Twitter: ట్విటర్‌ కొత్త ఫీచర్‌.. ఒకే ట్వీట్‌ ఇద్దరు చేయొచ్చు!

ట్విటర్‌ సంస్థ కోట్వీట్‌ అనే కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో ఒక ట్వీట్‌ను ఇద్దరు యూజర్లు ట్వీట్‌ చేయొచ్చు. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? ఎప్పటి నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుందనేది తెలుసుకుందాం... 

Updated : 08 Jul 2022 22:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకే అభిప్రాయం కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేయడం సర్వసాధారణం. ఒక పుస్తకానికి ఇద్దరు రచయితలు, ఒక సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేయడం చాలా సందర్భాల్లో చూశాం. సరిగ్గా ఇదే ఆలోచనతో ట్విటర్‌ (Twitter) సంస్థ కోట్వీట్‌ (CoTweet) అనే కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో ఒక ట్వీట్‌ను ఇద్దరు యూజర్లు ట్వీట్‌ చేయొచ్చు. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది? ఎప్పటి నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుందనేది తెలుసుకుందాం. 

కోట్వీట్‌ అంటే ఏంటి?

సాధారణంగా మనం చేసే ట్వీట్‌లు టైమ్‌లైన్‌లో కనిపిస్తాయి. వాటిని ఫాలోవర్స్‌ ఎవరైనా రీట్వీట్ చేస్తే ఇతరులకు కనిపిస్తాయి. కొత్తగా వస్తున్న కోట్వీట్‌ ఫీచర్‌తో ట్వీట్‌ చేసే వ్యక్తి (Author)తో పాటు, సదరు ట్వీట్‌కు కో-ఆథర్‌ (Co-author)గా వ్యవహరించే వ్యక్తి టైమ్‌లైన్‌పై కూడా కనిపిస్తుంది. అంటే ఒకే ట్వీట్‌ను ఇద్దరు వ్యక్తులు కలిసి చేయొచ్చు. ఈ ఫీచర్‌లో ముందుగా ట్వీట్ చేసే వ్యక్తి టెక్ట్స్‌ టైప్‌ చేసిన తర్వాత కోట్వీటింగ్ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసి ఎవరినైతే కో-ఆథర్‌గా కోరుకుంటున్నారో వారికి డైరెక్ట్ మెసేజ్‌ చేస్తే ఇన్విటేషన్‌ వెళుతుంది. కో-ఆథర్‌ దాన్ని ఓకే చేసిన తర్వాత ట్వీట్‌ చేస్తే ఇద్దరి టైమ్‌లైన్‌పై ట్వీట్‌ కనిపిస్తుంది. కో-ఆథర్‌ తప్పనిసరిగా ట్వీట్ చేసే వ్యక్తిని ఫాలో అవుతుండాలి. ఒకసారి ఒక వ్యక్తితో కలిసి మాత్రమే కోట్వీట్ చేయగలరు.

కోట్వీట్‌ ఫీచర్లు

కోట్వీట్‌లకు సాధారణ ట్వీట్‌ల మాదిరే రీట్వీట్, కోట్‌ ట్వీట్‌, కామెంట్‌ ఆప్షన్లు ఉంటాయి. వీటిని ట్వీట్ చేసిన వ్యక్తి మాత్రమే పిన్‌టాప్‌ చేయగలరు. కో-ఆథర్‌కు ఈ అవకాశం ఉండదు. ఒకవేళ మీరు కో-ఆథర్‌గా వ్యవహరించకూడదనుకంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయకుండా మీ ఖాతాలో కోట్వీటింగ్‌ ఆప్షన్‌ను డిసేబుల్ చేయొచ్చు. తర్వాత ఎప్పుడైనా ఎనేబుల్‌ చేసుకోవచ్చు. వీటిని ట్విటర్‌ సర్కిల్స్‌, కమ్యూనిటీస్‌లో షేర్‌ చేయలేరు. ట్విటర్‌ స్పేసెస్‌లో మాత్రం పిన్‌టుటాప్‌ పెట్టుకోవచ్చు. అలానే ఈ ఫీచర్‌ వీడియో, ఫొటోలతోపాటు ఇతరత్రా మీడియా ఫైల్స్‌కు కూడా వర్తిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమెరికా, కెనడా, కొరియా దేశాల్లో పరీక్షిస్తున్నారు. త్వరలో ప్రపంచంలోని అన్ని రీజియన్లలో అందుబాటులోకి తీసుకువస్తామని ట్విటర్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని