Twitter: ట్వీట్‌ ఎడిట్‌కు లిమిట్‌.. ట్విటర్‌లో వాట్సాప్‌ ఐకాన్‌!

ట్విటర్‌ యూజర్లకు త్వరలో రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. మరి, ఆ ఫీచర్లేంటి, ఎలా పనిచేయస్తాయో చూద్దాం...

Published : 13 Sep 2022 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోబ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ త్వరలో ట్వీట్‌ ఎడిట్‌ బటన్‌ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. యూజర్‌ ట్వీట్‌ చేసిన 30 నిమిషాలలోపు అందులో మార్పులు చేయొచ్చు. తాజాగా, ఈ ఫీచర్‌కు సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ట్వీట్‌ ఎడిట్‌ ఆప్షన్‌పై ట్విటర్‌ పరిమితి విధించనుంది. ఈ మేరకు యూజర్లు ట్వీట్‌ను ఐదుసార్లు మాత్రమే ఎడిట్‌ చేయగలరు. అది 30 నిమిషాల వ్యవధిలోనే. దీనితోపాటు ట్వీట్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ కూడా యూజర్లకు పరిచయం కానుంది. ట్వీట్ చేసిన 30 సెకన్లలోపు యూజర్‌ ట్వీట్‌ను క్యాన్సిల్ చేయొచ్చు. ముందుగా ఈ ఫీచర్లు న్యూజిలాండ్‌లోని ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని బ్లూ సబ్‌స్క్రైబర్లకు, ఆపై మిగిలిన రీజియన్లలోని యూజర్లకు పరిచయం చేయనున్నట్లు ట్విటర్‌ తెలిపింది.  

మెసేజెస్‌లో కొత్త అప్‌డేట్

ట్విటర్‌ మెసేజింగ్‌ సెక్షన్‌లో కూడా కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై యూజర్ల మధ్య జరిగే కన్వర్జేషన్‌ (సంభాషణలు)ను పిన్‌ చేసుకోవచ్చు. యూజర్‌ మెసేజ్‌ సెక్షన్‌ ఓపెన్ చేసిన వెంటనే పిన్‌ చేసుకున్న కన్వర్జేషన్‌ మొదట కనిపిస్తుంది. ఐఫోన్ యూజర్లు ట్విటర్ యాప్‌ ఓపెన్‌ చేసి మెసేజ్‌ సెక్షన్‌లోకి వెళ్లి పిన్ చేయాలనుకుంటున్న కన్వర్జేషన్‌ను ఎడమ నుంచి కుడికి స్వైప్‌ చేస్తే పిన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు కన్వర్జేషన్‌ మొదట కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు కన్వర్జేషన్‌పై కొన్ని సెకన్లపాటు టచ్‌ చేస్తే పాప్‌-అప్‌ విండో ప్రత్యక్షమవుతుంది. అందులో పిన్‌ కన్వర్జేషన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

ట్విటర్‌లో వాట్సాప్‌..

ట్విటర్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. షేర్‌ బటన్‌ను వాట్సాప్‌ ఐకాన్‌తో రీప్లేస్‌ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బీటా యూజర్లకు షేర్‌ బటన్‌ స్థానంలో వాట్సాప్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. ‘‘మీలో కొంతమందికి వాట్సాప్‌ షేర్ ఐకాన్‌ కనిపిస్తుంటే,  దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలియజేయండి’’ అని ట్విటర్‌ ఇండియా ట్వీట్ చేసింది. కొంతకాలంగా ట్విటర్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం షేర్‌ ఐకాన్‌ బాణం గుర్తుతో ఉంటుంది. దాని స్థానంలో వాట్సాప్‌ ఐకాన్‌ రానుంది. దీనిపై క్లిక్ చేసి ఎప్పటిలానే యూజర్‌ తనకు నచ్చిన ట్వీట్‌ లింక్‌ను కాపీ లేదా మెసేజ్‌ చేయొచ్చు. మరోవైపు ట్విటర్‌లో వాట్సాప్‌ ఐకాన్‌పై క్లిక్ చేసి ట్వీట్‌లను డైరెక్టుగా వాట్సాప్‌లో షేర్‌ చేయొచ్చని నెట్టింట్లో యూజర్లు చర్చించుకుంటున్నారు. దీని గురించి స్పష్టత రావాలంటే మాత్రం ట్విటర్‌ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని