Twitter Circle: ట్వీట్ చేస్తే అది మన సర్కిల్‌లోనే.. యూజర్లకు ట్విటర్‌ కొత్త ఫీచర్‌

ట్విటర్‌లో గోప్యతకు ప్రాధాన్యం కల్పిస్తూ సర్కిల్ ఫీచర్‌ను పరిచయం చేశారు. మరి ఈ ట్విటర్‌ సర్కిల్‌ ఎలా పనిచేస్తుంది?ఎలాంటి ఫీచర్లున్నాయి?ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. 

Published : 31 May 2022 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌లో గోప్యతకు ప్రాధాన్యం కల్పిస్తూ సర్కిల్ ఫీచర్‌ను పరిచయం చేశారు. దీని ద్వారా యూజర్లు తమ ట్వీట్లను తమకు నచ్చిన వారితో మాత్రమే పంచుకోవచ్చు. గతంలో యూజర్లు చేసే ట్వీట్లు ఫాలోవర్స్‌ ఎవరైనా చూడగలిగేవారు. ఇప్పటి వరకు పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విటర్‌ తెలిపింది. మరి ఈ ట్విటర్‌ సర్కిల్‌ ఎలా పనిచేస్తుంది?ఎలాంటి ఫీచర్లున్నాయి?ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. 

ఎందుకీ సర్కిల్‌‌?

యూజర్లు తమ ట్వీట్లను ఇతరులు చూడకుండా.. స్నేహితులు లేదా తమకు నచ్చిన వారు మాత్రమే చూసేలా ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. దీంతో యూజర్లు తాము చేసే ట్వీట్లు సన్నిహితులతోపాటు బయటివ్యక్తులు చూస్తారని సంకోచించాల్సిన అవసరంలేదు. దీంతో స్నేహితులు, పరిచయస్తులు, వ్యక్తిగతంగా చేసే ట్వీట్ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు సృష్టించే వారి సంఖ్య తగ్గుతోందని ట్విటర్‌ భావిస్తోంది. అలానే ట్విటర్‌లో గేలిచేసే వారి బెడద ఉండదు. ఈ ఫీచర్‌ ద్వారా ట్రోలర్ల నుంచి  చాలావరకు తప్పించుకోవచ్చు.

సర్కిల్‌ ఎలా చేయాలి?

ముందుగా మీ ట్వీట్లు ఎవరెవరు చూడాలనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేయాలి. ట్విటర్లో మిమ్మల్ని ఫాలో కానీ వ్యక్తులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ జాబితా 150కి మించకూడదు. అలా మీరు ఎంపిక చేసిన తర్వాత ట్వీట్‌ చేసేప్పుడు మీ ట్వీట్‌ అందరూ చూడాలా? లేక సర్కిల్‌లోని వారు మాత్రమే చూడాలా అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే మీ ట్వీట్‌ వారికి మాత్రమే కనిపిస్తుంది. ఈ సర్కిల్‌ జాబితాను మీరు ఎప్పుడైనా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు చేసే ట్వీట్‌ కేవలం మీ స్నేహితులు మాత్రమే చూడాలనుకుంటే.. ట్వీట్ చేసేప్పుడు సర్కిల్‌ జాబితా నుంచి ఇతరులను తొలగించవచ్చు. అలా మీరు ట్వీట్ చేసే ముందు మీ సర్కిల్స్‌ జాబితాలో మార్పులు చేసుకోవచ్చు. 

రీట్వీట్‌ చేయొచ్చా?

ట్విటర్‌ సర్కిల్స్‌లో ఉన్న వ్యక్తులకు కనిపించే ట్వీట్లను రీట్వీట్ చేయలేరు. ట్వీట్‌ను స్క్రీన్‌షాట్‌, డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అలానే ఇతర యూజర్లను సర్కిల్స్‌లో చేర్చినట్లు కూడా ట్విటర్‌ ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాకుంటే యూజర్లు ట్విటర్‌ యాప్‌ను అప్‌డేట్ చేసుకోమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని