Web 3: మస్క్‌ ట్వీట్‌కు డోర్సే రిప్లయ్‌.. మళ్లీ చర్చకు వెబ్‌3 !

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌కు ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సే రిప్లై ఇచ్చారు. అదికాస్తా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలోనే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందనే సంకేతాలనిచ్చింది. 

Published : 24 Dec 2021 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌.. ఆయన చేసే ఒక్కో ట్వీట్‌ ఒక్కో సంచలనం. బిట్‌కాయిన్‌ విషయంలో గానీ, ఇతర క్రిప్టో కరెన్సీల గురించి ఆయన చేసిన ట్వీట్లు వాటి గతినే మార్చేశాయి. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ టెక్ ప్రపంచంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రానుందనే సంకేతాలిచ్చింది. అయితే మస్క్ ట్వీట్‌కు ట్విటర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సే రిప్లయ్‌ ఇవ్వడంతో ఈ సాంకేతికతపై టెక్‌ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. తొలుత మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో ‘ఎవరైనా వెబ్‌3ని చూశారా? నేను దీన్ని కనుక్కోలేకపోతున్నా’ అని ట్వీట్ చేశారు. దీనికి జాక్ డోర్సే ‘అది ఏ అండ్‌ జడ్‌ మధ్యనే ఎక్కడో ఉంటుంది’ అని బదులిచ్చారు. దీంతో వెబ్‌3 టెక్నాలజీపై ఈ దిగ్గజాలు దృష్టి సారించినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ వెబ్‌ 3? దీని గురించి ఇప్పుడే ఎందుకింత చర్చ?

ఏమిటీ వెబ్‌ 3

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ (WWW)కు మూడో తరం టెక్నాలజీనే.. వెబ్‌3. ఇప్పటి వరకు మనం రెండు రకాల వెబ్‌ వెర్షన్‌లను మాత్రమే ఉపయోగించాం. వెబ్‌ 1.0.. 1991-2004ల మధ్యకాలంలో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను బ్రౌజర్లు, వెబ్‌సైట్ల కోసం వినియోగించాం. తర్వాత వెబ్‌ 2.0 అందుబాటులోకి వచ్చింది. దీంతో కంపెనీలు యాప్‌లు, సోషల్‌ మీడియా, వికీపీడియా వంటి వాటిని అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. అయితే రెండో తరం వెబ్‌ 2.0పై మెటా, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల ఆధిపత్యమే ఎక్కువ. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్రకటనలు, యూజర్‌ డేటా సేకరణ వంటి వాటి ద్వారా కంపెనీలు భారీగా ఆదాయం పొందుతున్నాయి. 

అయితే, ఈ వెబ్‌ 3పై కంపెనీల నియంత్రణ ఏమాత్రం ఉండదట. ఒక కమ్యూనిటీగా ఏర్పడిన యూజర్స్‌ మాత్రమే దీన్ని నియంత్రించగలరు. ఈ టెక్నాలజీ ఆధారంగా డెవలప్‌ చేసిన యాప్‌లు, వెబ్‌సైట్లపై ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం సాధ్యం కాదు. ఇది బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వెబ్‌ 3ని క్రిప్టోకరెన్సీ ఇంటర్నెట్‌గా కూడా పలువురు టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో నాన్‌ ఫంగిల్‌ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ), డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ (డీఈఎఫ్ఐ), డీసెంట్రలైజ్డ్‌ అటానమస్‌ ఆర్గనైజేషన్స్ (డీఏఓ), క్రిప్టోకరెన్సీ వంటి కేటగిరీలు ఉంటాయని చెబుతున్నారు. 2014లోనే ఎథిరియమ్‌ సహ వ్యవస్థాపకుడు గవిన్‌ వుడ్ దీని గురించి ప్రస్తావించినప్పటికీ.. ఈ ఏడాది క్రిప్టోకరెన్సీ యూజర్స్‌, బిగ్‌ టెక్నాలజీ కంపెనీలు, పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.

డోర్సే ట్వీట్‌కు కారణం ఇదేనా?

ఇప్పుడు మస్క్‌- డోర్సే ట్వీట్ల విషయానికొద్దాం. మస్క్‌ ట్వీట్‌కు డోర్సే రిప్లయ్‌ ఇస్తూ ‘ఏ నుంచి జడ్‌’ మధ్య ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ఇది ఏ16జెడ్ వ్యవస్థాపకులు మార్క్‌ ఆండర్సన్‌, బెన్‌ హోరోవిట్జ్‌లను ఉద్దేశించే డోర్సే ట్వీట్‌ చేశాడని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ16జెడ్ కంపెనీ ద్వారా వెబ్‌ 3ని నియంత్రించాలన్న ఆలోచనలో ఆండర్సన్‌, హోరోవిట్జ్‌లు ఉన్నారట. అందుకనుగుణంగానే హోరోవిట్జ్‌ సుమారు 3 బిలియన్‌ డాలర్స్ క్రిప్టోకరెన్సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మస్క్‌ ట్వీట్‌కు రిప్లయ్‌ ఇవ్వడానికి ముందే డోర్సే.. ఆండర్సన్‌, హోరోవిట్జ్‌లపై ట్విటర్‌ వేదికగా పరోక్షంగా విమర్శలు చేశాడు. ‘వెంచర్ క్యాపిటలిస్టులు, వారి లిమిటెడ్ పార్టనర్లతో కలిసి కంపెనీలను సొంతం చేసుకున్నట్లు మీరు వెబ్‌ 3ని సొంతం చేసుకోలేరు. ఇది ఎప్పటికీ ఒకరికి చెందినది కాదు. ఎప్పటికీ దీన్ని నియంత్రించలేరు’ అంటూ ఆండర్సన్‌, హోరోవిట్జ్‌లను ఉద్దేశిస్తూ డోర్సే ట్వీట్‌ చేశారు. ‘ఇక్కడ వెంచర్ క్యాపిటలిస్టులే సమస్య’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మస్క్ ట్వీట్ చేయడంతో వెబ్‌ 3పై మరోసారి చర్చ మొదలైంది. ఒకవేళ భవిష్యత్‌లో ఈ బ్లాక్‌చైన్ ఆధారిత వెబ్‌ 3 అందుబాటులోకి వస్తే యూజర్స్‌కు మరింత మెరుగైన ఇంటర్నెట్ ఆధారిత టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని