Open Doors: ట్రూకాలర్ కొత్త యాప్‌.. ఇదో ఆన్‌లైన్‌ రచ్చబండ

కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ కొత్త యాప్‌ను యూజర్లకు పరిచయ చేసింది. దీని ద్వారా యూజర్లు వాయిస్‌ సంభాషణలు జరపవచ్చు... 

Published : 18 Jul 2022 16:17 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: చర్చావేదిక అనగానే కొంత మంది వ్యక్తులు ఒకచోట చేరి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల గురించి చర్చించుకుంటూ, తమ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ మారింది. భౌతికంగా ఒక చోట కూర్చునే చర్చావేదికలు పోయి ఆన్‌లైన్‌ చర్చావేదికలు ప్రారంభమయ్యాయి. అలా వచ్చిన తొలి యాప్‌ క్లబ్‌హౌస్‌ (Clubhouse). తర్వాత ట్విటర్‌ స్పేసెస్‌ (Twitter Spaces)ను పరిచయం చేయగా ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లు కూడా ఇదే తరహా ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో ట్రూకాలర్‌ (Truecaller) కూడా చేరిపోయింది. కొత్తగా ఓపెన్ డోర్స్‌ (Open Doors) పేరుతో వాయిస్‌ ఆధారిత యాప్‌ను పరిచయం చేసింది. ఇందులో యూజర్లు తమ స్నేహితులు, పరిచయస్తులతో వాయిస్‌ సంభాషణలు జరపవచ్చు. 

ఓపెన్ డోర్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేసేందుకు అనుమతించాల్సి ఉంటుంది. దాంతో మీ కాంటాక్ట్స్‌ జాబితాలోని వారు ఓపెన్ డోర్స్‌ ద్వారా చర్చలో పాల్గొంటుంటే మీ ఫోన్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది. ఒకవేళ మీరు కూడా చర్చలో భాగస్వాములు కావాలనుకుంటే నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి సంభాషణలు జరపడంతోపాటు, నచ్చిన అంశాలపై చర్చించుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్‌ల నుంచి యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంగ్లం, హిందీ, స్పానిష్‌, లాటిన్‌, ఫ్రెంచ్‌ భాషల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని భాషలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యాప్‌ ద్వారా జరిపే సంభాషణలు ఎక్కడా స్టోర్‌ కావని ట్రూకాలర్‌ తెలిపింది. సంభాషణలు జరిపే సమయంలో యూజర్ల ఫోన్ నంబర్లు ఇతరులు చూడలేరు. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని