Twitter Communities: ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌కు పోటీగా ట్విటర్‌ కమ్యూనిటీస్‌

Twitter Communities: ట్విటర్‌ కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి పరిచయం చేయనుంది.  ఫేస్‌బుక్ గ్రూప్స్ తరహాలోనే ట్విటర్‌ కమ్యూనిటీస్‌ పనిచేస్తుంది. 

Published : 09 Sep 2021 23:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర యాప్‌లకు పోటీని తట్టుకోవడంతో పాటు కాలానుగుణంగా యూజర్స్‌కి కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌. ఇటీవల డైరెక్ట్ మెసేజ్‌ ఫీచర్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కమ్యూనిటీస్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ తన బ్లాగ్‌లో వెల్లడించింది. ఫేస్‌బుక్‌లోని గ్రూప్స్‌ తరహాలోనే ట్విటర్‌ కమ్యూనిటీస్ పనిచేస్తుంది. వీటి ద్వారా యూజర్స్ ఒకే అభిప్రాయం, ఇష్టాలు కలిగిన వ్యక్తులను సులువుగా కలుసుకోవచ్చు. ఈ కమ్యూనిటీస్‌ ట్విటర్‌లో యూజర్స్ అందరికీ కనిపిస్తాయి. వీటిలో చేరాలంటే మాత్రం కమ్యూనిటీ రూపొందించిన వ్యక్తి లేదా అందులోని సభ్యులు కొత్త వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది. 

ట్విటర్‌ తీసుకొస్తున్న కమ్యూనిటీస్‌లో యూజర్స్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే సమస్యాత్మకమైన కమ్యూనిటీలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో గ్రూప్స్‌లో కొన్ని రాజకీయ, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అలాంటి సమస్యలు ట్విటర్‌ కమ్యూనిటీస్‌లో రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్విటర్ తెలిపింది. అలానే కమ్యూనిటీని రూపొందించిన వ్యక్తి తనకు కావాల్సినట్లుగా గ్రూప్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కమ్యూనిటీస్‌ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవలే ట్విటర్‌ సూపర్ ఫాలోస్‌, లైవ్‌ ఛాట్‌ రూమ్స్‌ వంటి కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి పరిచయం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని