయిన తర్వాత సదరు యూజర్‌ ఫోన్‌లో వేరే యాప్‌ చూస్తున్నా మెసేజ్‌ చదివే వరకు పాప్‌-అప్‌ విండోలో కనిపిస్తుంది. అర్జెంట్‌ మెసేజ్‌లు వచ్చిన ప్రతిసారీ యూజర్‌కు ప్రత్యేకమైన మెసేజ్‌ టోన్‌ వినిపిస్తుంది. అలానే మెసేజ్‌కు క్విక్‌ రిప్లై ఇచ్చేందుకు ఐ గాట్ యువర్‌ మెసేజ్‌ (I Got Your Message) టెక్ట్స్‌ యూజర్‌కు అందుబాటులో ఉంటుందని ట్రూకాలర్‌ తెలిపింది.

స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌

మన ఫోన్‌కు రోజులో ఎన్నో రకాల మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనవి, అవసరంలేనివి కూడా ఉంటాయి. ఇక్కడే స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌ కీలకంగా పనిచేస్తుంది. ఓటీపీ, టికెట్స్‌, ఆర్థిక లావాదేవీలు వంటి వాటితోపాటు ఇతరుల నుంచి వచ్చే మెసేజ్‌లను ఇన్‌బాక్స్‌లోకి, ప్రమోషనల్, ప్రకటనలకు సంబంధించిన మెసేజ్‌లను స్పామ్‌ ఫోల్డర్‌లోకి ఆటోమేటిగ్గా పంపుతుంది. యూజర్‌ అందించిన సమాచారం ఆధారంగా మెస్సేజ్‌లు వేర్వేరు కేటగిరీలుగా విభజించి ఆయా ఫోల్డర్లలోకి ఫార్వాడ్ చేస్తుంది. 

స్మార్ట్‌ కార్డ్‌ షేరింగ్

ఈ ఫీచర్‌తో మెసేజ్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని ఫొటో రూపంలో షేర్‌ చేయొచ్చు. ఉదాహరణకు ఆర్థిక లావాదేవీ, బిల్‌ పేమెంట్, విమానం లేదా రైలు, బస్సు ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని స్మార్ట్‌ కార్డ్‌ ఫీచర్‌తో అవతలి వారు సులువుగా చదివేందుకు అనువుగా ఉండేలా ఫొటో ఫార్మాట్‌లో పంచుకోవచ్చు. ఈ ఫీచర్‌ కోసం ట్రూకాలర్‌ యాప్‌లో స్మార్ట్‌ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు షేర్ చేయాలనుకుంటున్న మెసేజ్‌ సెలెక్ట్ చేస్తే అందులోని టెక్ట్స్‌ ఫొటోలా షేర్ అవుతుంది. 

ఎడిట్‌ చాట్ మెసేజ్‌

చాట్‌ మెసేజ్‌లను ఎడిట్‌ చేసుకునే ఫీచర్‌ను కూడా ట్రూకాలర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్స్‌ చాట్‌ మెసేజ్‌లను అవతలి వ్యక్తి చూసిన తర్వాత ఎప్పుడైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. యూజర్‌ చాట్ మెసేజ్‌లో మార్పులు చేసిన తర్వాత సదరు మెసేజ్‌ కింద చాట్‌ ఎడిటెడ్‌ (Chat Edited) అనే పదాలు కనిపిస్తాయి.

వీటితోపాటు ట్రూకాలర్ యాప్‌లో కాలింగ్‌, మెసేజ్‌ సెక్షన్‌లో దేనినైనా డీఫాల్ట్‌గా సెట్ చేసుకునేందుకు సులువుగా సదరు ఐకాన్‌లపై లాంగ్ ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు ట్రూకాలర్ యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే మీకు మెసేజ్‌ సెక్షన్‌ కనిపించాలనుకుంటే యాప్‌లోని మెసేజ్‌ ఐకాన్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. ఒకవేళ కాలింగ్‌ సెక్షన్‌ డీఫాల్ట్‌గా కావాలనుకుంటే కాలింగ్‌ సెక్షన్‌పై లాంగ్ ప్రెస్‌ చేయాలి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని