Twitter: ఒకేసారి మరింత రాసేలా.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న ట్విటర్‌!

వినియోగదారుల కోసం ట్విటర్‌(Twitter) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది! యూజర్లు చెప్పాలనుకున్న విషయాన్ని ఒక్కో ట్వీట్‌(Tweet)కు 280 అక్షరాల చొప్పున పరిమితం చేయకుండా...

Published : 23 Jun 2022 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల కోసం ట్విటర్‌(Twitter) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది! యూజర్లు చెప్పాలనుకున్న విషయాన్ని ఒక్కో ట్వీట్‌ (Tweet)కు 280 అక్షరాలు చొప్పున పరిమితం చేయకుండా.. బ్లాగ్‌ రూపంలో అంతా ఒకేదాంట్లో రాసేందుకు వీలు కల్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ‘నోట్స్‌(Notes)’ అనే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇందులో గరిష్ఠంగా 2500 అక్షరాల వరకు రాసుకునే అవకాశం ఉంది. బ్లాగ్‌ మాదిరిగా ఇందులో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు, ఎంబెడెడ్‌ ట్వీట్‌లను అటాచ్‌ చేయొచ్చని తెలిపింది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే యూజర్‌ సైడ్‌బార్‌లో మెసేజెస్‌, బుక్‌మార్క్స్‌ మధ్యలో ‘రైట్‌(Write)’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి టైటిల్‌, హెడర్‌ ఫొటో పెట్టి.. చెప్పాలనుకున్న విషయాన్ని టైప్‌ చేయాలి. టైటిల్‌ ప్రివ్యూతో ఈ ‘నోట్స్‌’ వినియోగదారుల టైమ్‌లైన్‌పై ట్వీట్‌ రూపంలో కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే.. ప్రత్యేక లింక్‌తో నోట్స్‌ ఓపెన్‌ అవుతుంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఘనా దేశాలకు చెందిన రచయితలతో ట్విటర్‌.. ఈ ఫీచర్‌కు సంబంధించి పబ్లిక్ టెస్ట్‌ ప్రారంభించింది.

‘కొద్దిమంది రచయితల బృందంతో క్లోజ్డ్ టెస్ట్‌ నిర్వహిస్తున్నాం. తద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించేవారికి ఏ విధంగా ఉత్తమమైన సేవలు అందించవచ్చో తెలుస్తుంది’ అని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ మైక్రో-బ్లాగింగ్ సైట్‌లోని ఒక ట్వీట్‌లో గరిష్ఠంగా 280 క్యారెక్టర్స్‌ వరకు రాసుకొనే వీలుంది. ఆపై రాయాలనుకుంటే.. మరో ట్వీట్‌ను దానికి జోడించాల్సిందే. సమాచారం ఎక్కువగా ఉంటే.. పదుల కొద్ది ట్వీట్‌లు వరుస కడతాయి. ఈ సమస్యను పరిష్కరించి వినియోగదారుల సౌలభ్యం కోసం ట్విటర్‌ కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని