Updated : 15 May 2022 12:11 IST

Android Launchers: పాత మెనూ, హోం స్క్రీన్‌ బోర్ కొట్టేశాయా..? వీటితో మొబైల్ లుక్‌ మార్చేయండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ఫేస్‌ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలా మంది నుంచి వినిపించే సమాధానం.. వాల్‌పేపర్స్‌ లేదా హోమ్‌ స్క్రీన్‌ థీమ్‌ మార్చుకోమని సూచిస్తుంటారు. అయితే ఫోన్‌ పనిచేసేందుకు ఉపయోగించే ఓఎస్‌ మాత్రం పాతదే ఉంటుంది. దీంతో ఎన్నిసార్లు వాల్‌పేపర్లు, థీమ్‌లు మార్చినా కొత్త అనుభూతి రాదు. అయితే ఫోన్‌లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్‌, ఫోన్‌ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు లాంచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి యూజర్లకు ఫోన్‌ వినియోగంలో పూర్తిస్థాయిలో కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే చాలా మంది యూజర్లు ఫోన్‌లో బిల్ట్‌-ఇన్‌గా ఉండే లాంచర్లనే ఉపయోగిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్‌ వినియోగంలో కొత్తదనం కోరుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు. ప్లేస్టోర్‌లో ఎన్నో రకాల లాంచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిలో ది బెస్ట్ ఏడింటి వివరాలపై ఓ లుక్కేద్దామా..


రేషియో లాంచర్‌ (Ratio Launcher)

డిజిటల్ డిస్ట్రాక్షన్‌ను తగ్గించి ఫోన్‌ను అవసరమైనమేర వినియోగించుకునేందుకు ఈ లాంచర్ సాయపడుతుంది. థీమ్‌ మొత్తం గ్రే అండ్‌ బ్లాక్ రంగులో ఉంటుంది. ఇందులో యాప్‌లు అన్ని అల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కనిపిస్తాయి. క్రియేటివిటీ, లైఫ్‌స్టైల్‌, మెసేజింగ్‌, ప్రొడక్టవిటీ, సోషల్‌ కేటగిరీలు యాప్‌లను విభజించుకోవచ్చు. ఇందులో ఉచిత వెర్షన్‌తోపాటు, సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌ కూడా ఉంది. 


నోవా లాంచర్‌ (Nova Launcher)

ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువ మంది నోవా లాంచర్‌ను ఉపయోగిస్తుంటారు. ఫోన్‌ కస్టమైజేషన్‌కు బెస్ట్ లాంచర్‌గా దీన్ని అభివర్ణిస్తారు. ఇందులో ఐకాన్‌ ప్యాక్‌, డార్క్‌ మోడ్‌, థీమ్‌ చేంజ్‌, హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌‌, విడ్జెట్స్‌ వంటివి సులువుగా చేయొచ్చు.ఇందులో బ్యాకప్‌ అండ్‌ రీస్టోర్‌ ఫీచర్‌ కూడా ఉంది. దీంతో మనకు నచ్చినట్లుగా ఫోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఉచిత, సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్లలో యూజర్లకు అందుబాటులో ఉంది. 


అపెక్స్‌ లాంచర్‌ (Apex Launcher)

పేరు తగ్గట్లుగానే అన్ని రకాల ఫీచర్లు, పనితీరు ఇందులో ఉత్తమంగా ఉంటాయి. హోమ్‌ స్క్రీన్‌ విడ్జెట్‌ సైజ్‌ నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఇన్ఫినైట్ స్క్రోలింగ్, ట్రాన్సిషన్ యానిమేషన్స్‌, ఫోల్డర్‌ స్టైలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌కు కొత్త లుక్‌ను ఇస్తాయి. యూజర్లు ఉచిత వెర్షన్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలనుకునే యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌ను ప్రయత్నించవచ్చు. 


నయాగారా లాంచర్‌ (Niagara Launcher)

ఇది పూర్తిగా యాడ్‌-ఫ్రీ లాంచర్‌. సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌తోపాటు, ఉచిత వెర్షన్‌లో కూడా ఎలాంటి ప్రకటనలు ఉండవు. డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ఈ లాంచర్‌ను ప్రయత్నించవచ్చు. నోటిఫికేషన్స్, యాప్‌లను ముందు వరుసలో కనిపించేలా ఇందులో ప్రత్యేక ఫీచర్‌ ఇస్తున్నారు. ఇందులో నోటిఫికేషన్స్‌ హోమ్‌ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. ప్రాధ్యానంలేని నోటిఫికేషన్స్‌ను ఆటోమేటిగ్గా ఫిల్టర్ చేయడంతోపాటు, యూజర్‌కు నచ్చిన యాప్స్‌ను ప్రాధాన్యక్రమంలో చూపిస్తుంది. 


మైక్రోసాఫ్ట్ లాంచర్‌ (Microsoft Launcher)

గతంలో యారో లాంచర్‌ (Arrow Launcher)గా పాపులర్‌ అయిన ఈ లాంచర్‌ పేరును మైక్రోసాఫ్ట్ లాంచర్‌గా పేరు మార్చారు. దీని సాయంతో యూజర్లు ఫోన్‌లోని ఫొటోలను సులువుగా, వేగంగా డెస్క్‌టాప్‌లో చూడొచ్చు. అలానే వెబ్‌ లింక్‌లను కూడా మొబైల్‌ నుంచి ఎడ్జ్‌ బ్రౌజర్‌ ద్వారా ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో ఓపెన్ చేసుకునే సదుపాయం ఉంది. యూనివర్సల్‌ సెర్చ్ బార్‌, కస్టమ్‌ థీమ్స్‌, గెస్చర్‌ కంట్రోల్స్‌ వంటివి ఈ లాంచర్‌ ద్వారా ఫోన్‌లోనే ఉపయోగించవచ్చు. లాండ్‌స్కేప్‌ మోడ్‌, డార్క్‌ థీమ్‌, పర్సనలైజ్డ్‌ న్యూస్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 


పోకో లాంచర్‌ (Poco Launcher) 

ఇతర కంపెనీల ఫోన్లలో షావోమి, రెడ్‌మీ, పొకో ఫోన్లను ఉపయోగించిన అనుభూతి పొందాలనుకునే యూజర్లు ఈ లాంచర్‌ను ప్రయత్నించవచ్చు. ఇందులో యాప్‌లను కమ్యూనికేషన్‌, ఫొటోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి కేటగిరీలుగా విభజిస్తుంది. కస్టమైజ్డ్‌ లేఅవుట్, ట్రాన్సిషన్‌ ఎఫెక్ట్‌, ఐకాన్ ప్యాక్‌ సపోర్ట్, నోటిఫికేషన్‌ బ్యాడ్జెస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇది ఆండ్రాయిడ్ 10 ఆపై వెర్షన్‌ ఓఎస్‌తో మాత్రమే పనిచేస్తుంది. 


యాక్షన్‌ లాంచర్‌ (Action Launcher)

పిక్సెల్‌ ఫోన్‌ ఉపయోగించాలనుకునేవారు ఈ లాంచర్‌ను వాడి చూడొచ్చు. పిక్సెల్‌ ఫోన్‌లో ఉన్నట్లుగానే ఈ లాంచర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన ఫోన్లలో అడాప్టివ్‌ యాప్‌ బార్‌, పిల్-షేప్‌ గూగుల్ సెర్చ్‌ బార్‌, ఒరియో-స్టైల్‌ యాప్‌ షార్ట్‌కట్స్‌ ఉంటాయి. కవర్స్‌, షట్టర్స్‌ వంటి స్పెషల్ గెస్చర్స్‌ కూడా ఉన్నాయి.  

ఇవే కాకుండా మరికొన్ని లాంచర్లు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌కు పోటీగా వస్తోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న నథింగ్‌ కంపెనీ కూడా ఒక కొత్త లాంచర్‌ను విడుదల చేసింది. నథింగ్ లాంచర్‌ పేరుతో వస్తోన్న ఇది ఆండ్రాయిడ్ 11 ఆపై వెర్షన్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts