Twitter Spaces: ట్విటర్‌ ‘రచ్చబండ’లో మార్పులు.. ఎలా ఉంటుందో తెలుసా?

ట్విటర్‌ యూజర్ల కోసం ఇటీవల ప్రవేశపెట్టిన ‘స్పేసెస్‌’(Spaces)లో మార్పులు చేస్తూ కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Updated : 09 May 2022 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ (Twitter) కొత్త ఫీచర్లపై దృష్టి సారించింది. ఇప్పటికే ‘ఎడిట్‌’(Edit) బటన్, సర్కిల్‌ (Circle) ఫీచర్లను పరీక్షిస్తున్నట్లు వెల్లడించగా.. తాజాగా యూజర్ల కోసం ప్రవేశపెట్టిన ‘స్పేసెస్‌’(Spaces)లో మార్పులు చేస్తూ కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇది ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని,  త్వరలోనే యూజర్ల ముందుకు తీసుకువస్తామని వెల్లడించింది. దీంతో ఇతర ట్వీట్ల మాదిరిగానే స్పేస్‌లోనూ పబ్లిక్‌గా ట్వీట్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్వీట్లను షేర్‌, రీ ట్వీట్‌ చేసుకునే సదుపాయం కూడా ఉండనుంది.


‘‘చాట్‌ రూమ్‌ను తెరవగానే ఆటోమెటిక్‌గా స్పేస్‌ కార్డ్‌ ట్వీట్‌ రూపంగా వెళ్తుంది. ఆ తర్వాత లిజనర్స్‌ అందరూ స్పేస్‌ నుంచే నేరుగా ట్వీట్‌కు రిప్లయ్‌, ఎంగేజ్‌, షేర్‌ వంటివి చేసుకోవచ్చు. దీంతో యూజర్ల సంభాషణ సులువు అవుతుందని భావిస్తున్నాం. త్వరలో ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది’’ అని ట్విటర్‌ అధికారిక హ్యాండిల్‌ స్పేసెస్‌ పేర్కొంది. 

సాధారణ ట్వీట్ల మాదిరిగానే స్పేసెస్‌లోనూ వరుస ట్వీట్లు (Tweet Threads) చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ థ్రెడ్‌ను కొత్త చాట్‌ బటన్‌ (Thread button) ద్వారా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ బటన్‌ రియాక్షన్‌ బటన్‌కు కుడివైపుగా ఉంటుంది. చాట్‌ రూమ్‌లో డిస్కస్‌ చేసిన టాపిక్‌ గురించి చాట్‌ చేసుకోవడంతోపాటు డిస్కషన్‌లో ఎంత మంది ఉన్నారో అనే సంఖ్యను చాట్‌ రూమ్‌ క్రియేట్‌ చేసిన వారికి చూపిస్తోంది.

స్పేసెస్‌ ఎలా క్రియేట్‌ చేయాలి?

యాప్‌లో ట్వీట్‌ కంపోజ్‌/ ప్లస్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే... స్పేసెస్‌ బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యువర్ స్పేసెస్‌ అని పాప్‌-అప్‌ వస్తుంది. అందులో ఎవరితో డిస్కషన్‌కు పెట్టాలనుకుంటున్నారో వారి పేరు నమోదు చేసి స్పేసెస్‌ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్‌ చేసిన స్పేస్‌ను అక్కడి నుంచే నేరుగా ట్వీట్‌ చేయొచ్చు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్పేస్‌లు ట్విటర్‌ ఫ్లీట్స్‌లో కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు జాయిన్‌ అవ్వొచ్చు.

కాగా.. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ క్లబ్‌హౌస్, ఫేస్‌బుక్‌ లైవ్ ఆడియో చాట్‌రూమ్‌లాగే ‘స్పేసెస్‌’ పనిచేస్తోంది. దీన్ని 2020 చివరిలో ప్రారంభించింది. మొదట్లో 600 కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్న ఖాతాదారులు మాత్రమే స్పేసెస్‌ను హోస్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది. తర్వాత ఫాలోవర్స్‌ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పబ్లిక్, ప్రైవేట్ ఆడియో చాట్ రూమ్‌లను క్రియేట్‌ చేసుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. అలాగే ఒక్క చాట్‌రూమ్‌లో ఒకేసారి 11మంది స్పీకర్లు పాల్గొనేలా మార్పులు తెచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని